
MLC Kavitha : లిక్కర్ స్కాం విచారణకు సంబంధించి ఈడీ ట్విస్ట్ ఇచ్చింది. శనివారం ఉదయం 11 గంటల నుంచి ఢిల్లీలో ఎమ్మెల్సీ కవితను విచారించిన అధికారులు.. రాత్రి 8 గంటల 45 నిమిషాల తర్వాత బయటకు పంపారు. కొంచెం గ్యాప్ తీసుకుని ఆమె మీద ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో కవిత అరెస్టు తప్పదని మీడియా హోరెత్తించింది. కానీ అదేమీ జరగలేదు. పింక్ క్యాంపుకు ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే, ముందుంది మొసళ్ళ పండుగ అని బిజెపి నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. వారి వ్యాఖ్యల ఆధారంగా చూస్తే నిజమే అనిపిస్తోంది. ఇప్పటివరకు ఈ కుంభకోణంలో ఈడి అరెస్టు చేసిన వారందరి జాబితాని పరిశీలిస్తే.. ఎవరిని కూడా మొదటిసారే అరెస్టు చేయలేదు. మైండ్ గేమ్ ప్లే చేసీ చేసీ.. ఎన్ని సార్లు, ఎందరు ఢిల్లీకి వస్తారో రండి అని పరోక్షంగా చెప్పీ చెప్పీ.. చివరకు ఎప్పుడో అరెస్టు చేశారు. ఇప్పుడు కవిత విషయంలో కూడా ఈడి అదే మైండ్ గేమ్ ఆడబోతున్నట్టు తెలుస్తోంది.
ఇక లిక్కర్ స్కాం లో కవిత పేరు వినిపించినప్పటి నుంచి కెసిఆర్ బిజెపి నేతలను ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు. కానీ ఆయన అంచనాలను మించి కేంద్ర పెద్దలు అడుగులు వేస్తున్నారు. వాస్తవానికి నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో కవితను మహా అయితే అరెస్టు చేస్తారు, ఏమవుతుంది? అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కానీ కెసిఆర్ అనుకున్నట్టు కవిత అరెస్టు జరగలేదు. ఇప్పట్లో జరిగే అవకాశం కూడా కనిపించడం లేదు. భావోద్వేగాలను రెచ్చగొట్టడంలో దిట్ట అయిన కేసీఆర్.. కవిత అరెస్టును రాజకీయంగా వాడుకుంటాడని సమాచారం ఉన్న నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు మైండ్ గేమ్ స్టార్ట్ చేశాయి.. ఇక బండి సంజయ్ మొన్నా మధ్య చేసిన వ్యాఖ్యలకు ఇవాళ భారత రాష్ట్ర సమితి నాయకులు ఆందోళన చేయడం దానికి నిదర్శనంగా కనిపిస్తోంది. అదే పాడి కౌశిక్ రెడ్డి గవర్నర్ పై అత్యంత హేయమైన భాష వాడినప్పటికీ.. సుమోటోగా తీసుకొని రాష్ట్ర మహిళా కమిషన్.. కవిత విషయంలో మాత్రం వెంటనే స్పందించింది.
మరోవైపు కవిత విచారణకు ఢిల్లీ వెళ్లిన నేపథ్యంలో, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా శుక్రవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. తెలంగాణ భవన్ లో బస చేశారు. జరుగుతున్న పరిణామాలపై ఆరా తీశారు. అయితే కేసీఆర్ సూచన మేరకే వారు ఢిల్లీ వెళ్ళినట్టు తెలుస్తోంది. ఈడిలోని కొంతమంది కీలక అధికారులను హరీష్ రావు, కేటీఆర్ కలిసేందుకు విఫల యత్నం చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక కవిత పై కూడా ఈడీ వర్గాలు పలు ప్రశ్నలు సంధించాయి. ఈ క్రమంలో ధ్వంసమైన ఫోన్లు, అందులో నుంచి రికవరీ చేసిన డేటా, సెండ్ చేసిన మెసేజ్ లు అన్నింటిపై ఆరా తీసినట్టు సమాచారం. పైగా ఆమె మాజీ ఆడిటర్ బుచ్చిబాబు,అరుణ్ పిళ్లై, అభిషేక్ నాయర్, అభిషేక్ రావు వంటి వారితో పరిచయం ఎలా ఏర్పడింది, వారితో ఎందుకు ఆర్థిక లావాదేవీలు నిర్వహించారు? ఢిల్లీలోని బెంగాల్ బజార్ నుంచి హైదరాబాద్కు 100 కోట్లు హవాలా మార్గంలో ఎలా పంపించారు? అసలు ఫోన్లు ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది? వంటి వాటిపైన ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. ముఖ్యంగా ఢిల్లీ ప్రభుత్వానికి 50 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పి, కమిషన్ మీద కమిషన్ తీసుకొని ప్రభుత్వానికి నష్టం వచ్చేలా ఎందుకు చేశారని ప్రశ్నించినట్లు సమాచారం. అయితే ఇలాంటి ప్రశ్నలు ఊహించని కవిత, వాటికి సమాధానం చెప్పే సమయంలో నీళ్లు నమిలి నట్టు తెలుస్తోంది. పైగా ఆమె వాడుతున్న ఫోన్ తెప్పించుకొని అందులో పలు విషయాలను పరిశీలించారు. కీలకమైన డాటా బ్యాకప్ తీసుకొని స్టోర్ చేసుకున్నారు. ఇందులో వారు పరిశీలించిన అంశాల ఆధారంగా 16వ తేదీన మళ్లీ కవితను ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది.. మొత్తంగా శనివారం ఈడీ వ్యవహరించిన తీరుతో తెలంగాణ మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా కూడా ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ఏర్పడింది. కానీ చివర్లో ఈడీ ట్విస్ట్ ఇవ్వడంతో తర్వాత ఏం జరుగుతుందోనన్న టెన్షన్ మొదలైంది.