AP Early Elections: ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే హడావుడి ఎప్పటి నుంచో జరుగుతోంది. ముందస్తు ఆలోచనతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హడావుడిగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఆర్ధిక భారమైన కొత్తకొత్త సంక్షేమ పథకాలను ఏపీలో అమలు చేస్తున్నారని ప్రచారం జరగుతోంది. ముఖ్యంగా గడపగడపకూ మన ప్రభుత్వం పేరుతో వైసీపీ ఎమ్మెల్యేలు , మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులను ప్రజల వద్దకు పంపి ప్రభుత్వ పథకాలు గురించి వివరించడంతోపాటు, ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం ఎవరెవరికి ఎంత మేర లబ్ధి చేకూర్చింది అనే వివరాలు సమగ్రంగా చెప్పిస్తున్నారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం ఏర్పడకపోతే ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ నిలిచిపోతాయని, పథకాలు కావాలో లేదో మీరే తేల్చుకోవాలి అంటూ వైసీపీ ప్రజాప్రతినిధులు ప్రజలకు చెబుతున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నరకుపైగా సమయం ఉన్నా హడావుడి చేయడం వెనుక ‘ముందస్తు’ వ్యూహం ఉందన్న ప్రచారం జరుగుతోంది. కానీ వైసీపీ అగ్ర నేతలు మాత్రం ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని ఖండిస్తున్నారు. ఆ ఆలోచనే తమకు లేదని చెబుతున్నారు.

హాట్ టాపిక్‌గా మూడు రాజధానుల అంశం..
ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. అమరావతి ఒక్కటే రాజధానిగా కొనసాగించాలని, ఏపీకి ఒకటే రాజధాని ఉండాలని మూడు రాజధానులు ప్రతిపాదనను అంగీకరించేది లేదు అంటూ అమరావతి పరిసర ప్రాంత రైతులతోపాటు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అమరావతి మహా పాదయాత్ర పేరుతో అమరావతి నుంచి అరసవల్లి వరకు యాత్రను చేపట్టారు. ఈ యాత్ర వివాదాల మధ్య ముందుకు వెళుతుండగా, ఉత్తరాంధ్రకు చెందిన వైíసీపీ కీలక నాయకులు, మంత్రులు ఈ యాత్రపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.
రాజీనామా ఆస్త్రం!
మూడు రాజధానులు ఏపీలో ఉండాల్సిందేనని ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని, అవసరమైతే మూడు రాజధానుల కోసం రాజీనామాలు చేస్తామంటూ వైసీపీ కీలక నాయకులు, మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా రాజీనామా అస్త్రంప్రయోగించడం సంచలనంగా మారింది.

– సీనియర్ పొలిటిషన్ శ్రీకాకుళం ఎమ్మెల్యే, ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామా ఆస్త్రాన్ని సంధించారు. అవసరమైతే మూడు రాజధానుల కోసం రాజీనామా చేస్తానంటూ ఆయన ప్రకటించారు. ఇదే బాటలో ఇతర వైíసీపీ ప్రజాప్రతినిధులు ప్రకటించేందుకు సిద్ధమవుతుండడంతో, మూడు రాజధానులు సెంటిమెంట్ రగిలించి ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో తమకు తిరుగులేకుండా చేసుకోవాలని భావిస్తున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలు ప్రభుత్వం ఉందని, అందుకే ఇప్పుడు మూడు రాజధానుల సెంటిమెంటును మరింత రగల్చేందుకు రాజీనామా అస్త్రాన్ని వైసీపీ ప్రజాప్రతినిధులు సంధిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. రాజకీయ విశ్లేషకులు కూడా రాజీనామా అస్త్రం వెనుక ముందస్తు వ్యూహం ఉందని అభిప్రాయపడుతున్నారు.