Dolo 650: డోలో 650.. బహుశా ఈ మాత్ర పేరు తెలియని వారు భారత దేశంలోనే ఉండరు. అంతలా చొచ్చుకుపోయింది ఈ మాత్ర. జ్వరం, జలుబు, కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులకు సత్వర ఉపశమనంగా ఈ మాత్ర పని చేస్తుంది. మార్కెట్లో ఎన్నో కంపెనీలు ఉన్నప్పటికీ మైక్రో ల్యాబ్స్ రూపొందించిన డోలో 650 మాత్రం విజయవంతం అయింది. కోవిడ్ సమయంలో రెమిడేసివీర్ స్థాయిలో మైక్రో లాబ్స్ ఈ మాత్రాల అమ్మకాలు జరిపింది. పెద్దపెద్ద ఫార్మా కంపెనీలు సైతం అసూయ పడేలా విక్రయాలలో వృద్ధి సాధించింది. కానీ ఈ వృద్ధి అంతా తాయిలాలు ఇచ్చి మైక్రో ల్యాబ్స్ సాధించిందన్న విషయం బయటపడింది. అదే పెను సంచలనమైంది.

ఆఖరుకు మందులను కూడా మార్కెట్ చేసుకొని జనాల ప్రాణాలతో ఆడుకుంటున్న ఫార్మా కంపెనీల గుట్టు రట్టు అయ్యింది. కరోనా కల్లోలం వేళ జ్వరం అందరికీ ప్రథమ లక్షణంగా వచ్చేది. ఆ సమయంలో జ్వరం మాత్రగా ఎక్కువగా అందరూ తీసుకున్నది డోలో 650. దీన్ని డాక్టర్లు అందరూ సూచించేలా ఆ కంపెనీ ఏకంగా రూ.1000 కోట్ల ముడుపులు ఇచ్చిన వైనం చూసి ఇప్పుడు అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
డోలో 650 ట్యాబ్లెట్ ను రోగులకు సూచించడం కోసం డాక్టర్లకు ఏకంగా రూ.1000 కోట్ల ముడుపులు అందాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. దీనిపై తాజాగా సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వైద్యులు తమ మందులను ప్రిస్ప్కైబ్ చేసినందుకు డోలో కంపెనీ ఇలా ముడుపులు ఇచ్చిందని తేలింది. ఈ వ్యవహారంలో ఫార్మా కంపెనీలను బాధ్యులను చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ న్యాయవాది అపర్ణా భట్ ఈ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
డోలో 650 కేసు తీవ్రమైన సమస్య అని.. కోవిడ్ వచ్చిన సమయంలో తనకు కూడా అదే ట్యాబ్లెట్ సూచించారని కేసు విచారిస్తున్న బెంచ్ లోని న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించడం సంచలనమైంది. కేంద్ర ప్రభుత్వం తరుఫున 10 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.
డోలో 650 ని మైక్రోల్యాబ్స్ అనే సంస్థ తయారు చేస్తుంది. దీనిని దిలీప్ సురానా అనే వ్యక్తి బెంగళూరులో స్థాపించారు. వాస్తవానికి డోలో 650 అనేది కొత్త ఔషధం ఏమీ కాదు. కొత్త సీసాలో పాత సారా లాగా పారాసెటమాల్ కాంబినేషన్ తో చేసిన ఈ మాత్ర జ్వరం, కీళ్లు, కాళ్ళు, ఒళ్ళు నొప్పుల నివారణకు ప్రభావవంతం గా పని చేయడంతో దీనికి డిమాండ్ పెరిగింది. ఫార్మా అంటేనే ఓ దందా కదా! మార్కెట్ లో లీడర్ గా ఎదగాలని దిలీప్ సురానా చేయని ప్రయత్నం అంటూ లేదు. 8 స్ట్రిప్ లు కొంటె 2 స్ట్రిప్ లు ఉచితంగా ఇస్తామని ఆఫర్ పెట్టారు. దీంతో విక్రయాలు మంచిగానే పెరిగాయి. ఫలితంగా మైక్రో ల్యాబ్స్ విస్తరణ ప్రారంభం మొదలైంది. కానీ అది దిలీప్ సూరానా అనుకున్నంత స్థాయిలో మాత్రం కాదు. పోటీ కంపెనీలు విదేశాల్లో సైతం కార్యకలాపాలు సాగిస్తుండటంతో సురానా లో లోపల మదనపడేవాడు.
కోవిడ్ 19 ప్రపంచం మొత్తాన్ని వణికిస్తే ఫార్మా కంపెనీలకు మాత్రం భారీగా లాభాలు ఇచ్చింది. అందులో ముందు వరుసలో ఉన్నది మైక్రోల్యాబ్స్. కరోనా ప్రారంభ సమయంలో జ్వరం రావడంతో చాలామంది కూడా డోలో 650ని విరివిగా వాడేవారు. దీంతో అమ్మకాలు జోరు అందుకున్నాయి. పైగా కరోనా నివారణకు మందులు రాకపోవడంతో డాక్టర్లు కూడా ఈ మాత్రనే సిఫారసు చేసేవారు. సరిగ్గా దీన్నే తన వ్యాపార సూత్రంగా మలచుకున్నారు సూరానా. ఇదే అదునుగా ప్రోడక్షన్ ను పెంచారు. ఇతర దేశాలకు సరఫరా ప్రారంభించారు. కానీ మన దేశంలోనే నంబర్ వన్ కావాలి అని సురానా కొత్త ప్లాన్ వేశారు. డోలో విక్రయాలు పెంచుకునేందుకు డాక్టర్లకు బల్క్ ఆఫర్ ఇచ్చింది మైక్రో ల్యాబ్స్. వాస్తవానికి ఈ విధానం ఎప్పటి నుంచో ఉన్నా మెక్రో ల్యాబ్స్ దాన్ని మరింత కమర్షియల్ చేసింది. అసలే కరోనా, పైగా బల్క్ ఆఫర్.. దీంతో కార్పొరేట్ నుంచి సాధారణ ఆసుపత్రుల వైద్యుల దాకా డోలో ను సిఫారసు చేశారు. దీంతో సురానా ఓవర్ నైట్ లో బిలియనీర్ అయ్యారు. రెడ్డీస్, సిప్లా, రాన్ బాక్సీ, కాడిలా, గ్లెన్ మార్క్స్ వంటి కంపెనీల స్థాయికి వచ్చాడు. దీనికోసం డాక్టర్లకు రూ. 1000 కోట్ల ముడుపులు ఇచ్చినట్టు తేలింది. డోలో 650 బాధితుల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా ఉండడం.. ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం సంచలనమైంది.
[…] Also Read: Dolo 650: డోలో-650 సూచించాలని డాక్టర్లకు రూ.1000… […]
[…] Also Read:Dolo 650: డోలో-650 సూచించాలని డాక్టర్లకు రూ.1000… […]