Udhayanidhi Stalin: దేశమంతా రాముడి నామస్మరణతో మార్మోగుతోంది. జనవరి 22న అయోధ్యలో జరిగే రామ మందిరం ప్రారంభోత్సవం, రాముడి ప్రాణ ప్రతిష్ట కు సర్వం సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. దేశమంతా ఆ వేడుకను చూసేందుకు 1000 కళ్ళతో ఎదురుచూస్తోంది. ఇలాంటి నేపథ్యంలో తమిళనాడు ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలను మర్చిపోకముందే.. మరోసారి అగ్గి రాజేశారు.
గత ఏడాది తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఓ సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై నెత్తి మాసిన మాటలు మాట్లాడారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చారు. అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. సాక్షాత్తు కోర్టు కూడా జోక్యం చేసుకొని ఉదయనిధి స్టాలిన్ ను మందలించింది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు అలాంటి మాటలు మాట్లాడకూడదని హితవు పలికింది. ఇకపై అలాంటి మాటలు మాట్లాడబోనని ఉదయనిధి స్టాలిన్ అప్పట్లో కోర్టుకు విన్నవించారు. దీనిని మర్చిపోకముందే మరొకసారి ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రాముడి మందిరం, రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న వేళ ఆయన తన కడుపులో ఉన్న అక్కసు మొత్తం వెల్లగక్కారు. తమ పార్టీ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి వ్యతిరేకం కాదని.. కానీ మసీదు పడగొట్టి మందిరం నిర్మించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. తమ పార్టీ ఏ మతానికీ వ్యతిరేకం కాదని.. కరుణానిధి కూడా ఇదే విషయాన్ని పదే పదే చెప్పేవారని ఉదయనిధి గుర్తు చేశారు. ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని ఆయన బిజెపి నాయకులకు హితవు పలికారు. రామ మందిర నిర్మాణంతో తమకు వచ్చిన ఇబ్బంది లేదని.. ఉన్న సమస్య మొత్తం మసీదు విధ్వంసం చేసి మందిరం నిర్మించడం పైన అని ఉదయనిధి పేర్కొన్నారు.
కాగా ఉదయనిధి చేసిన వ్యాఖ్యల పట్ల బిజెపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ మతంపై, హిందూ దేవుళ్ళపై ఉదయనిధి అక్కసు వెళ్ళగక్కుతున్నారని ఆరోపించారు. గతంలో కూడా సనాతన ధర్మంపై ఉదయ నిధి స్టాలిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని.. కోర్టు మొట్టికాయలు వేసినప్పటికీ ఆయనకు బుద్ధి రావడం లేదని అన్నారు. రామ మందిర నిర్మాణాన్ని, రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టను ఉదయనిధి స్టాలిన్ జీర్ణించుకోలేకపోతున్నారని.. రామ మందిరం నిర్మాణం పై వ్యాఖ్యలు చేసే ముందు తమిళనాడు రాష్ట్రంలో పేట్రోగిపోతున్న అవినీతి గురించి ఉదయనిధి స్టాలిన్ ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలుకుతున్నారు. ఉదయనిధి స్టాలిన్ తండ్రి పాలన బాగుంటే ఓ మంత్రి జైలుకు ఎందుకు వెళ్తారని.. దాని గురించి ఎప్పుడైనా ఉదయనిధి ఆలోచించారా అని ప్రశ్నిస్తున్నారు. ఉదయనిధి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన బిజెపి నాయకుల నుంచి మాత్రమే కాకుండా హిందూ సంఘాల నుంచి కూడా తీవ్ర నిరసన ఎదుర్కొంటున్నారు.