Donald Trump 3rd Term : 2024లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘనవిజయం సాధించారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. దీంతో ఆయన అతి తక్కువ ఓట్ల తేడాతో గెలుస్తారని అంతా భావించారు. కానీ ట్రంప్ 312 ఎలక్టోరల్ ఓట్లతో గ్రాండ్ విక్టరీ సాధించారు. కమలా హారిస్ అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలోనే డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా జనవరిలో ప్రమాణం చేయనున్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. డోనాల్డ్ ట్రంప్ ఇటీవల 2028లో మూడవసారి పోటీ చేయవచ్చని సూచించారు. ఈ ప్రకటన అమెరికా రాజ్యాంగంలోని 22వ సవరణకు వ్యతిరేకంగా ఉంది. ఇది అధ్యక్షుడిని రెండు పర్యాయాలకు మించి ఎన్నుకోకుండా ఇప్పటి వరకు నిరోధించింది.
తాను మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, ఇది రాజ్యాంగానికి విరుద్ధం, ఎందుకంటే అమెరికా రాజ్యాంగం అధ్యక్షునికి రెండు పర్యాయాల పరిమితిని నిర్దేశిస్తుంది. వాషింగ్టన్ డీసీలోని ఒక హోటల్‌లో రిపబ్లికన్ పార్టీ సభ్యులతో సంభాషణ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు.
రాజ్యాంగంలోని 22వ సవరణ ప్రకారం మూడోసారి నిషేధం
అమెరికా రాజ్యాంగంలోని 22వ సవరణ ప్రకారం ఏ అధ్యక్షుడూ రెండు పర్యాయాలకు మించి ఎన్నికల్లో పోటీ చేయరాదని స్పష్టం చేసింది. అంటే ట్రంప్ మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే ముందుగా ఈ సవరణను రద్దు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ చాలా క్లిష్టమైనది, కష్టతరమైనది. ఎందుకంటే దీనిని రద్దు చేయడానికి కాంగ్రెస్, స్టేట్ అసెంబ్లీల నుంచి భారీ మద్దతు అవసరం. ఇది ట్రంప్‌కు సాధ్యం కాదు.
22వ సవరణ ప్రాముఖ్యత
రాజ్యాంగంలోని 22వ సవరణ ఉద్దేశ్యం అమెరికన్ అధ్యక్షుడి పదవీ పరిమితిని నిర్ణయించడం, తద్వారా ఏ అధ్యక్షుడూ ఎక్కువ కాలం అధికారంలో ఉండకూడదు. ఈ సవరణ 1951లో అమలు చేయబడింది. అప్పటి అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డెలానో రూజ్‌వెల్ట్ మాత్రమే నాలుగుసార్లు ఎన్నికల్లో విజయం సాధించారు. ఇది అమెరికన్ చరిత్రలో అపూర్వమైన సంఘటన. ఆయన మరణానంతరం అధ్యక్షుడి పదవీకాలాన్ని పరిమితం చేయాలని నిర్ణయించారు.
అమెరికా రాజ్యాంగంలో మార్పు సాధ్యమేనా?
రాజ్యాంగ సవరణను రద్దు చేయడం చాలా కష్టమైనప్పటికీ.. అది పూర్తిగా అసాధ్యమని చెప్పలేం. దీని కోసం రాజ్యాంగాన్ని మార్చే ప్రతిపాదనను అమెరికా పార్లమెంట్ (హౌస్, సెనేట్) ఉభయ సభలు మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించాలి. దీని తర్వాత ప్రతిపాదన రాష్ట్రాలకు పంపబడుతుంది. అక్కడ మూడు వంతుల రాష్ట్రాలు ఆమోదించాలి. ఈ ప్రక్రియను పూర్తి చేయడం ట్రంప్‌కు చాలా కష్టం. ఎందుకంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో దీన్ని పూర్తి చేయడం దాదాపు అసాధ్యం.
ట్రంప్ మూడోసారి ఎన్నికల్లో పోటీ చేయగలరా?
రాజ్యాంగం ప్రకారం.. డొనాల్డ్ ట్రంప్ మూడవసారి పోటీ చేయడం అసాధ్యం. ఎందుకంటే రాజ్యాంగం దానిని స్పష్టంగా నిషేధించింది. ట్రంప్ మూడోసారి పదవిని చేపట్టడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారినప్పటికీ, వాస్తవానికి సవరణను రద్దు చేసే ప్రయత్నం లేకుండా అది సాధ్యం కాదు. అందువల్ల, రాజ్యాంగ పరిమితుల కారణంగా డొనాల్డ్ ట్రంప్ మూడవ దఫా కలలు కొంతవరకు ముగిశాయి. రాజ్యాంగంలోని 22వ సవరణకు అనుగుణంగా అతని అధ్యక్ష ప్రయాణానికి ఇది చివరి స్టాప్ కావచ్చు.