Revanth Reddy- Congress Senior Leaders: ఇటీవలి దాకా ఇతర పార్టీల నాయకుల చేరికలతో జోష్ మీద ఉన్న రేవంత్ రెడ్డి పై ఇప్పుడు రాళ్లు పడుతున్నాయి. మొన్నటి దాకా పార్టీలో ఉన్నవారు ఇప్పుడు రేవంత్ పై నిందలు వేస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వెంకట రెడ్డి, దాసోజు శ్రవణ్ వీరంతా కూడా కాషాయ కండువా కప్పుకోవడం లాంఛనమే. వీరిలో ఒక దాసోజు శ్రవణ్ మినహా మిగతా వారంతా కాంగ్రెస్ లో పదవులు అనుభవించినవారే. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యాక పార్టీ అధిష్టానం అన్ని విషయాల్లో ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది కొంతమంది నేతలకు మింగుడు పడటం లేదు. అయితే అందులో అందరూ బయటపడకపోయినప్పటికీ కొందరు మాత్రం రేవంత్ తీరు నచ్చక బయటకు వచ్చేస్తున్నామంటూ చెబుతున్నారు. రేవంత్ పై స్వరం పెంచిన వాళ్ళల్లో ముందు వరుసలో ఉండే వ్యక్తి వి హనుమంతరావు. ఆ తర్వాత కోమటిరెడ్డి సోదరులు. అయితే మొన్నటిదాకా కోమటిరెడ్డి సోదరులు కాంగ్రెస్ లోనే కొనసాగుతారనే అభిప్రాయాలు ఉండేవి. కానీ ఎప్పుడైతే అమిత్ షా తెలంగాణలో రెండు మార్లు పర్యటించారో అప్పుడే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీనికి తోడు ఈటల రాజేందర్ ను ఢిల్లీకి పిలిపించుకొని మంతనాలు జరపడంతో ఇతర పార్టీల నాయకులకు గాలం వెయ్యడం ప్రారంభమైంది. అందులో మొదటి ప్లాన్ ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ప్రారంభమైంది.

రేవంత్ రెడ్డి ని ఎందుకు టార్గెట్ చేసినట్టు
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో రచ్చబండ పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పైగా రాహుల్ గాంధీతో త్వరలో సిరిసిల్లలో నిరుద్యోగ సైరన్ పేరుతో భారీ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇది కాంగ్రెస్కు ఎంతో కొంత లాభం చేకూర్చుతోంది. ఉత్తర తెలంగాణతో పోలిస్తే దక్షిణ తెలంగాణలో బిజెపి ప్రభావం నామ మాత్రమే. మరోవైపు కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు రేవంత్ రెడ్డి పడుతున్న శ్రమ అంతా ఇంత కాదు. ఇటీవల బడంగ్పేట్ మున్సిపల్ చైర్పర్సన్ కాంగ్రెస్లోకి చేరడమే ఇందుకు ప్రబల నిదర్శనం. కొంతమంది నాయకులు కూడా కాంగ్రెస్లో చేరెందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే మొదటి నుంచి కూడా టిఆర్ఎస్ నే తమ ప్రత్యర్థిగా భావిస్తున్న రేవంత్ రెడ్డి ఆ పార్టీ పైనే దృష్టి సారించారు. టిఆర్ఎస్ పార్టీలో అభద్రతా భావం లో ఉన్న నాయకులందరితో అంతర్గతంగా మాట్లాడుతున్నారు. అయితే వారికి బలమైన హామీలు ఇస్తూ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు అస్సలు రుచించడం లేదు.
Also Read: Vice Presidential Election 2022: నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక..గెలిచేదెవరు?
అందుకే బయటకి వెళుతున్నారా
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరులు మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. వీరికి చెరుకు సుధాకర్ గౌడ్ కు ఆది నుంచి పొర పచ్చాలు ఉన్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో వీరి ఓటమికి చెరుకు సుధాకర్ అనే ఆరోపణలు లేకపోలేదు. అయితే గత కొంతకాలం నుంచి చెరుకు సుధాకర్ తో రేవంత్ రెడ్డి టచ్ లో ఉన్నారు. తమ శత్రువుతో తమ పార్టీ అధ్యక్షుడు సన్నిహితంగా ఉండడాన్ని జీర్ణించుకోలేని కోమటిరెడ్డి సోదరులు ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. వరంగల్ జిల్లాలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ సభలో విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాలని కోమటిరెడ్డి సోదరులు ప్రయత్నించినా ఆ అవకాశం దక్కలేదు. దీంతో కోమటిరెడ్డి సోదరులు పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారు. ఇందులో మొదటగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పలుమార్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఆయన నుంచి బలమైన హామీ రావడంతో మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించారు.

మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బిజెపిలో చేరేది ఇక లాంచనమే అని తెలుస్తోంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న దాసోజు శ్రవణ్ ఖైరతాబాద్ సీటు పై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. 2018 ఎన్నికల్లో ఖైరతాబాద్ లో పోటీ చేసి ఓడిపోయారు. ఎలాగూ మళ్ళీ అక్కడే పోటీ చేసి గెలవాలని ఎంతో ఆశతో ఉన్నారు. అయితే ఇటీవల విజయ రెడ్డి అనే టీఆర్ఎస్ కార్పొరేట్ కాంగ్రెస్ లో చేరడంతో ఆయన ఆగ్రహంగా ఉన్నారు. పైగా ఖైరతాబాద్ సీటును విజయా రెడ్డికి కేటాయించారనే సమాచారం ఉండటంతో ఆయన అదును చూసుకొని బిజెపిలో చేరారు. వేరే కాకుండా ఇంకా కొంతమంది కాంగ్రెస్ నాయకులు బిజెపిలోకి చేరేందుకు దగ్గర సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు రేవంత్ రెడ్డి వర్గం వారి పై గుర్రుగా ఉన్నారు. వీరందరినీ దాటుకొని కేసీఆర్ ను ఢీ కొట్టేంత స్టామినా రేవంత్ రెడ్డికి ఉంటుందా అనే సందేహాలు ప్రస్తుతం వ్యక్తం అవుతున్నాయి.
Also Read:Chikoti Praveen Case: చీకోటి ప్రవీణ్ కేసులో సంచలనం: 3 తెలంగాణ ఎమ్మెల్యేలు, ఒక ఏపీ ఎమ్మెల్యే బుక్

[…] […]
[…] […]
[…] […]