DMK Victory Tamil Nadu: ఇసుకనుంచి మొదలు పెడితే మైనింగ్ వరకు లెక్కలేని స్థాయిలో కుంభకోణాలు.. ఏకంగా కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది.. చాలామందిని అరెస్ట్ చేసి పడేసింది. ఇంకా కొంతమందిని విచారిస్తోంది. వాస్తవానికి ఇంతటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం మరో రాష్ట్రంలో అయితే అధికారంలోకి వచ్చేది కాదు. కానీ తమిళనాడులో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది.
తమిళనాడు ఎన్నికల ప్రచారం లో టీవీ కే విజయ్, ఏఐడీఎం కే కూటమినేతలు పదేపదే డీఎంకే అవినీతి మీద ఆరోపణలు చేశారు. స్టాలిన్ నుంచి మొదలుపెడితే ఆయన కుమారుడు ఉదయనిధి వరకు విమర్శలు చేశారు. కానీ వీటిని తమిళ ప్రజలు అంత గొప్పగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ లో ప్రతి సర్వే సంస్థ తమిళనాడు ఎన్నికల్లో డిఎంకె అధికారంలోకి వస్తుందని ప్రకటించింది. తమిళనాడు ఎన్నికల్లో ద్రావిడ వాదం ఎప్పటికీ బలంగానే ఉంటుంది. ఈసారి డిఎంకె అవినీతి ముందు అది ఓడిపోతుందని అటు ఏఐడీఎంకె, ఇటు టీవీకే భావించాయి. కానీ ప్రజలు మాత్రం డీఎంకే వైపు ఆసక్తి చూపించారని తెలుస్తోంది. దీనికి తోడు డీఎంకే అవినీతిని ప్రజలు పట్టించుకోలేదని క్షేత్రస్థాయిలో పరిస్థితులను బట్టి అర్థమవుతుంది. డీఎంకే ప్రజాకర్షణ పథకాలు తమిళ ప్రజలను ఆకట్టుకున్నాయని.. అందువల్లే వారు డీఎంకే వైపు జై కొట్టారని సమాచారం.
సీట్ల కేటాయింపు నుంచి మొదలుపెడితే.. పోల్ మేనేజ్మెంట్ వరకు అన్ని విషయాలలో డీఎంకే మిగతా పార్టీల కంటే భిన్నంగా వ్యవహరించింది. డీఎంకే కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ.. డీఎంకే నేతలు చెప్పిన మాటే ఫైనల్ అయింది. దీనికి తోడు ద్రావిడ వాదాన్ని బలంగా చాటి చెప్పడంలో డీఎంకే నేతలు విజయవంతం అయ్యారు. పైగా డిఎంకె నేతలు ఏఐడీఎం కేను మాత్రమే లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. టి వి కే పార్టీని అసలు లెక్కలో పెట్టలేదు. దీనికి తోడు టీవీకే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం డీఎంకేకు వరంగా మారింది. తమిళనాడు రాష్ట్రంలో అందువల్లే డీఎంకే మరోసారి అధికారంలోకి రాబోతోంది.
సెంథిల్ బాలాజీ వంటి మంత్రి కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారుల విచారణలో ఉన్నప్పటికీ.. అనేక రకాలుగా అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ డిఎంకె ను తమిళ ప్రజలు ఒప్పుకుంటున్నారంటే.. అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ఏఐడీఎంకె ఒంటరిగా పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో నైనా.. డీఎంకే ను ఓడించే అవకాశం ఉంటుందని తమిళ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.