Election Commission of India: ప్రజాస్వామ్యాన్ని ధన స్వామ్యం శాసిస్తున్న రోజులివి. పార్టీలను కార్పొరేట్లు, అక్రమార్కులు నడిపిస్తున్న రోజులివి. మన వ్యవస్థల్లో లోపాల కారణంగా వారు పాపాలు చేసేందుకు ఆస్కారం ఏర్పడుతున్నది. ఫలితంగా ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన అనే నియమాలతో ఏర్పడిన ప్రజాస్వామ్యం నిత్యం నగుబాటుకు గురవుతున్నది. ఇలాంటి స్థితిలో ఈసీ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యం పై ప్రజలకు కొత్త ఆశలు చిగురింపజేస్తున్నది.
నాలుగేళ్ల కిందట నిర్ణయం
పన్ను రాయితీల కోసం, ఇతర రాజకీయ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేస్తున్న రాజకీయ పార్టీల సంఖ్య దేశంలో ఎక్కువ అవుతున్నది. నానాటికీ వ్యవస్థకు కళంకంగా మారుతున్న ఈ పార్టీల గుర్తింపును రద్దు చేయాలని ఈసీ( ఎన్నికల కమిషన్) గట్టి పట్టుదలతో ఉంది. పార్టీని రిజిస్టర్ చేసే అవకాశం తో పాటు దాన్ని రద్దు చేసే అధికారాన్ని కూడా తనకు ఇవ్వాలని కేంద్ర న్యాయ శాఖను కోరుతోంది. ఇప్పటికే తన వద్ద రిజిస్టర్ అయిన “198 కాగితపు పార్టీలను” యాసిడ్ వేసి కడుగుతోంది. అంతేనా సదరు 198 ఆర్ యూపీపీ లను తన రిజిష్టర్ నుంచి తొలగించింది. కొందరితో కూడిన వ్యక్తుల సమూహాన్ని రాజకీయ పార్టీగా గుర్తించే అధికారం ఈసీకి ఎన్నికల చట్టం కలిపిస్తోంది. దాన్ని రిజిష్టర్ రద్దు చేసే అధికారం లేకపోవటంతో ఉదాత్తమైన ఆశయాలు గంగలో కలుస్తున్నాయి. పరిస్థితి నానాటికీ చేయి దాటి పోతుండటంతో ఇటీవల ఎన్నికల కమిషన్ ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కేంద్ర శాసన వ్యవహారాల(న్యాయ శాఖ పరిధిలో) కార్యదర్శి ని కలిశారు. నాన్ సీరియస్ పార్టీల రద్దు అవకాశాన్ని ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం తమకు కలిపించాలని కోరారు. వాస్తవానికి ఈ విషయం ఈ నాటిది కాదు. నాలుగేళ్ల కిందటే ఈసీ సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ రూపంలో రాసింది. వాస్తవానికి చాలా రాజకీయ పార్టీలు కాగితాల మీద నే ఉంటున్నాయి. పన్ను మినహాయింపు, ఇతర రాజకీయ ప్రయోజనాల కోసమే అవి ఏర్పాటవుతున్న ట్టు ఈసీ భావిస్తోంది. వీటి గుర్తింపు రద్దు చేస్తేనే వ్యవస్థ బాగుపడుతుందని ఈసీ నమ్ముతోంది.
Also Read: Abortion Law in US: గర్భస్రావ చట్టంలో మార్పులు అమెరికాకు ఇప్పుడు భారత్ ఆశాదీపం
రిజిస్టర్ అయినవి ఎన్నో
దేశవ్యాప్తంగా 8 జాతీయ పార్టీలు ఉన్నాయి. 50కిపైగా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. 2,800 పార్టీలు రిజిస్టర్ అయి గుర్తింపు లేకుండా ఉన్నాయి. అయితే వీటి గుర్తింపు రద్దు చేసే అధికారం కనుక ఇస్తే వాటి రాజకీయాల్లోకి, కార్యక్రమాలు, సిద్ధాంతాల అమల్లోకి ఈసీ ప్రవేశించాల్సి వస్తుంది. అందుకే కేంద్రం ఆ అధికారం ఇవ్వకుండా ఉపేక్షిస్తున్నట్టు తెలుస్తోంది.
మే 25 న లేఖ
అసలు చిరునామాలు లేని ఆర్ యూపీపీ ల కథా కమామీషు కనుక్కునేందుకు ఎన్నికల కమిషన్ మే 25న ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులకు లేఖలు రాసింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 29ఏ, 29సీ సెక్షన్ల ప్రకారం ఈసీ ఆదేశాలకు కట్టుబడని ఆర్ యూపీపీ ల పై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ క్రమంలో తన ఆదేశాలను పాటించని 87 ఆర్ యూపీపీ లను జాబితా నుంచి తొలగించింది. జూన్ 20న 111 అంటే మొత్తం 198 ఆర్ యూపీపీ లను డిలిట్ చేసింది. పంపిన లేఖలు తిరిగిరావడం, ఆ చిరునామాలో పార్టీ కార్యాలయం లేకపోవటంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. వీటిల్లో 3 ఆర్ యూపీపీలు ఆర్థిక అవకతవకలకు పాల్పడటంతో క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కేంద్ర రెవెన్యూ విభాగానికి నివేదించింది. ఇక అందుకున్న విరాళాల గురించి 2017-18లో 1897 ఆర్ యూపీపీలు, 2018-19 లో 2,202 ఆర్ యూ పీపీలు, 2019-20లో 2,351 ఆర్ యూ పీపీలు వివరాలు సమర్పించ లేదు. ఇక వీటిల్లో 66 పార్టీలు విరాళాల వివరాలు సమర్పించ కుండా ఆదాయ పన్ను రాయితీ పొందాయి.
1998 నుంచి కోరుతోంది
ఆర్ యూపీపీల రిజిస్ట్రేషన్ రద్దు అధికారం ఇవ్వాలని ఈసీ 1998 నుంచే కోరుతోంది. 2004 లో ఎన్నికల్లో చేపట్టాల్సిన సంస్కరణల గురించి ఇరవై రెండు అంశాలతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి అందజేసింది. అవన్నీ కూడా ఆమోదకరమైనవేనని 2010లో కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. ఇక 2005 నుంచి 2015 వరకు ఎన్నికల్లో పోటీ చేయని ఆర్యుపిపిలను ఎన్నికల కమిషన్ స్వయంగా చొరవ తీసుకొని గుర్తించింది. కాగితాల మీద ని ఏర్పాటు చేసే పార్టీ ల వల్ల ప్రజాస్వామ్యం అర్థం మారుతోందని ఈసీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉన్నందున, మోదీ కనుక ఒక నిర్ణయం తీసుకుంటే ప్రజాస్వామ్యానికి, అందులో దేశ రాజకీయాలకు మంచి రోజులు వచ్చినట్లే.
Also Read:Indian Politicians – Industrialist : నేతలు.. వారి కొత్త రకం బినామీ అవినీతి కథలు