Chandrababu Naidu: ఏపీలో ఎన్నిలకు రెండేళ్ల వ్యవధి ఉంది. కానీ ఇప్పటి నుంచే రాజకీయ పక్షాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. అధికార పక్షం గడపగడపకు మన ప్రభుత్వం పేరిట, ప్రధాన విపక్షం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వైఫల్యాలపై బాదుడే బాదుడు పేరిట, జనసేననాని పవన్ కల్యాణ్ కౌలురైతు భరోసా యాత్ర పేరిట ప్రజల బాట పడుతున్నారు. అయితే ఈ కార్యక్రమాల నిర్వహణ ఖర్చుతో కూడుకున్న పని. అధికార పార్టీ వరకూ ప్రభుత్వ నిధులు కాబట్టి దిగులు లేదు. విపక్షాల విషయానికి వచ్చేసరికి మాత్రం ఖర్చు అధికమే. కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే జనసేనాని తన కార్యక్రమ నిర్వహణకు కొంత మూల నిధిని సమకూర్చారు. విరాళాలు సేకరించి ఒక్కో రైతు కుటుంబానికి రూ.లక్ష చొప్పున అందిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ విషయంలో మాత్రం ఖర్చును ఎవరు భరిస్తున్నారన్నది తెలియడం లేదు. 2019కు ముందు ఆ పార్టీ అధికారంలో ఉంది గనుక దండిగా విరాళాలొచ్చేవి. కానీ అధికారానికి దూరమైన తరువాత విరాళాల రూపంలో ఆదాయం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. దీంతో కార్యక్రమాల నిర్వహణకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్వయంగా చంద్రబాబు పార్టీ నేతలతో అన్నారట. కానీ ఆ పార్టీ నాయకులు మాత్రం పట్టించుకోలేదట. వేదికల వద్ద విరాళాలు ప్రకటించిన వారు సైతం డబ్బులు ఇవ్వడం లేదట. అయితే ఇటీవల నిర్వహించిన మహానాడు, జిల్లాల్లో నిర్వహిస్తున్న మినీ మహానాడులు, అధినేత పర్యటనలకు ఖర్చు ఎవరు పెడుతున్నారన్న ప్రశ్న ఇప్పుడు టీడీపీలో వినిపిస్తోంది.
మహానాడులు మహా రిచ్..
ఒంగోలులో కనీవినీ ఎరుగని రీతిలో మహానాడు నిర్వహించారు. పార్టీ ఆవిర్భావం నుంచి మహానాడును ఘనంగా, రిచ్ గా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. నాయకులకు, కార్యకర్తలకు పసందైన విందులు, వివిధ ప్రాంతాల ఆహారంతో మూడు రోజుల పాటు ఆతిథ్యం ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. మహానాడు అంటేనే మహా పండుగ అన్నట్టు కార్యక్రమాల నిర్వహణ ఇతర పార్టీల కంటే ప్రత్యేకంగా నిలుస్తుంటుంది. అయితే సుమారు మూడేళ్ల అనంతరం నిర్వహించిన ఈ ఏడాది మహానాడు మరో ప్రత్యేకం. దాదాపు 3 లక్షల మంది హాజరైన మహానాడు కార్యక్రమానికి దాదాపు రూ.75 కోట్లు ఖర్చు పెట్టారని వినికిడి. పార్టీ అధినేత మాత్రం పార్టీ ఆర్థిక కష్టాల్లో ఉందని చెబుతున్నారు. వరుసగా 26 జిల్లాల్లో మినీ మహానాడులు నిర్వహిస్తున్నారు.
Also Read: BJP Big Strategy: బీజేపీ భారీ వ్యూహం.. రాష్ట్రాల కమ్యూనిటీలతో సమావేశం
ఒక్కో మినీమహానాడుకు దాదాపు రూ.10 కోట్లు ఖర్చు అవుతోందని నేతలు చెబుతున్నారు. అంటే 26 జిల్లాల్లో అయితే దాదాపు రూ.260 కోట్లు వరకూ ఖర్చవుతుందని లెక్కలు వేస్తున్నారు. ఇంత మొత్తం ఎవరు భరిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. జిల్లా స్థాయిలో నేతలు కొంతవరకూ భరిస్తున్నారని.. మిగతా ఎక్కడ సేకరిస్తున్నారన్నదానిపై స్పష్టత లేదు. చంద్రబాబు మాత్రం ఈ ఖర్చుకు లెక్క చేయడం లేదు. ఇప్పటి నుంచి ఖర్చుకు లెక్కలు వేసుకుంటే పనికాదని ఆలోచిస్తున్నారు. అందుకే పార్టీ ఆర్థిక పరిస్థితికి మించి ఖర్చుపెడుతున్నారు.
ఈ వర్గాల నుంచి..
టీడీపీ ప్రభుత్వ హయాంలో చాలా మంది పారిశ్రామికవేత్తలు ప్రయోజనాలు పొందారు. వారు చాలావరకూ సాయం చేస్తున్నట్టు వినికిడి. మరోవైపు అధికార వైసీపీ చేష్టల ఫలితంగా చాలా మంది నష్టపోయారు. అటువంటి వారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవకూడదని భావిస్తున్నారు. అటువంటి వారంతా టీడీపీకి ఇతోధికంగా సాయం చేస్తున్నారు. టీడీపీ కార్యక్రమాల ఖర్చును భరిస్తున్నారు. వివిధ రూపాల్లో స్పాన్సర్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే ఇంతకు మించి ప్రయోజనం పొందవచ్చన్న ముందస్తు ఆలోచనతో కొంతమంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. అటువంటి వారు చంద్రబాబు అడగకుండానే స్పాన్సర్స్ గా ముందుకొస్తున్నారు. వివిధ రంగాల్లో చంద్రబాబు సొంత సామాజికవర్గం వారు ఉన్నారు. అటువంటి వారు టీడీపీ గెలవాలని బలంగా కోరుకుంటున్నారు. వారు తమ శక్తికొలది పార్టీకి వివిధ రూపాల్లో సాయం చేస్తున్నారు. మొత్తానికి టీడీపీ నేతలైతే సాయం చేయడం లేదు కానీ.. చంద్రబాబుకు మిగతా వర్గాల నుంచి సాయం విషయంలో వర్కవుట్ అవుతుందన్న మాట.
Also Read:BJP Target On KCR: టార్గెట్ కేసీఆర్ బీజేపీ నాయకుల లక్ష్యం ఇదేనా?