Huzurabad: అవేం పెద్ద నగరాలు కాదు. సాదాసీదాగా పల్లెటూరి వాతావరణంతో కూడిన చిన్నటౌన్లు. మహా అయితే అక్కడ ఇంటిరెంట్లు 2 వేల నుంచి 5 వేల లోపు ఉండేవి. కానీ ఈ మధ్య అక్కడ రెంటుకు ఇండ్లు కూడా దొరకనంత బీజీ అయిపోయాయి. ఒకవేళ దొరికినా నగరాల్లోలాగా రూ.10 వేలకు పైనే రెంట్లున్నాయి. ఇంకా చెప్పాలంటే టెంపుల్ సిటీలైన వేములవాడ, యాదాద్రి, కొండగట్టుల్లో ఎలాగైతే రోజు చొప్పున రెంటు ఉంటుందో అలానే ఈ రెండు పట్టణాల్లో వారం రోజులకు ఏకంగా రూ.10 వేలు రెంట్లు వసూలవుతున్నాయి. ఇదంతా ఎక్కడా అనుకుంటున్నారా? అదేనండి మన ఉప పోరు సంగ్రామ క్షేత్రం.. ఓహౌ.. అదే అదే మన హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల్లో ఇంత రెంట్లు ఉండటం గమనార్హం.

హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో రెండు నెలలుగా ఊర్లమీద ఊర్లు పడ్డట్టు ఎక్కడెక్కడి నుంచో నాయకులు, వీఐపీలు వచ్చి హుజూరాబాద్, జమ్మికుంటలోనే మకాం ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఆ రెండు ప్రాంతాల్లో అద్దెఇండ్ల కిరాయిలు అమాంతం పెరిగిపోయాయి. ఎంతైనా ఇచ్చేందుకు ముందుకొచ్చినా అక్కడ రెంట్లు దొరకని పరిస్థితి ఉంది. డబ్బులు వస్తున్నాయి కాబట్టి సింగిల్ బెడ్‌రూం, డబుల్ బెడ్‌రూం ఇండ్లవాళ్లయినా ఒకే రూంలో సర్దుకుని మిగితా పోర్షన్‌ను రెంటుకిచ్చి డబ్బులు గడిస్తున్నారు. నిజానికి ఈ ఉప ఎన్నికలు లేకుంటే అక్కడ కనీసం 5 వేలకు కూడా ఇల్లు ఎవరూ అద్దెకుండే వారు కాదు. కానీ ఇప్పుడు ఏకంగా వారానికే రూ.10 వేలు చెల్లిస్తూ నాయకులు ఉంటున్నారు.
ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన కళాకారులు, కార్యకర్తలు, నేతలు ఉండేందుకు ప్రధాన పార్టీలు ఇళ్ల కోసం వెదుకుతున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ఇతర వర్గాల నేతలంతా ఇక్కడే బస చేస్తుండటంతో ఒక్కసారిగా గ హ యజమానులకు డిమాండ్ ఏర్పడింది. డిమాండ్‌ను బట్టి ఇళ్ల యజమానులు అద్దెలను భారీగా పెంచేశారు. అడిగినంతా ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నా ఇంకా కొందరికి రెంట్‌కు ఇల్లు దొరకని పరిస్థితి ఉంది. ప్రధానంగా హుజూరాబాద్, జమ్మికుంటల్లోని హౌటల్లు, లాడ్జీలు ఇప్పటికే కిటకిటలాడుతున్నాయి. పట్టణాల్లో ఇండ్లు దొరకకపోవడంతో నాయకులు ఊర్లలో మకాం ఏర్పాటు చేసుకునేందుకు ఇండ్లకోసం అన్వేషిస్తున్నారు.
హుజురాబాద్‌లో నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల ప్రచారం 27వ తేదీతో ముగియనుంది. అప్పటివరకు హుజురాబాద్‌లో ఉండేందుకు నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందువల్లే అద్దె ఇళ్లకు డిమాండ్ ఏర్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. అటు తర్వాత అంతా నార్మల్ పరిస్థితికి రానుంది.