K A Paul Praja Shanthi Party: దేశంలో జాతీయ పార్టీలతో పాటు వందలాది సంఖ్యలో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అయితే వీటిలో ఎన్నికల సంఘం గుర్తింపు ఉన్నది కొన్నింటికే. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద కుప్పలు తెప్పలుగా రాజకీయ పార్టీలు రిజిస్టర్ అవుతుంటాయి. కానీ వాటిలో కొన్నే ప్రజా క్షేత్రంలో నిలుస్తుంటాయి. ఎన్నికల్లో పోటీచేస్తుంటాయి. ఎన్నికల కార్యకలపాలు నిర్వహిస్తుంటాయి, అయితే చాలామంది రాజకీయ పార్టీలను స్థాపించడం.. అనక నడపలేక జాతీయ పార్టీలోవిలీనం చేయడం చేస్తుంటారు. అయితే ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించని పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. వాటి గుర్తింపును రద్దుచేసింది. మరి కొన్నింటిని తమ జాబితా నుంచే తొలగించింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం.. రిజిస్టర్ అయ్యే రాజకీయ పార్టీలు ఐదేళ్ల లోపు ఎలక్షన్ కమిషన్ నిర్వహించే ఎన్నికల్లో విధిగా పోటీచేయాలి. పోటీచేయకుంటే మాత్రం రిజిస్టర్ అయిన పార్టీల జాబితా నుంచి ఆ పార్టీని తొలగిస్తారు. ఇప్పటివరకూ ఇలా జాబితా నుంచి తొలగించిన పార్టీల సంఖ్య 537గా ఈసీ పేర్కొంది.

256పార్టీలపై వేటు
ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించని.. ఎన్నికల్లో పోటీచేయని రాజకీయ పార్టీలపై ఈసీ వేటు వేసింది. తాజాగా దేశ వ్యాప్తంగా 256రాజకీయ పార్టీల గుర్తింపును… వాటికి కేటాయించిన గుర్తులను రద్దు చేసింది. అసలు మనుగడలో లేని 86 పార్టీల ను తన జాబితా నుంచి తప్పించింది. అందులో తెలంగాణా నుంచే 20 పార్టీలు ఉండడం విశేషం. క్రియాశీలకంగా లేవని చెబుతూ వాటిని రద్దు పద్దులో ఈసీ చేర్చింది. అందులో కేఏ పాల్ కు చెందిన ప్రజాశాంతి పార్టీ కూడా ఉండడం విశేషం. యాక్టివ్ గా లేని పార్టీలకు కామన్ సింబల్ నిలిపివేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈసీ తాజా నిర్ణయంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎలా స్పందిస్తారో చూడాలి.
తెలంగాణలో అధికం…
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా పార్టీలు పురుడు పోసుకున్నాయి. అందరి ఆకాంక్ష తెలంగాణ సాధించడమే అయినా వేర్వేరు సైద్ధాంతికంగా విభేదించి చాలా మంది కొత్త పార్టీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎలక్షన్ కమిషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే తెలంగాణ సిద్ధించిన తరువాత చాలామంది సైలెంట్ అయ్యారు. తాము రిజిస్ట్రేషన్ చేయించుకున్న పార్టీల సంగతి మరిచిపోయారు. అటువంటి కాలం చెల్లిన పార్టీలపై ఈసీ దృష్టిసారించింది. గత ఐదేళ్లలో ఎన్నికల్లో పోటీచేయకుండా.. అసలు కార్యకలాపాలు చేయని పార్టీలను రద్దుచేసింది.
రద్దు జాబితాలోకి 20పార్టీలు..
తెలంగాణలో దాదాపు 20 పార్టీలు రద్దు జాబితాలో చేరాయి. ఆల్ ఇండియా మహిళా డెమొక్రటిక్ ఫ్రంట్, భారతీయ యువత, సమత, రాష్ట్రీయత కాంగ్రెస్ పార్టీ, నవ తెలంగాణ పార్టీ, ప్రజా చైతన్య పార్టీ, త్రిలింగ ప్రజా ప్రగతి పార్టీ, అఖండ్ భారత్ నేషనల్ పార్టీ, అఖిలాంధ్ర మహాదేశం, ఆలిండియా ముక్తిదళ్ పార్టీ, ఆలిండియా ముత్తహిద్ క్యుయామి మహాజ్, ఆంధ్రప్రదేశ్ నవోదయ ప్రజాపార్టీ, భారత్ అభ్యుదయ్ పార్టీ, మన పార్టీ, నేషనలిస్ట్ తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రజా భారత్ పార్టీ, ప్రజా పార్టీ, ప్రజాశాంతి పార్టీ, తల్లి తెలంగాణ పార్టీ, యూత్ డెమొక్రటిక్ ఫ్రంట్, సెక్యులర్ డెమొక్రటిక్ లేబర్ ఆఫ్ ఇండియా, సురాజ్ పార్టీలు ఈ జాబితాలో ఉన్నాయి.
స్పందన లేకపోవడంతో…
గతంలోనూ పలు పార్టీలపై ఈసీ వేటు వేసింది. మేలో 87, జూన్ లో 111 పార్టీలను గుర్తింపు జాబితా నుంచి తొలగించింది. తాజాగా 257 పార్టీలపై వేటు వేసింది. చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ల నివేదిక మేరకు తొలగించినట్టు పేర్కొంది. ప్రధానంగా తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ , కర్నాటక, బిహార్; ఉత్తర్ ప్రదేశ్ లో ఇటువంటి పార్టీలు ఉన్నాయని గుర్తించింది. దీనిపై ఆయా పార్టీలకు నోటీసులుకూడా జారీచేసింది. కానీ ఎటువంటి స్పందన లేకపోవడంతో వాటిని జాబితా నుంచి తొలగించడమే కాకుండా గుర్తు,గుర్తింపును రద్దుచేసింది. ఈ నిర్ణయంపై బాధిత పార్టీకి అసంతృప్తి, అభ్యంతరాలుంటే ఈసీకి తెలియజేసే అవకాశమిచ్చింది. అన్ని ఆధారాలతో ఈసీని సంప్రదిస్తే పున పరిశీలన జరిపి సవ్యంగా ఉంటే గుర్తింపు, గుర్తును పునరుద్ధరించే అవకాశమైతే ఉంది.