
YCP : ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో అసంతృప్తి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఎవరినీ మీడియా ముందు మాట్లాడేందుకు ఇష్టపడటం లేదట. తాడేపల్లి ప్యాలెస్‌కు కూడా ఎమ్మెల్యేలను రావద్దని అనేస్తున్నారు. తామే పాపం చేశామని కొంతమంది లోలోపల కుమిలిపోతుంటే, బానిసల్లా చూస్తున్నారని ఇంకొంతమంది బాహాటంగా తమ అనునాయుల వద్ద చెప్పుకొని వాపోతున్నారు. ముందు ముందు ఏ క్షణమైన అసంతృప్తి బాంబు పేలే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నారు.
వైసీపీ ఎమ్మెల్యేలపై నిఘా ఎక్కువైపోయిందనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎవరు ఎవరినీ కలుస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారో అన్న ఆందోళనకర వాతావారణం నెలకొని ఉంది. రాబోవు ఎన్నికలు వైసీపీకి అంత ఈజీ కాదు. ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉంది. ఏ ఎమ్మెల్యే అయినా మరోసారి అధికారం చెపడితేనో లేదా గెలిచే పార్టీకి అనుకూలంగా ఉంటేనో భవిష్యత్తులో పరిస్థితులు బాగుంటాయి. ఈ క్రమంలో ఇతర పార్టీల నేతలతో టచ్ లోకి చాలామంది వెళ్లిపోతున్నారు. దీంతో తాడేపల్లి అధినాయకుల పెత్తనం అందరిపై ఎక్కువైపోయి ప్రతి ఒక్కరినీ అనుమానంగా చూస్తున్నారట.
ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు వైసీపీలో ఉన్న ఒత్తిడి వాతావరణం నుంచి బయటకు వచ్చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ కు గురవుతుందంటూ బాంబు పేల్చారు. ఇలాగే తమ ఫోన్లు కూడా ట్యాపింగ్ అవుతున్నాయేమోనని మరికొంత మంది ఎమ్మెల్యేల్లో అనుమానాలు ఎక్కువైపోయాయి. అధికారం కోసం తొమ్మిదేళ్లు కష్టపడితే తమను అనుమానించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇందులో సీనియర్లు కూడా ఉన్నారు. వారిలో కోపం ఎక్కువైపోతోంది. ఈ నాలుగేళ్లు నోరు మెదపని చాలా మంది ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఏం చెబుతారోనన్న టెన్షన్ అధినాయత్వంలో కనిపిస్తుంది.
ఈ వాతావరణం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలోనూ కనిపిస్తుంది. ప్రెస్ మీట్లకు కూడా అనుమతించడం లేదట. జగన్ వద్దకు వెళ్లాలంటే ముందు సజ్జలను దాటాల్సి రావడం సీనియర్లకు మరింత అసహనాన్ని కల్పిస్తుంది. ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనిసిస్తోంది. ఎమ్మెల్యేల్లో కూడా పార్టీపై అసంతృప్తి పెరిగిపోతోంది. వైసీపీకి ఓటమి భయం పట్టుకొని ప్రజల్లోకి ఎలా వెళ్లాలో వ్యూహాల రచిస్తున్న సందర్భంలో, పార్టీలో నెలకొన్న జీ హుజూర్ వంటి పోకడలపై ఏ క్షణంలోనైనా వ్యతిరేకత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది సరిగ్గా ఎన్నికల సమయంలో బయటపడితే వైసీపీకి కోలువడం కష్టంగానే మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.