spot_img
Homeజాతీయ వార్తలుDRDO next generation weapons: ఇజ్రాయెల్, అమెరికా.. తర్వాత భారతే.. ఇక శత్రుదుర్భేద్యం

DRDO next generation weapons: ఇజ్రాయెల్, అమెరికా.. తర్వాత భారతే.. ఇక శత్రుదుర్భేద్యం

DRDO next generation weapons: యుద్ధాల తీరు మారుతోంది. యుద్ధంలో ఇప్పుడు ఆయుధాలతోపాటు టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తోంది. దీంతో శత్రు భయాలు ఉన్న దేశాలు టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్‌ దేశ రక్షణకు ఐరన్‌ డోమ్‌ తయారు చేసింది. తర్వాత అమెరికా బంగారు డోమ్‌ తయారీపై దృష్టి పెట్టింది. ఈ రెండు దేశాల సరసన ఇప్పుడు భారత్‌ చేరబోతోంది. డీఆర్డీవో జూన్‌ 10, 11 తేదీల్లో ఒడిశాలోని చాందీపూర్‌ ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి జరిపిన మూడు వరుస పరీక్షలు విజయవంతమయ్యాయి. ఈ పరీక్షలు బాలిస్టిక్‌ మిసైల్‌ ముప్పులను అడ్డుకునే బహుళస్థాయి రక్షణ వ్యవస్థను ప్రదర్శించాయి. రెండు అధునాతన ఇంటర్‌సెప్టర్‌ క్షిపణులు నిర్దేశిత లక్ష్యాలను కచ్చితంగా చేధించగలిగాయి. ఈ వ్యవస్థ 2 వేల నుంచి 5 వేల కిలోమీటర్ల పరిధిలో ఉన్న బాలిస్టిక్‌ మిసైల్‌ ముప్పులను గుర్తించి, ట్రాక్‌ చేసి నాశనం చేయగలదు.

ఎండో–ఎక్సో వాతావరణాల్లో పనిచేసే సామర్థ్యం..
ఈ ఇంటర్‌సెప్టర్‌ క్షిపణులు భూమి వాతావరణం(ఎండో–అట్మాస్ఫెరిక్‌), అంతరిక్ష ప్రాంతం(ఎక్సో–అట్మాస్ఫెరిక్‌) రెండింటిలోనూ పనిచేస్తాయి. లాంగ్‌ రేంజ్‌ రాడార్లు, తక్కువ సమయం తీసుకునే కమ్యూనికేషన్‌ వ్యవస్థలు, మిషన్‌ కంట్రోల్‌ సెంటర్లు వంటి అధునాతన సాంకేతికతలతో నెట్‌వర్క్‌ సెంట్రిక్‌ వార్‌ఫేర్‌ సామర్థ్యం కలిగి ఉంది. ఈ పరీక్షలు పేజ్‌ 2 బాలిస్టిక్‌ మిసైల్‌ డిఫెన్స్‌ వ్యవస్థ అభివృద్ధిని పూర్తి చేశాయి.

నౌకా రక్షణలో మొదటి విజయం..
నేవల్‌ యాంటీ–షిప్‌ మిసైల్‌–మీడియం రేంజ్‌ మొదటి ఫ్లైట్‌ టెస్ట్‌ విజయవంతమైంది. ఈ క్షిపణి నౌకల నుంచి ప్రయోగించబడి, సముద్ర లక్ష్యాలపై కచ్చితమైన దిశానిర్దేశం, తక్కువ ఎత్తులో సముద్ర ఉపరితలం దగ్గరగా ప్రయాణించడం, టార్గెట్‌ను కచ్చితంగా చేధించడం వంటి సామర్థ్యాలను ప్రదర్శించింది. ఇది అన్ని వాతావరణాల్లో పనిచేసే, సముద్ర రక్షణను బలపరిచే ముఖ్యమైన అడుగు.

ఎలైట్‌ దేశాల సరసన..
ఈ విజయాలతో భారత్‌ అమెరికా, రష్యా, చైనా, ఇజ్రాయెల్‌ వంటి కొన్ని దేశాలతో సమానంగా బాలిస్టిక్‌ మిసైల్‌ ముప్పులను అడ్డుకునే సామర్థ్యం సాధించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ డీఆర్డీవోను అభినందించారు. డీఆర్డీవో చైర్మన్‌ రాజేశ్‌కుమార్‌ సింగ్‌ కూడా ఈ పరీక్షలను సన్నిహితంగా పర్యవేక్షించి, డీఆర్డీవో, పరిశ్రమల సంయుక్త ప్రయత్నాలను ప్రశంసించారు. ఇది ఆత్మనిర్భర భారత్‌ కార్యక్రమంలో మరో మైలురాయి.

ఈ బహుళస్థాయి రక్షణ వ్యవస్థ రాడార్లు, కమాండ్‌ సెంటర్లు, ఇంటర్‌సెప్టర్‌ క్షిపణుల నెట్‌వర్క్‌తో దేశ భద్రతను మరింత బలోపేతం చేస్తుంది. ఇది వైమానిక, సముద్ర రంగాల్లో ముప్పులను సమగ్రంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని అందించి, భారత్‌ రక్షణ స్వావలంబనను మరింత ముందుకు తీసుకెళ్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version