Economic Survey 2025
Economic Survey 2025 : ఫిబ్రవరి 1, 2025న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సామాన్యులు ఆశగా ఎదురు చూస్తున్నారు. నిర్మలా సీతారామన్‌కు ఇది వరుసగా ఎనిమిదవ బడ్జెట్ కావడం విశేషం. అంతేకాకుండా 8 కేంద్ర బడ్జెట్‌లను సమర్పించిన మొదటి కేంద్ర ఆర్థిక మంత్రిగా కూడా నిర్మలా సీతారామన్ రికార్డులకెక్కనున్నారు. 2019, మే 31న ఆర్థిక మంత్రిగా ప్రధాని మోడీ రెండో టర్మ్‌లో బాధ్యతలు తీసుకున్న నిర్మలా సీతారామన్ ఆ ఏడాది తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అనంతరం 2020-21, 2021-22, 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు పూర్తి బడ్జెట్‌ను ప్రకటించారు. ఈ ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఫిబ్రవరి 1న 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్-ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను సమర్పించారు. ఇప్పుడు మరోసారి సమగ్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో వరుసగా ఆరుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన గత ఆర్థిమంత్రి మోరార్జీ దేశాయ్ రికార్డును నిర్మలా సీతారామన్ అధిగమించారు. 1959-64 మధ్యకాలంలో మోరార్జీ దేశాయ్ ఐదు సమగ్ర, ఒక ఓట్-ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను అందించారు.
బడ్జెట్ ముందు ప్రభుత్వం ఆర్థిక సర్వేను ప్రకటిస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక పనితీరును అంచనా వేయడం 2024-25 ఆర్థిక సర్వే ఉద్దేశ్యం. ఈ సర్వే తయారీ, సేవల వంటి పరిశ్రమలలోని సవాళ్లను పరిష్కరించడానికి, వృద్ధిని ప్రోత్సహించడానికి ఎలాంటి విధానాలను రూపొందించాలో వెల్లడిస్తుంది.
ఆర్థిక సర్వే అంటే ఏమిటి?
ఆర్థిక సర్వే అనేది దేశ ఆర్థిక వ్యవస్థ వివరణాత్మక విశ్లేషణను అందించే పత్రం. దీనిలో కొన్ని నిర్దిష్ట రంగాలపై దృష్టి పెట్టబడింది. ఇది రెండు భాగాలుగా విభజించబడింది – మొదటి భాగం ఆర్థిక పనితీరును అంచనా వేస్తుంది.. దీనిలో విద్య, పేదరికం, వాతావరణ మార్పు వంటి సామాజిక-ఆర్థిక సమస్యలను విశ్లేషిస్తుంది. రెండవ భాగంలో GDP వృద్ధి, ద్రవ్యోల్బణం, వాణిజ్యం అంచనాలను కూడా విశ్లేషిస్తారు.
ఆర్థిక సర్వే ఎప్పుడు విడుదల అవుతుంది?
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై ఏప్రిల్ 4న ముగుస్తాయి. సాధారణంగా బడ్జెట్ ప్రసంగానికి ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. అంటే, దీనిని జనవరి 31న ప్రవేశపెడతారు.
ఆర్థిక సర్వేను ఎవరు తయారు చేస్తారు?
ఆర్థిక సర్వేను ఆర్థిక వ్యవహారాల శాఖలోని ఆర్థిక విభాగం తయారు చేస్తుంది. ఇది ప్రధాన ఆర్థిక సలహాదారు పర్యవేక్షణలో తయారు అవుతుంది. అయితే బడ్జెట్‌కు ముందు ఆర్థిక మంత్రి దీనిని విడుదల చేస్తారు.
ఆర్థిక సర్వేలో ఏ విషయాలు ఉంటాయి ?
ఆర్థిక సర్వేలోని రెండు భాగాలు వ్యవసాయం, పారిశ్రామిక ఉత్పత్తి, మౌలిక సదుపాయాలు, ఉపాధి, ద్రవ్య సరఫరా, ధరలు, దిగుమతులు-ఎగుమతులు, విదేశీ మారక నిల్వలు వంటి ఆర్థిక సూచికలను ప్రస్తావిస్తాయి. ఇది ఆర్థిక వ్యవస్థను ఏది ప్రభావితం చేస్తుందో, ప్రభుత్వ ఆర్థిక వ్యూహంపై దాని ప్రభావం ఏమిటో చూపిస్తుంది.
ఆర్థిక సర్వేను ఎక్కడ, ఎలా చూడాలి?
దీని ప్రత్యక్ష ప్రసారాన్ని సంసద్ టీవీ, పిఐబి ఇండియా ఛానెల్‌లో చూడవచ్చు. ఇది కాకుండా దీనిని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఫేస్‌బుక్ పేజీ లింక్‌లో కూడా చూడవచ్చు. లైవ్ అప్ డేట్స్ కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారిక ఎక్స్ హ్యాండిల్‌ను కూడా ఫాలో కావచ్చు.