ED On Casino Case: ఆ మధ్య సంచలనం సృష్టించిన చికోటి ప్రవీణ్ క్యాసినో కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్, సుశీ ఇన్ ఫ్రా కంపెనీ పై జిఎస్టి అధికారుల దాడుల తర్వాత ఈ కేసు తెరపైకి రావటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. టిఆర్ఎస్ నేతలే కాదు ఏపీ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు ఈ కేసులో ఉన్నట్టు తెలుస్తోంది.. నేపాల్ కు సంబంధించిన ఒక ఈవెంట్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల నుంచి హాజరైన, ఆహ్వానాలు అందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 18 మంది వరకు ఇందులో ఉన్నారని వీడి అధికారులు అంటున్నారు. రెగ్యులర్ కస్టమర్ల సంఖ్య 280 దాకా ఉందని చెబుతున్నారు. అయితే వీరిలో ఎక్కువమంది స్థిరాస్తి వ్యాపారులు, సమాజంలో హోదా ఉన్నవారు, అధికార పార్టీకి చెందిన నాయకులు, వారి బంధువులు ఇందులో ఉన్నారు.. ఇక చికోటి ప్రవీణ్ ఈ ఏడాది మే నెలలో కొన్నిచోట్ల, జూన్ లో గోవా, నేపాల్ లో వెగాస్ బై బిగ్ డాడీ పేరుతో స్పెషల్ ఈవెంట్లు చేశాడు. వీటిని టాలీవుడ్, బాలీవుడ్ కు చెందిన నటీమణులతో ప్రమోట్ చేయించాడు. ఇందులో టాలీవుడ్ నటి ఈషా రెబ్బ కూడా ఉంది. క్యాసినో ఎంట్రీ ఫీజు మొదలు, విమాన టికెట్లు, వసతి ప్రకటించారు.

డబ్బులు చేతులు మారాయి
ఈ వ్యవహారం మొత్తం హవాలా మార్గంలో సాగిందని ఈడి గుర్తించింది. ఈ వ్యవహారంపై ఆగస్టులో కేసు నమోదు చేసింది. ఆ తర్వాత చికోటి ప్రవీణ్ వెల్లడించిన వివరాలతో 35 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. 11 మందిని విచారించింది. తాజాగా నేపాల్ ఈవెంట్ సంబంధించి చిట్టాను చేజిక్కించుకుంది. మరికొందరికి నోటీసులు జారీ చేస్తోంది.
తలసాని సోదరులు కూడా
రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు తలసాని మహేష్ యాదవ్, తలసాని ధర్మ యాదవ్ ఈడి అధికారుల ఎదుట హాజరయ్యారు. ఉదయం నుంచి రాత్రి వరకు సుదీర్ఘంగా విచారణ సాగింది. గతంలో తలసాని సోదరులు ప్రవీణ్ తో కలిసి విదేశాలకు వెళ్లారు. ఆయన ఫామ్ హౌస్ లో నిర్వహించిన పార్టీలకు వెళ్లారు.

ఇందులో తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రవీణ్ కు, తలసాని సోదరులకు మధ్య జరిగిన ఫోన్ కాల్స్, వాట్సప్ చాటింగ్ ఆధారంగా ఈడీ అధికారులు విచారణ నిర్వహించారు. ఇక ప్రవీణ్ పుట్టినరోజు వేడుకల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నేపాల్ ఈవెంట్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై ఈడి ప్రధానంగా దృష్టి సారించింది. ఈ క్రమంలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ, అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, మెదక్ డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి తో పాటు మరికొందరికి ఈడి నోటీసులు జారీ చేసింది. అయితే వీరంతా కూడా కోట్లల్లో క్యాసినో ఆడారని ఈడీ అధికారులు చెప్తున్నారు. పూర్తి ఆధారాల కోసం ఈ డి అధికారులు ఇంకా లోతుగా విచారణ జరుపుతున్నారు.