https://oktelugu.com/

YCP: వైసీపీకి ఈసి షాక్

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్ చొప్పున నియమించారు.

Written By:
  • Dharma
  • , Updated On : February 16, 2024 / 01:07 PM IST
    Follow us on

    YCP: వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఒకవైపు నేతలు ఆ పార్టీని వీడుతుండగా.. మరోవైపు వాలంటీర్లకు ఎన్నికల విధులు అప్పగించవద్దని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో జగన్ అసలు లక్ష్యానికి గండి పడింది. అటు సచివాలయ ఉద్యోగులను సైతం కేవలం పోలింగ్ బూత్ లో ఇంకు పూసే పనికి మాత్రమే వినియోగించాలని స్పష్టమైన ఆదేశాలు కోర్టు ఇచ్చింది. దీంతో వైసిపి నేతల ఆశలు నీరుగారిపోయాయి. సచివాలయ ఉద్యోగుల సహకారంతో ఎన్నికల్లో లబ్ధి పొందాలని వైసిపి భావించింది. కానీ దీనికి ఈసీ బ్రేక్ వేసింది.

    వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్ చొప్పున నియమించారు. వారితోనే సంక్షేమ పథకాలు, పౌర సేవలు అందిస్తున్నారు. అయితే వారంతా వైసీపీ సానుభూతిపరులే. ఈ విషయాన్ని ఆ పార్టీ కీలక నేతలు విజయసాయిరెడ్డి ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం వైసిపి గెలుపునకు వాలంటీర్లు ఎంతగానో దోహదపడ్డారు. దీంతో సార్వత్రిక ఎన్నికల్లో సైతం వారి సేవలను వినియోగించుకోవాలని వైసిపి భావించింది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సచివాలయ ఉద్యోగుల నియామకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. వారు ఎన్నికల విధుల్లో ఉంటే అనుకూలంగా పనిచేస్తారని వైసీపీ అంచనా వేసింది. కానీ వారి సహాయం ఇంకుపోసే వరకు మాత్రమేనని కోర్టు తేల్చి చెప్పడంతో వైసీపీకి షాక్ తగిలినట్లు అయ్యింది.

    ఇప్పటికే వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు ప్రాధాన్యమిచ్చిన జగన్ సర్కార్.. స్థానిక సంస్థల ప్రతినిధులను దూరం చేసుకుంది. సర్పంచ్, ఎంపీటీసీ,జడ్పిటిసి లను ఉత్సవ విగ్రహాలుగా మార్చింది. వాలంటీర్లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని చూసింది. వచ్చే ఎన్నికల్లో వారే కీలకమని భావించింది. అటు విపక్షాలు సైతం ఈ విషయంలో ఆందోళన చెందాయి. వారి అండదండలతో అధికారపక్షం రెచ్చిపోతుందని అనుమానించాయి. అయితే తాజాగా కోర్టు ఆదేశాలతో ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్లకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని.. సచివాలయ సిబ్బందికి కేవలం ఇంకుపోసే పని మాత్రమే అప్పగించాలని స్పష్టం చేసింది. ఓటర్ల జాబితాలో అవినీతి వెలుగులోకి రావడంతో ఈసీ జాగ్రత్త పడింది. ప్రతి పోలింగ్ బూత్ లో ఒకరు మాత్రమే ఉండాలని.. గతంలో బూత్ లెవెల్ ఆఫీసర్ గా పని చేసిన వారిని విధుల్లోకి తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు సీఈసీ ఇచ్చిన ఆదేశాలను సీఈఓ మీనా జిల్లా కలెక్టర్లకు పంపారు. దీంతో ఓటర్లను వాలంటీర్ల ద్వారా ప్రభావితం చేయాలనుకున్న వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లు అయ్యింది.