Eagle Arjun: దాని పేరు అర్జున్. ఆకాశం లో అలుపు అనేది లేకుండా తిరుగుతుంది. తన చూపుతో ఎంతటి చిన్న వస్తువునైనా కనిపెడుతుంది. అది ప్రమాదకరం అని తెలిస్తే వెంటనే నాశనం చేస్తుంది. చూసి రమ్మంటే కాల్చివచ్చి బూడిదను తీసుకొస్తుంది. అలాగని ఇదేమి యుద్ధ విమానం కాదు. ఫైటర్ జెట్ కాదు. ఇంతకీ ఇదేంటంటే..
పూర్వకాలంలో యుద్ధాలు చేస్తున్నప్పుడు పక్షులను కూడా వాడుకునేవారు. పక్షుల ద్వారా వర్తమానాలు మాత్రమే కాదు.. శత్రువుల సంబంధించిన స్థావరాలను కూడా గుర్తించేవారు. ఆ స్థావరాలను పక్షుల ద్వారానే నాశనం చేయించేవారు. అప్పట్లో ఆ కాలంలో ఆధునికమైన విమానాలు లేవు కాబట్టి రాజులు పక్షులను తమ యుద్ధ తంత్రాలుగా.. యుద్ధానికి ఉపయోగపడే వస్తువులుగా వాడేవారు.
నేటి ఆధునిక కాలంలో అత్యంత సామర్థ్యం ఉన్న విమానాలు.. డ్రోన్లు.. ఇంకా చెప్పాలంటే రకరకాల జెట్ లు యుద్ధాలలో పాలుపంచుకుంటున్నాయి. అయితే ఈ కాలంలో కూడా పక్షులను యుద్ధ రీతులలో.. శత్రువుల స్థావరాలను కనుక్కోవడంలో ఉపయోగిస్తున్నారు. అయితే ఇందులో మన దేశం కూడా ఉంది. మన దేశానికి సంబంధించిన గూడచారి వ్యవస్థ ఒక గద్దను ఏజెంట్ గా వాడుకుంటున్నది. సహజంగా గద్దలు గూడచారులుగా వ్యవహరిస్తుంటాయి. వాటికి సరైన శిక్షణ ఇస్తే ఎలాంటి పని అయినా సరే చిటికెలో చేస్తాయి.
మన దేశ గూడచారి వ్యవస్థ శిక్షణ ఇచ్చిన గద్ద పేరు అర్జున్. ఇది దేశ సైనిక వ్యవస్థకు అండగా ఉంటున్నది. శత్రువుల స్థావరాలపై కన్నేస్తుంది. శత్రువుల కదలికలను నిత్యం కనిపెడుతూనే ఉంటుంది. డ్రోన్లను గుర్తించి నిర్వీర్యం చేస్తుంది. దీనిని మనదేశ గూడచారి వ్యవస్థ ఆకాశరాజు అని పిలుస్తోంది. ఇలాంటి గద్దలు మన దేశ గూడచారి వ్యవస్థ వద్ద చాలా ఉన్నాయి. అయితే అందులో ఎలక్ట్రానిక్ సదుపాయాలు ఉన్న గద్ద మాత్రం అర్జున్ ఒక్కటే. ఇది సరిహద్దుల వెంబడి ప్రయాణిస్తూ ఉంటుంది. ఆకాశమార్గంలోనే శత్రువుల స్థావరాలను పసిగడుతూ ఉంటుంది. శత్రువులు వదిలిపెట్టే డ్రోన్ల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తుంది. మనదేశ గూడచార వ్యవస్థకు చేరవేరుస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో వాటిని నిర్వీర్యం చేసి.. కూల్చివేస్తుంది. ముఖ్యంగా సరిహద్దుల్లో తీవ్రవాదులు చొరబాట్లకి ప్రవేశించినప్పుడు.. అర్జున్ పసిగడుతుంది.. ఎప్పటికప్పుడు సమాచారాన్ని సైన్యానికి చేరవేరుస్తుంది.