Assembly Elections: 2024లో కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ఏ పార్టీ అన్నది తేలబోతోంది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలోకి రావాలంటే దగ్గరి దారి ‘ఉత్తరప్రదేశ్’. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం ఇదీ.. దాదాపు 403 అసెంబ్లీ సీట్లు.. 80 ఎంపీ సీట్లు ఉన్న యూపీలో గెలిచిన పార్టీయే కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. పోయిన ఎంపీ ఎన్నికల్లో 70కిపైగా ఎంపీ సీట్లు గెలిచి ఎవరి సపోర్టు లేకుండా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. మరి ఇప్పుడు మరోసారి యూపీలో బీజేపీ గెలుస్తుందా? లేదా? అన్నది ఆసక్తి రేపుతోంది.
దేశంలోని అతిపెద్ద రాష్ట్రం యూపీతోపాటు పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. మొత్తం ఐదురాష్ట్రాల్లోని 690 అసెంబ్లీ స్థానాలకు 7 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు విడతల్లో పోలింగ్ జరుపనున్నట్లు సీఈసీ తెలిపారు. మార్చి 10న కౌంటింగ్ చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. యూపీలో 7 దశల్లో, మణిపూర్ లో రెండు దశల్లో.. పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ లో ఒకే దశలో ఫిబ్రవరి 14న ఎన్నికలు జరుగనున్నాయి.
అయితే అన్ని రాష్ట్రాల కంటే యూపీ, పంజాబ్ ఆసక్తి రేపుతోంది. మిగతా రాష్ట్రాలన్నీ చిన్నవే. వాటికి పెద్దగా ప్రాధాన్యత లేదు. ఇందులో యూపీలో గెలిచిన పార్టీనే కేంద్రంలో అధికారంలో ఉంటుంది. బీజేపీ గెలిస్తేనే 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుస్తుంది. ఇక్కడ ఓడిపోతే మరోసారి దేశంలో అధికారంలోకి రావడం కష్టమే.
ప్రజల నాడిని తెలుసుకునేందుకు ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు ప్రామాణికం అని చెప్పొచ్చు. ఇవే బీజేపీకి పరీక్ష పెట్టనున్నాయి. రైతుల ఆందోళనతో పంజాబ్ లో ఎలానూ బీజేపీ గెలవదు. ఉత్తరప్రదేశ్ లో కూడా గెలవకపోతే ఇక కేంద్రంలో మార్పు తధ్యమని.. బీజేపీ గెలిచే అవకాశాలు లేవని అర్థం చేసుకోవచ్చు.