Registrations Are Easy In AP: ఆస్తుల క్రయవిక్రయదారులకు శుభవార్త. ఇక నుంచి బ్యాంకు చలానా కోసం గంటల తరబడి వేచి ఉండనక్కర్లేదు. స్టాంప్ వెండర్ల వద్దే ఆన్ లైన్ చెల్లింపులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. స్టాంప్ డ్యూటీ చెల్లింపునకు ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. కొత్త విధానంలో స్టాంప్ వెండర్లు, గ్రామ వార్డు సచివాలయాలు , కామన్ సర్వీస్ సెంటర్లలో ఆన్ లైన్ లో చార్జీలు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రయోగాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా 71 మంది స్టాంప్ వెండర్లను ఎంపిక చేసింది. విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి నిర్ణయించింది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ ఇంకా సచివాలయాల్లో సాంకేతికత అందుబాటులోకి రాకపోవడం, భవన నిర్మాణ పనులు జరగకపోవడంతో ముందు స్టాంప్ వెండర్లతో పని మొదలు పెట్టింది. వీరికి స్టాంప్ డ్యూటీ ఆథరైజేషన్ కలెక్షన్ సెంటర్ (ఏసీసీ) పర్మిషన్లు ఇచ్చారు. ఈ విధానం కానీ పూర్తిస్థాయి అమల్లోకి వస్తే మాత్రం వినియోగదారులు బ్యాంకుకు వెళ్లకుండా నేరుగా స్టాంప్ వెండర్ల వద్దే స్టాంప్ డ్యూటీని చెల్లించవచ్చు. చాలా తేలికంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.
ఓ సంస్థతో ఒప్పందం..
రిజిస్ట్రేషన్ శాఖలో కొత్త సంస్కరణలు అమలుచేస్తున్నా అవి మంచి ఫలితాలునివ్వడం లేదు. ఆశించిన స్థాయిలో విజయవంతం కావడం లేదు. అందుకే ఏపీ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలను తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాలు, స్టాంప్ వెండర్లు, కామన్ సర్వీసు సెంటర్ల ఎంపిక విషయంలో పూర్తిగా పారదర్శక పాటించనుందని ఆయా శాఖ అధికారులు చెబుతున్నారు. బ్యాక్ గ్రౌండ్ చూసుకొని.. అందుకు తగ్గ ష్యూరిటీ తీసుకొని మాత్రం ఆన్ లైన్ చెల్లింపు బాధ్యతలను అప్పగించనున్నారు. అయితే ఈ కొత్త విధానం అమలు విషయంలో రిజిస్ట్రేషన్ శాఖ పక్కా వ్యూహంతో ముందుకెళుతోంది. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థకు నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. ఇందుకుగాను వారితో ముందస్తుగా ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు అనుసంధానం చేస్తారు. ఈ సంస్థ స్టాంప్ వెండర్లతో ఒప్పందం చేసుకొని స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను కట్టించుకునేందుకు సాంకేతిక సహకారం అందిస్తుంది. ఇందులో భాగంగా ఏ రోజు వచ్చిన చార్జీలను ఆ రోజు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి జమ చేస్తుంది. దీని ద్వారా వినియోగదారుల విలువైన సమయం ఆదా అవుతుంది. లేకుంటే చాలానా కట్టేందుకే గంటల సమయం పడుతుంది. బ్యాంకుల వద్ద పడిగాపులు తప్పవు. రోజంతా సమయం పడుతుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వీరికి ప్రయోజనం కలగనుంది.
Also Read: Revanth Reddy: ఏడాది ప్రస్థానం: కాంగ్రెస్ ను ఏకం చేస్తున్న రేవంత్ రెడ్డి.. ఏడాదిలో ఏం చేశాడు?
ఆ కేసులు ఏమైనట్టో?
గతంలో రిజిస్ట్రేషన్ శాఖలో నకిలీ చలానా ల వ్యవహారం దుమారమే రేపింది. రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయల అవినీతి బాగోతం బయటపడింది. ఇందులో రిజిస్ట్రేషన్ అధికారులు, సిబ్బంది పాత్ర బయటపడింది. కొందరు దస్తావేజు లేఖరుల సాయంతో ప్రభుత్వ ఆదాయానికి గణనీయంగా గండికొట్టారు. దీనిపై ఎక్కడికక్కడే పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కేసులు సైతం నమోదయ్యాయి. కానీ ఎందుకో కేసు విచారణలో పురోగతి లేకుండా పోయింది. బహుశా పెద్ద తలకాయలు ఉండడం వల్లేనన్న అనుమానాలైతే ఉన్నాయి. ఇటువంటి తప్పిదాలు, లోపాలకు చెక్ చెబుతూ ప్రభుత్వం కొత్త గా ఈ నిర్ణయం తీసుకోవడంపై మాత్రం అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: Chandrababu: చంద్రబాబు ఎప్పుడు మారుతారో? ఇంకా పాత చింతకాయ పాలిటిక్సేనా?