TDP: తెలుగుదేశం పార్టీకి ఇటీవల వరుసగా ఎదురవుతున్న పరిణామాలు కృంగదీస్తున్నాయి. పడిపోయి లేచే క్రమంలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించిన కొద్దిసేపటికే నందమూరి తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. లోకేష్ రాజకీయ భవిష్యత్ కు కీలకంగా భావిస్తున్న పాదయాత్ర ప్రారంభించిన నాడే అపశృతి చోటుచేసుకోవడంతో చంద్రబాబుతో పాటు టీడీపీ నాయకులకు మింగుడుపడడం లేదు. ఇటీవల చంద్రబాబు వరుస సభల్లో 11 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఆ ఘటన తరువాత వైసీపీ ప్రభుత్వం విపక్షాలపై జీవో 1 తీసుకురావడం, దానిపై దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లోకేష్ పాదయాత్రలో తారకరత్న అస్వస్థతకు గురికావడంతో… అటు పాదయాత్ర కంటే ఆస్పత్రి ఎపిసోడే ఫోకస్ అయ్యింది.

అయితే ఈ వరుస ఘటనలు రాజకీయ ప్రత్యర్థులకు అస్త్రంగా మారుతున్నాయి. తండ్రీ కుమారుల కార్యక్రమాలంటే ఏదో ఇక అపశృతి జరగాల్సిందేనన్న ప్రచారం మొదలుపెట్టారు. టీడీపీ హయాంలో గోదావరి పుస్కరాల తొక్కిసలాట నుంచి మొన్న గుంటూరు ఘటన వరకూ గుర్తుచేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు తారకరత్న అస్వస్థతను ఉదహరిస్తూ.. నాడు తండ్రి, నేడు కుమారుడు అంటూ ట్యాగ్ చేసి పోస్టులు పెడుతున్నారు. కామెంట్లు చేస్తున్నారు. ఇప్పడవి వైరల్ అవుతున్నాయి. తండ్రీ, కుమారుల కార్యక్రమానికి వెళితే ఇదేం ఖర్మరా అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.
వైసీపీ సర్కారు వైఫల్యాలపై చంద్రబాబు ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అటు తానూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో పర్యటనలకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు సభలకు భారీగా పోటెత్తారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. పార్టీకి మంచి మైలేజ్ తీసుకొచ్చింది. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. తొక్కిసలాటలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఆ ఘటన మరువక ముందే గుంటూరులో ఓ ఎన్ఆర్ఐ సంస్థ నిర్వహించిన చంద్రన్న కానుకుల పంపిణీలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతిచెందారు. దీంతో వైసీపీ శ్రేణులు చంద్రబాబుపై ఒకరకమైన ప్రచారం మొదలుపెట్టారు.

ఇప్పుడు ఓ మంచి ముహూర్తం చూసి.. సర్వమత ప్రార్థనలు చేసి పాదయాత్రకు లోకేష్ సిద్ధపడితే తారకరత్న అస్వస్థత రూపంలో అపశృతి ఎదురైంది. దీనిని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. అంతులేని విజయం ముందు ఇటువంటి కష్టాలు కామనేనని కొట్టిపారేస్తున్నారు. ప్రజల రెస్పాన్స్ కోసం చేసిన పనులుకావని.. గతంలో కోడికత్తిలాంటి డ్రామాలను గుర్తుచేసుకుంటున్నారు. ప్రమాదాలు, అనారోగ్యాలను సైతం వైసీపీ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.