KCR: అసెంబ్లీ ఎన్నికలవేళ ఎలక్షన్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. పలు జిల్లాలకు చెందిన కలెక్టర్లు, ఎస్పీల పై వేటు వేసింది. ముఖ్యంగా రాజధాని పరిధిలోని పలు జిల్లాల తో పాటు, ఇతర జిల్లాలకు చెందిన కలెక్టర్లు, ఎస్పీల పై ఈసీ బదిలీ వేటు వేసింది. రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, నిర్మల్ జిల్లాల కలెక్టర్ల బదిలీకి ఆదేశాలు జారీ చేసింది. 13 మంది ఎస్పీలు, పోలీస్ కమిషనర్లను బదిలీకి ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన శాఖలకు వెంటనే ప్రత్యేక కార్యదర్శులను నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. గురువారం సాయంత్రం ఐదు గంటలలోపు వాటిని ప్యానెల్ కు పంపాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్, నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, వరంగల్ సీపీ రంగనాథ్, నిజామాబాద్ సిపి సత్యనారాయణ, రవాణాశాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ శ్రీదేవి, ఎక్సైజ్ శాఖ సంచాలకుడు ముషారఫ్ అలీ, సంగారెడ్డి ఎస్పీ రమణ కుమార్, కామారెడ్డి ఎస్పీ శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎస్పీ భాస్కర్, మహ బూబ్ నగర్ ఎస్పీ నరసింహ, నాగర్ కర్నూల్ ఎస్పీ మనోహర్, జోగులాంబ గద్వాల ఎస్పీ సృజన, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, మహ బూబాబాద్ ఎస్పీ చంద్రమోహన్, భూపాలపల్లి ఎస్పీ కరుణాకర్, సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్..ఈసీ బదిలీ ఉత్తర్వులు అందుకున్న వారిలో ఉన్నారు.
అయితే వీరు మాత్రమే కాకుండా ఇంకా కొంతమంది కీలకమైన కలెక్టర్లు, ఎస్పీ లపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈసీకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు సమర్పించిన ఆధారాలను బేరీజు వేసుకొని ఈసీ తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, డిజిపి, సీఎస్ ల పై ఇటీవల ఎన్నికల సంఘం అధికారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బిజెపి నాయకులు కూడా వారిపై ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఎన్నికల నేపథ్యంలో వారిపై కూడా బదిలీ వేటు పడే అవకాశం ఎన్నికల సంఘం అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే రాష్ట్రంలో ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో అధికారులపై వేటు పడిన నేపథ్యంలో తదుపరి చర్యలు కూడా ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా కొన్ని సంవత్సరాలుగా కీలక పోస్టుల్లో పాతుకుపోయిన అధికారులపై ఈసీ బదిలీ వేటు వేసే అవకాశం ఉందని సమాచారం.