https://oktelugu.com/

TSRTC Merge In Govt: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వెనుక అసలు కథ తెలుసా?

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ అసంబద్ధమవైదని కేసీఆర్‌ 2019లో అన్నారు. విలీనం అసంభవమని ప్రకటించారు. ఆర్టీసీని చేస్తే మిగతా 56 కార్పొరేషన్లు కూడా అడుగుతాయని లాజిక్‌ చెప్పారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 3, 2023 2:56 pm
    TSRTC Merge In Govt

    TSRTC Merge In Govt

    Follow us on

    TSRTC Merge In Govt: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇటీవల ఏ కార్యక్రమం చేపట్టినా, ఎటువంటి ప్రకటనలు చేసినా.. ఎన్నికల కోసమే అన్నట్లుగా ఉంటోంది. జూలై 31న నిర్వహించిన క్యాబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలన్నీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే ప్రతిపాదించారన్న అభిప్రాయం తెలంగాణ వ్యాప్తంగా వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 43 వేల మందికి పైగా ఆర్టీసీ కార్మికుల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తొలగించుకోవాలన్న ఉద్దేశంతో వారిని ప్రభుత్వంలోకి విలీనం చేసే నిర్ణయాన్ని తీసుకున్నారు.

    నాడు అసంభవం.. నేడు సంభవం..
    ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ అసంబద్ధమవైదని కేసీఆర్‌ 2019లో అన్నారు. విలీనం అసంభవమని ప్రకటించారు. ఆర్టీసీని చేస్తే మిగతా 56 కార్పొరేషన్లు కూడా అడుగుతాయని లాజిక్‌ చెప్పారు. కానీ అదే ఇప్పుడు సంభవమైంది. అదెలా అంటే.. ఆర్టీసీ ఉద్యోగుల కోసం ప్రభుత్వంలో ప్రజా రావాణా శాఖను ప్రత్యేకంగా ఏర్పాటుచేసి.. ఆ శాఖ కిందకు వీరిని తెచ్చి ఆ శాఖ నుంచే వీరికి జీతభత్యాలు చెల్లించడంతోపాటు ఇతర అంశాలను పర్యవేక్షిస్తారు. ఇందుకు సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఆర్టీసీ కార్పొరేషన్‌ను మాత్రం యథావిధిగా కొనసాగించనున్నారు. ఉద్యోగులు మాత్రం ప్రభుత్వంలో విలీనమవుతారు.

    బకాయిలు తప్పించుకోవడానికే..
    ఆర్టీసీ ఉద్యోగులకు దీర్ఘకాలంగా బకాయిపడిన సీసీఎస్‌ నిధులు రూ.1,150 కోట్లు, ఎస్‌ఆర్‌బీఎస్‌ కింద రూ.500 కోట్లు, ఎస్‌బీటీ రూ.500 కోట్లు, 2013 పీఆర్‌సీ బకాయి నిధులు సుమారు రూ.500 కోట్లు ఇవ్వాలని కార్మిక సంఘాలు ఎప్పటినుంచో డిమాండ్‌ చేస్తున్నాయి. ఆర్టీసీపై మంత్రివర్గంలో చర్చ సందర్భంగా ఈ విషయాలపైనా పరిశీలన జరిగిందని సమాచారం. అయితే ఇవన్నీ కాకుండా.. ఒక్కసారిగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది.

    ఆర్టీసీకి విలువైన భూములు..
    ప్రభుత్వంలో తెలంగాణ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌(టీఎస్‌ఆర్టీసీ)కు ప్రభుత్వంలో విలీనంతో ఆర్టీసీ ఆస్తులు కూడా ప్రభుత్వ పరం కానున్నాయి. 90 ఏళ్ల చరిత్ర గల ఆర్టీసీకి రాష్ట్రవ్యాప్తంగా 1,404 ఎకరాల భూములున్నాయి. బస్‌ భవన్‌ సహా డిపోలు, బస్టాండ్లు, కమర్షియల్కాంప్లెక్స్‌లు, ఇతర విలువైన ఆస్తులెన్నో సంస్థ సొంతం. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 250 ఎకరాల భూములున్నాయి. హైదరాబాద్‌ నడిబొడ్డున ఆర్టీసీ బస్‌ భవన్, ముషీరాబాద్‌ డిపో, జీహెచ్‌ఎంసీ, జిల్లా కేంద్రాలు, ఇతర పట్టణాల్లో అత్యంత విలువైన ల్యాండ్స్‌ ఉన్నాయి. వీటన్నింటి మార్కెట్‌ విలువ రూ.80 వేల కోట్లకు పైమాటేనని సంస్థ ఉన్నతాధికారులు చెప్తున్నారు.

    అన్నీ విలువైన భూములే..
    ఆర్టీసీకి రాష్ట్రవ్యాప్తంగా మూడు జోన్లలో 11 రీజియన్లు ఉన్నాయి. వాటి పరిధిలో 96 డిపోలు కొనసాగుతున్నాయి. గతంలో 99 డిపోలు ఉండగా మూడు డిపోలను మూసేశారు.

    రూ.80 వేల కోట్ల ఆర్టీసీ ఆస్తులు..ఇక సర్కార్కే
    రెండు జోనల్‌ వర్క్‌ షాపులు, బస్‌ బాడీ యూనిట్‌ ఒకటి, రెండు టైర్‌ రీట్రేడింగ్‌ షాపులు, ప్రింటింగ్‌ ప్రెస్, హకీంపేట ట్రాన్స్‌పోర్టు అకాడమీ, స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజీలు, 14 డిస్పెన్సరీలు, తార్నాక హాస్పిటల్, 364 బస్‌ స్టేషన్లు, హైదర్‌గూడ గెస్ట్‌హౌస్, ఆర్టీసీ కల్యాణ మండపం, ఓల్డ్‌ అడ్మిన్‌ ఆఫీస్, ముషీరాబాద్‌ ఓపెన్‌ ప్లేస్, కాచిగూడ, చిలకలగూడ స్టాఫ్‌ క్వార్టర్స్, మెట్టుగూడ బంగ్లా తదితర ఆస్తులు ఉన్నాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 251.32 ఎకరాలు, కరీంనగర్‌ జిల్లాలో 194.36 ఎకరాలు, వరంగల్లో 118.05 ఎకరాలు, ఖమ్మంలో 106.03 ఎకరాలు, నల్గొండలో 116.08 ఎకరాలు, ఆదిలాబాద్‌లో 98.12 ఎకరాలు, నిజామాబాద్లో 134.20 ఎకరాలు, హైదరాబాద్‌లో 134.09 ఎకరాలు, మహబూబ్‌నగర్‌ లో 142.32 ఎకరాలు, మెదక్‌ జిల్లాలో 112.36 ఎకరాల భూములు ఆర్టీసీకి ఉన్నాయి. వీటి రిజిస్ట్రేషన్‌ వాల్యూ రూ.17 వేల కోట్ల పైనే ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అదే బహిరంగ మార్కెట్లో అయితే రూ. 80 వేల కోట్లకు పైనే ఉంటుందని అంటున్నారు.

    తొమ్మిదేండ్లలో రూ.11,500 కోట్ల నష్టాల్లోకి
    తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఆర్టీసీ రూ.299.64 కోట్ల నష్టాల్లో ఉండేది. కానీ గడిచిన తొమ్మిదేళ్లలో రూ.11,500 కోట్ల నష్టాల్లోకి వెళ్లింది. 2015లో ప్రకటించిన పీఆర్సీతో సంస్థపై రూ.850 కోట్ల భారం పడింది. ప్రభుత్వం సంస్థను పట్టించుకోకపోవడంతో ఏటా రూ.వెయ్యి కోట్ల చొప్పున నష్టాల్లో కూరుకుపోయింది. 2015 –16 ఆర్థిక సంవత్సరంలో రూ.1,150 కోట్ల నష్టం వస్తే, కార్మికులు 52 రోజులు సమ్మె చేసిన 2019 – 20లో రూ.1,002 కోట్ల నష్టం వచ్చింది. సంస్థ బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్లు రూ.2,500 కోట్లు, పీఎఫ్‌ ట్రస్టు్క రూ.వెయ్యి కోట్లు, ఎస్బీటీ, ఏసీఎస్‌ కలిపి రూ.300 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే సంస్థ రూ.11,500 కోట్ల నష్టాల్లో ఉంది.