
తెలంగాణలో వైఎస్ షర్మిల రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టడానికి సిద్ధమవడంతో.. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు తమ అభిప్రాయం చెప్పాయి. ఆంధ్రను వదిలి పెట్టి తెలంగాణకు రావడంలో ఆంతర్యం ఏంటని కొందరు ప్రశ్నిస్తే.. ఇదంతా ఎవరో ఉద్దేశపూర్వకంగా చేయిస్తున్న ప్రయత్నం అని మరికొందరు అన్నారు. తాను మాత్రం తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి వస్తున్నానని చెప్పుకొచ్చారు షర్మిల. ఈ నేపథ్యంలో షర్మిల పార్టీ ప్రభావం ఉంటుందా? ఉంటే.. ఏ మేరకు? అన్నది ఆసక్తికరమైన చర్చ.
పార్టీ ప్రారంభిస్తానని షర్మిల చెప్పిన తర్వాత హైదరాబాద్ లోటస్ పాండ్ లో హడావిడి, నల్గొండ నేతలతో సమాలోచనలు, ఖమ్మంలో మీటింగులు.. ఇవి మాత్రమే ఇప్పటి వరకు జరిగాయి. భవిష్యత్ లో రాష్ట్రం మొత్తం పర్యటించొచ్చు. పాదయాత్ర చేస్తానని కూడా షర్మిల చెప్పారు. అయితే.. ఆమె వెంట ఎవరు నడుస్తారు? తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేంత రాజకీయ శూన్యత ఉందా? అనేది ప్రశ్న.
ఈ ప్రశ్నకు ఖచ్చితంగా లేదనే చెప్పాలి. టీఆర్ఎస్ కు తామే ప్రయత్యామ్నాయం అని చెప్పుకుంటోంది బీజేపీ. ఆ మేరకు ప్రయత్నాలు కూడా గట్టిగానే చేస్తోంది. అటు.. కాంగ్రెస్ కూడా కిందా మీదా పడుతూ ముందుకు సాగుతోంది. టీఆర్ఎస్ పెద్దగా బలహీన పడిన దాఖలాలు ఇప్పటి వరకు కనిపించలేదు. అందువల్ల.. షర్మిల పార్టీ ప్రయాణం ఎందాక? వచ్చే ఎన్నికల వరకేనా? అనే విశ్లేషణలు కూడా సాగుతున్నాయి.
అయితే.. ఆమె వెంట నడిచే వారిని గమనిస్తే.. టీఆర్ఎస్ వ్యతిరేకులు, రాజకీయంగా సరైన ప్రాధాన్యత లేనివారు మాత్రమే కనిపిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఇతర పార్టీల నుంచి ఆమె వైపు చూసే అవకాశం పెద్దగా కనిపించట్లేదు. ఇక, కేడర్ ఎక్కడి నుంచి వస్తారనే ప్రశ్న కూడా ఉంది. నిరుద్యోగ యువతను ఆమె నమ్ముకున్నట్టు కనిపిస్తున్నా.. వారంతా షర్మిల వెంట నడుస్తారని చెప్పలేం.
ఈ నేపథ్యంలో కొందరు చెబుతున్న మాట ఏమంటే.. టీడీపీ కేడర్ ఉంది కదా అని అంటున్నారు. తెలుగుదేశానికి తెలంగాణలో రాజకీయ భవిష్యత్ లేదని తెలిసిన తర్వాత చాలా మంది టీఆర్ఎస్, ఇతర పార్టీల్లోకి వెళ్లారు. అయితే.. కొందరు మాత్రం అలాగే ఉండిపోయారు. వారు షర్మిల వెంటనే నడిచే అవకాశం ఉందని అంటున్నారు. వారిని ఆకర్షించడం అనేది షర్మిల టాలెంట్ మీదనే ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. మరి, నిజంగానే వారు షర్మిల వెంట నడుస్తారా? లేదా? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.