KCR: దేశంలో ప్రస్తుతం నూతన రాజకీయ పార్టీకి స్థానం ఉందా? అనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో పోరాటం చేయాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్ సోమవారం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ‘త్వరలో దేశంలో కొత్త రాజకీయ పార్టీ పుట్టుకొస్తుంది.. ఇది నేను 50 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెబుతున్నా.. నూతన రాజకీయ వ్యవస్థ రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నరు. అది ఏ రూపంలో ఉంటుంది అన్నది నాకే తెల్వది’ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ వరి యుద్ధం వెనుక రాజకీయ ప్రయోజనాలు వేరే ఉన్నప్పటికీ ప్రస్తుతం కొత్త జాతీయ పార్టీపై ఆయన 50 ఏళ్ల రాజకీయ అనుభవంతో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
-రాత్రికి రాత్రే జాతీయ పార్టీ ఆవిర్భావం సాధ్యమా..
దేశంలో ఒక రాజకీయ పార్టీ పెట్టాలంటే దానికి ఎన్నికలక సంఘం అనుమతి తప్పనిసరి.. ఎవరైనా పార్టీ పెట్ట వచ్చు. పార్టీ ప్రారంభంలో ఏ రాష్ట్రంలో స్థాపిస్తారో అక్కడ దానిని ప్రాంతీయ పార్టీగా ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుంటుంది. దేశ చరిత్రలో ఏ పార్టీకి ఎన్నికల సంఘం ఒకేసారి గుర్తింపు ఇచ్చిన చరిత్ర లేదు. తనకు 50 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్న కేసీఆర్‌కు ఈ చిన్న విషయం తెలియంది కాదు. కానీ ప్రజలను మాటలతో మాయచేయడంలో కేసీఆర్‌కు ఎవరూ సాటిరారు. ఇందులో భాగంగానే ఆయన జాతీయస్థాయిలో కొత్త పార్టీ పుట్టుకొస్తుందని వ్యాఖ్యానించి కొత్త చర్చకు దారి తీశారు.
-కొత్త పార్టీ పెట్టాలంటే..
దేశంలో కొత్త పార్టీ పెట్టేందుకు ప్రతీ భారతీయుడు అర్హుడే. తనకు ఇష్టం వచ్చిన పేరుతో పార్టీ పెట్టుకునేందుకు రాజ్యాంగా అవకాశం కల్పించింది. అయితే పార్టీ పెట్టుకుని జెండా, అజెండా, కార్యవర్గం ప్రకటించాల్సి ఉంటుంది. ఈ వివరాలతో తమకు గుర్తింపు ఇవ్వాలని ఎన్నికల సంఘాలనికి దరఖాస్తు చేసుకోవాలి. అధ్యక్షుడి పేరుతో లేఖ సమర్పించాలి. అన్ని వివరాలు పరిశీలించిన తర్వాత జాతీయ ఎన్నికల సంఘం కొత్త పార్టీ గుర్తింపునకు అర్హత ఉంటే గుర్తింపు ఇస్తున్నట్లు తిరిగి పార్టీ అధ్యక్షుడికి లేఖ ఇస్తుంది. రాజకీయ పార్టీల జాబితాలో పేరు చేరుస్తుంది. అయితే ఏ పార్టీ స్థాపించినా మొదట ఎక్కడ స్థాపించారనే విషయాన్ని ఎన్నికల సంఘం పరిశీలిస్తుంది. పార్టీ కార్యాలయం చిరునామా, ఏ రాష్ట్రం అని పార్టీ సమర్పించిన లేఖ ద్వారా దానిని ఆ రాష్ట్ర ప్రాంతాయ పార్టీగానే గుర్తిస్తుంది. జాతీయ పార్టీగా ఎక్కడా గుర్తింపు ఇవ్వదు.. ఇందుకు ఇటీవల తెలంగాణలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి తనయ వైఎస్.షర్మిల ఏర్పాటుచేసిన వైఎస్సార్ తెలంగాణ పార్టీయే ఉదాహరణ. పార్టీ స్థాపించిన ఏడాది తర్వాత ఎన్నికల సంఘం దానికి గుర్తించింది. ఇటీవలే పార్టీ అధ్యక్షురాలికి లేఖ రాసింది. కానీ కేసీఆర్ మాత్రం జాతీయస్థాయిలో కొత్త పార్టీ పుట్టుకు రావొచ్చు అంటూ వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో దేశ ఓటర్లనే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.
-జాతీయ గుర్తింపు ఇలా..
ఒక ప్రాంతీయ పార్టీకి దేశంలో జాతీయ పార్టీగా గుర్తింపు రావాలంటే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. దేశంలో కనీసం మూడు అంతకంటే ఎక్కువ రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేయాలి. కనీసం ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేసి 20 శాతంపైగా ఓట్లు సాధించాలి. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే.. పార్టీ స్థాపించిన వెంటనే ఎన్నికల సంఘం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఎన్నికల గుర్తు కేటాయిస్తుంది. అన్ని రాష్ట్రాల్లో ఒకే గుర్తు ఇవ్వడం అనే విషయం ఇక్కడ అంత ఈజీ కాదు. ఒకే గుర్తు కేటాయించనప్పుడు.. ఒకే పార్టీగా పరిగణించడం కుదరదు. అన్నీ కుదిరినా.. ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం ఆధారంగా తమ పార్టీని జాతీయ పార్టీగా గుర్తించాలని పార్టీ అధ్యక్షుడు మళ్లీ ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకోవాలి. ఎన్నికల సంఘం ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో దరఖాస్తు చేసుకున్న పార్టీకి వచ్చిన ఓట్ల శాతం విశ్లేషించిన తర్వాత జాతీయ పార్టీగా గుర్తింపు ఇస్తుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం రెండేళ్లు పడుతుంది. మరి కేసీఆర్ చెప్పినట్లు 2023లో కొత్త జాతీయ పార్టీ రావడం ఎలా సాధ్యమన్న ప్రశ్న తలెత్తుతోంది.
ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ స్థాపించిన ఆప్ పార్టీ పదేళ్లుగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తోంది. అయినా జాతీయ పార్టీ గుర్తింపునకు అవరమైన ఓట్లు సాధించలేకపోతోంది. ఇటీవల పంజాబ్‌లో జరిగిన ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించింది. దేశంలో రెండు రాష్ట్రాలో అధికారంలోకి వచ్చిన ఒక ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందింది. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం, తన తప్పులను కప్పి పుచ్చుకోవడం కోసం కేంద్రంతో తాను యుద్ధం చేస్తున్నట్లు నమ్మించడం కోసం తెలంగాణలో పడిపోతున్న ఓటు బ్యాంకును దిగజారుతున్న పార్టీ ప్రతిష్టను పెంచేందుకు మాత్రమే 50 ఏళ్ల రాజకీయ అనుభవం, జాతీయస్థాయిలో కొత్త పార్టీ వంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.