
నేడు ప్రపంచ వ్యాప్తంగా మందు లేక అలజడి సృష్టిస్తున్న కరోనా వైరస్ కు భారత్ లో విశేషంగా లభిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ వైపు ప్రపంచ దేశాలు చుఉస్తుండగా, కరోనా రోగులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు వాడొద్దని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) కీలకమైన సూచన చేసింది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నుండి 30కు పైగా దేశాలు ఈ మందు సరఫరా చేయమని భారత్ ప్రధాని నరేంద్ర మోదీని కోరడం తెలిసిందే. ఎందుకంటే ప్రపంచ ఉత్పత్తిలో 70 శాతం భారత్ లోనే జరుగుతుంది.
ఈ మందుపై జరుగుతున్న అధ్యయనం తాలూకు ఫలితాలు వచ్చే వరకూ కరోనా రోగులకు ఈ ఔషధం ఇవ్వక్కర్లేదని సూచించింది. ‘మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే హైడ్రాక్సీ క్లోరోక్విన్ కచ్చితంగా వాడలని ఎవరూ చెప్పలేదు. ఈ మందు ఇన్ఫెక్షన్‌ను తగ్గిస్తుందా లేదా అనేది ప్రస్తుతం జరుగుతున్న అధ్యయనంలో తెలుస్తుంది’ అని స్పష్టం చేసింది.
డాక్టర్లు దీన్ని ప్రస్తుతం కరోనా రోగ లక్షణాలు ఉన్న రోగులపై కేవలం పరీక్షించి చూస్తున్నారని తెలిపింది. కాబట్టి.. ఆశావాహ ఫలితాలు వచ్చే వరకూ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను కరోనా రోగులకు ఇవ్వాలని తాము సూచించలేమని ఐసీఎమ్ఆర్ శాస్త్రవేత్త గంగా కేట్కర్ వెల్లడి చేశారు.
అంతే కాకుండా.. కరోనా మహమ్మారికి సంబంధించిన భారత్ మూడో దశకు చేరుకోలేదని మరోసారి స్పష్టం చేశారు. ఇక.. కరోనా పనిపట్టే మందు కోసం వెతుకున్న ప్రయత్నాల ఫలితంగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రభావశీలతపై ఇంకా అధ్యయనాలు కొనసాగుతున్నప్పటీ అమెరికా, బ్రెజిల్ సహా అనేక దేశాలు దీనితో కరోనాను కట్టడి చేయచ్చని భావిస్తున్నాయి.
మరోవంక, డాక్టర్లు అహోరాత్రులు కష్టపడి కరోనా బారిన పడినవారిని కాపాడుతున్నప్పటికీ ప్రతి రోజూ కొత్తగా నమోదవుతున్న కేసులు మాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 549 కేసులు కొత్తగా నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు ఈ మహమ్మారి కారణంగా ఒక్కరోజులో 17 మంది మృతి చెందారు.
మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5734కు చేరుకోగా, 166 మంది మృతి చెందారని కుటుంబ, ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి లవ్ అగర్వాల్ చెలిపారు. వారిలో 473 మంది కరోనా రోగులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. వెంటిలేర్లు అవసరమున్న ఆసుపత్రుల్లో వాటిని సమకూరుస్తున్నామని, డాక్టర్లకు పీపీఈలను అందజేస్తున్నామని అగర్వాల్ తెలిపారు.