https://oktelugu.com/

KCR – Venu Swami : కెసిఆర్ కు వేణు స్వామి ఇచ్చిన గొప్ప సలహా ఏంటో తెలుసా?

మరి వేణు స్వామి వ్యాఖ్యల నేపథ్యంలోనైనా కెసిఆర్ తన పార్టీ పేరు మార్చుతారేమోనని ఆ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : January 17, 2024 9:21 pm
    Follow us on

    KCR – Venu Swami : రెండుసార్లు అధికారంలో ఉండి.. మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలి అనుకున్న కెసిఆర్ కల ఇటీవలి ఎన్నికల్లో చెదిరిపోయింది. మూడోసారి కూడా ముఖ్యమంత్రి అయితే దక్షిణాది రాష్ట్రాలలో అత్యధిక సంవత్సరాలు సీఎం గా పాలించిన చరిత్రను తన పేరు మీద లెక్కించుకోవాలని అనుకున్న కేసీఆర్ ఆశ అడియాసయింది. అంతేకాదు దేశ్ కా నేత అని ప్రచారం చేయించుకున్న ఆయన కామారెడ్డి స్థానంలో ఓడిపోవడం పరిస్థితి తీవ్రతను తేటతెల్లం చేసింది. తెలంగాణ రాష్ట్రాన్ని బీభత్సమైన లెవెల్ లో అభివృద్ధి చేశామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు ఓడిపోయింది? కామారెడ్డి స్థానంలో కెసిఆర్ కూడా ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? అసలు ఏం చేస్తే కారు పార్టీకి పూర్వ వైభవం వస్తుంది? వంటి విషయాలకు ప్రముఖ జ్యోతిష్యుడు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు వేణు స్వామి క్లారిటీ ఇచ్చారు. ఓ డిజిటల్ ఛానల్ నిర్వహించిన ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి మనుగడ, భవిష్యత్తులో ఎదుర్కొనే సవాళ్లపై ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

    జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళకముందు వరకు భారత రాష్ట్ర సమితి తెలంగాణ సమితి గానే ఉండేది. ఎప్పుడైతే దేశ రాజకీయాల్లోకి వెళ్లాలి అని కెసిఆర్ అనుకున్నారో అప్పుడే తన పార్టీ పేరు నుంచి తెలంగాణ అనే పదాన్ని తొలగించారు. తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితిగా మార్చారు. అయితే ఆ పార్టీలో తెలంగాణ అనే పేరు లేకపోవడం వల్లే ఇటీవల ఎన్నికల్లో పరాజయం ఎదురైందని వేణు స్వామి చెబుతున్నారు. చివరికి ఇతర రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ శాఖలను ఏర్పాటు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని అంటున్నారు. ఇప్పటికే ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్షుడు భారత రాష్ట్ర సమితికి రాజీనామా చేశారని.. పార్లమెంట్ ఎన్నికల ముంగిట ఈ రాజీనామాల పర్వం మరింత జోరు అందుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. వచ్చే రోజుల్లో పార్టీ మనుగడ కొనసాగించాలంటే భారత రాష్ట్ర సమితి కాస్త తెలంగాణ రాష్ట్ర సమితిగా మారాలని సూచించారు.

    తెలంగాణ రాష్ట్ర సమితిగా పేరు మార్చితేనే పార్టీకి బాగుంటుందని.. ఆ పార్టీ జాతక దృష్ట్యా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లకపోవడమే మంచిదని వేణు స్వామి అభిప్రాయపడ్డారు. పార్టీ నుంచి తెలంగాణ అనే పదాన్ని తొలగించడం వల్ల రాష్ట్ర ప్రజలకు అది దూరమైందని.. అందువల్లే ఓటమి ఎదురైందని వేణు స్వామి అభిప్రాయపడ్డారు. ఒకవేళ దేశ రాజకీయాల్లోకి కెసిఆర్ మరింత వేగంగా వెళ్లాలి అనుకుంటే .. పరాజయం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని వేణు స్వామి వ్యాఖ్యానించారు. కెసిఆర్ జాతక దృష్ట్యా కూడా ఆయనకు జాతీయ రాజకీయాలు అంతగా అచ్చికి రావడం లేదని వేణు స్వామి పేర్కొన్నారు. కాగా వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో చర్చనీయాంశంగా మారాయి. మరి వేణు స్వామి వ్యాఖ్యల నేపథ్యంలోనైనా కెసిఆర్ తన పార్టీ పేరు మార్చుతారేమోనని ఆ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.