Vijayasai Reddy: జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తనకు అడ్డుగా ఉన్న వారందరితో పాటు తనముందే పెద్దరికం చేసేవారిని దూరం పెట్టాలని అనుకుంటున్నారా? పదవులతో పాటు.. రాజకీయంగా తనకన్నా ఒక్క అడుగుకూడా ముందుకు వేసినా సహించడం లేదా? అసలు నమ్మక ద్రోహం చేస్తున్నారని జగన్ తనకు ఇన్నాళ్లు అండగా ఉన్నవారినే దూరంగా పెట్టేందుకు సాహసం చేస్తున్నారా? లేదా.. ఇదికూడా రాజకీయంగా మరో ‘కత్తి’లాటి ప్లానింగా అనే రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. పలువురు రాజకీయ వేత్తలు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్ కు వైసీపీ నేత, రాజ్య సభ సభ్యుడు విజయసాయి రెడ్డికి ఈ మధ్య దూరం పెరుగుతోంది. అతడిపై ఇటీవల పీకే టీంతో నిఘా పెట్టారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఉత్తరాంధ్రలో పట్టుకోసం ప్రయత్నిస్తున్న విజయసాయిరెడ్డి ఇదంతా జగన్ కు తెలియకుండానే చేస్తున్నాడని గుర్రుగా ఉన్నాడు ఏపీ సీఎం. ఇందులో భాగంగానే విజయసాయిరెడ్డి విషయంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటుండడం చర్చనీయాంశంగా మారింది.

రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారశైలికూడా ఇటీవల పూర్తిగా మారిపోవడంతో వైసీపీ నేతలతో పాటు పలు రాజకీయ వేత్తలు కూడా ఆలోచనలో పడ్డారు. విజయసాయి రెడ్డి రోజుకు మూడుసార్లయినా మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వ వ్యతిరేక శక్తులపై దుమ్మెత్తి పోస్తుంటారు. చిన్న విషయంలోనూ పెద్దగా ఆలోచన చేసి మీడియా ముందు గంటల కొద్ది మాట్లాడుతూనే ఉంటారు. ఇలా తిట్టేనోరు కొన్నాళ్లుగా మూగబోయింది. విజయసాయి రెడ్డి ప్రత్యక్షంగానే కాదు.. ట్విట్వర్ గూటిలోనూ కూయకుండా సైలెంట్ గా ఉండిపోతున్నారు. తనకు సబంధం లేని విషయాల్లోనూ వేలుపెట్టే ఈ సీనియర్ నాయకుడు చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ వంటి వాళ్లు దొరికితే వదిలేవాడే కాదు.. అలాంటిది కొన్నాళ్లుగా సైలెంటుగా ఉంటున్నాడు. రెండు రకాలుగానూ.. మౌన ముని అయిపోయాడు..
దీంతో విజయసాయిరెడ్డికి ఏమైందనే చర్చ ఏపీ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. మరో వైపు ఆయన వైజాగ్ లోనూ కనిపించడం లేదు. ఇన్నాళ్లు ఉత్తరాంధ్రను ఏలిన వ్యక్తి కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉండిపోయారు. కారణం ఏమిటో తెలియదు కానీ.. ఆయన కారణంగా ఉత్తరాంధ్ర, వైసీపీ అంతా భ్రష్టుపట్టిపోయాయని నాయకులంతా పార్టీని నమ్మే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో ఉత్తరాంధ్రలో మళ్లీ పాత పట్టు సాధించాలని అనుకున్న సీఎం జగన్ చాలా వేగంగా పీకే టీం ను అక్కడ దింపేశారు. ఇదే క్రమంలో ఢిల్లీలో విజయసాయి రెడ్డికి ఉన్న అధికారాలను ప్రస్తుతం మాజీ సీఎస్ ఆదిత్యానాథ్ కు అప్పగించేశారు. ఇక విజయసాయిరెడ్డికి చేయాల్సిన పనులు పార్టీలో.. ప్రభుత్వ పరంగా ఏమీ లేవు. ఆయన సన్నిహితులపై కూడా ఇన్ కంటాక్స్ వంటి సంస్థలు ఓ కన్నేశాయి. గతంలో రాంకీపై ఐటీ దాడులు జరగగా.. తాజాగా హెటెరోలో సోదాలు జరిగాయి. ఇందులో ఏం బయటపడతాయో తెలియదు కానీ.. విజయసాయిరెడ్డి హఠాత్తుగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ను కలిశారు.
సాధారణ సమయంలో ఇలాంటి భేటీలు జరిగినప్పుడు తాను రాష్ట్రం కోసం.. రాష్ట్ర ప్రాజెక్టుల కోసం కేంద్ర మంత్రితో మాట్లాడానని మీడియాను నమ్మించేశారు. కానీ ఈసారి నిర్మలాతో మీటింగ్ చాలా రహస్యంగా సాగింది. ఈ విషయాన్ని నిర్మలమ్మ ట్విట్టర్ గూటిలో కూయగా.. తప్పనిసరి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి తిరిగి అవుననే కూతపెట్టారు. ఒకప్పుడు వైసీపీలో తిరుగులేని నేతగా, ఉన్నతస్థానంలో ఉన్న విజయసాయి రెడ్డిని ఆ పార్టీ నేతలు చాలావరకు పక్కన నెట్టేశారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆయన వ్యవహార శైలిని జగన్ వద్దగా తప్పుగా చిత్రీకరించి.. కొందరు నేతలు తమ పలుకుబడిని పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తంగా విజయసాయి రెడ్డికి.. జగన్ మోహన్ రెడ్డికి మధ్య ఏర్పడిన గ్యాప్ ఇప్పుడప్పుడే పూడేలా లేదని పలువురు రాజకీయ వేత్తలు అంటున్నారు.