Digital Media: పత్రికలు పెట్టుబడిదారుల విష పుత్రికలయ్యాయి. చానల్స్ రాజకీయ పార్టీలకు బాకాలయ్యాయి. గేమ్ చేంజర్ లాంటి డిజిటల్ మీడియాలోనూ అలాంటి అవలక్షణాలే.. అలాంటప్పుడు స్వతంత్రంగా రాయాలంటే కష్టం. అవినీతిని, అక్రమాలను వెలికి తీయాలంటే కష్టం. వాటిని జనంలోకి తీసుకెళ్లాలంటే ఇంకా కష్టం. కానీ ప్రతి కష్టం వెనుక ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతుంది. అలాంటి పరిష్కారమే వ్యవస్థలో మార్పుకు కారణమైంది. రాజకీయ పెద్దలు గద్దల్లాగా జనాన్ని ఎలా పీడిస్తున్నారో అవకతమైంది. వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఎలాంటి దారుణాలకు పాల్పడుతున్నారో సభ్య సమాజానికి తెలిసింది. అయితే ఈ అక్షర యజ్ఞంలో ఆ నిష్పక్షపాత పాత్రికేయులకు అండగా నిలిచింది బడా మీడియా కాదు.. అక్షరాలా డిజిటల్ మీడియా..
డిజిటల్ మీడియా అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రధాన మీడియా పాత్ర నామమాత్రం అయిపోయింది. కమర్షియల్ యాడ్స్, తెర వెనుక లెక్కలు, రాజకీయ ప్రయోజనాలు.. ఇన్ని ఉన్నాయి కాబట్టి ప్రధాన మీడియా అనేది జస్ట్ వ్యాపార వస్తువుగా మారిపోయింది. అధికారంలో ఎవరు ఉంటే వారికి అద్దె స్వరం లాగా మారిపోయింది. యాజమాన్యాల వ్యాపార కోణమే ఇన్ని అవలక్షణాలకు ప్రధాన కారణం. ఇక ఆయా యాజమాన్యాల పరిధిలో పనిచేసే వారంతా పాత్రికేయుల లాగా కాకుండా ఉద్యోగులు లాగా పనిచేస్తుంటారు కాబట్టి.. అంతకుమించి వాటిల్లో నాణ్యతను, నిష్పక్షపాతాన్ని ఊహించడం నేతి బీరే అవుతుంది. అయితే డిజిటల్ మీడియా అనేది వ్యాపార వస్తువు కాదని.. అది ఒక పాశుపతాస్త్రామని.. పాంచ జన్యమని నిరూపించారు కొంతమంది సీనియర్, ఇండిపెండెంట్ పాత్రికేయులు.
2019లో లోకేష్ బాత్రా అనే నేవీ విశ్రాంత ఉద్యోగి సమాచార హక్కు చట్టం ద్వారా కొన్ని ఆధారాలు సేకరించారు. ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీల ద్వారా విరాళాలు పొందేందుకు ఎలాంటి పన్నాగాలు పన్నుతున్నాయో ఆధారాలతో సహా సేకరించారు. వాటిని ప్రజలకు వివరించేందుకు నితిన్ సేథి అనే ఒక పరిశోధనాత్మక పాత్రికేయుడిని సంప్రదించారు. నితిన్ మనదేశంలో రెండు దశాబ్దాలుగా వివిధ అంశాలపై పరిశోధనాత్మక కథనాలు రాశారు. ప్రధాన మీడియాలో అతడికి స్వేచ్ఛ లేకపోవడంతో రిపోర్టర్స్ కలెక్టివ్ అనే సంస్థను ఏర్పాటు చేసి దానికి ట్రస్టీ గా వ్యవహరిస్తున్నారు. బాత్రా ఇచ్చిన ఆధారాలతో సేథి సంచలన కథనాలు రాశారు. అవి భారత దేశంలో ఎన్నికల బాండ్ల అసలు రూపాన్ని ప్రజల ముందు ఉంచాయి.. అసలు ఎన్నికల బాండ్లను ఎందుకు తెరపైకి తీసుకొచ్చారు? ఎన్నికలకు ముందు వాటిని అక్రమంగా ఎందుకు విక్రయించారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పినప్పటికీ ఎందుకు పట్టించుకోలేదు? ఇలా అనేక అంశాలపై ప్రభుత్వ తప్పిదాలను వివరిస్తూ ఆరు భాగాల సిరీస్ ను సేథి రూపొందించారు.
ఈ కథనాలను ముందుగా హఫింగ్టన్ పోస్ట్ లో ప్రచురించారు. మిగతా వెబ్సైట్స్ కూడా వీటిని పబ్లిష్ చేశాయి. సేథి ఆధ్వర్యంలో రిపోర్టర్స్ కలెక్టివ్ ద్వారా ఈ విషయాలు మొత్తం బయటికి రావడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పెను దుమారం చెలరేగింది. అయితే ఇటువంటి సంచలన వార్తను ప్రధాన మీడియా పట్టించుకోకపోవడం విశేషం. దేశంలో పేరుపొందిన మీడియా హౌస్ లు విస్మరించడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల బాండ్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని తూర్పార పట్టింది. ఎన్నికల బాండ్ల రూపంలో వచ్చిన డబ్బులు, ఎవరు ఆ నగదు ఇచ్చారో పూర్తి వివరాలు తెలియజేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. కానీ ఈ విషయాన్ని పత్రికలు, చానల్స్ ప్రసారం చేయకపోవడం విశేషం.
మనదేశంలో అన్ని భాషల్లో కలిపి 21 వేల సర్టిఫైడ్ న్యూస్ పేపర్స్ ఉన్నాయి. 400 కు మించి న్యూస్ చానల్స్ ఉన్నాయి. కానీ ఇవేవీ డిజిటల్ మీడియాతో పోటీ పడలేకపోతున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా దిగజారి పోతోందని చెప్పడానికి ఇదే ప్రబల ఉదాహరణ. ది రిపోర్టర్స్ కలెక్టివ్, న్యూస్ లాండ్రీ, స్క్రోల్, ది క్వింట్, ది న్యూస్ మినిట్ వంటి వెబ్ సైట్ లు ఇలాంటి సంచలనాత్మక కథనాలను పబ్లిష్ చేస్తున్నాయి. ఎప్పుడైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా కమర్షియల్ యాడ్స్ కోసం దిగజారిపోయిందో.. అప్పుడే దాని విలువ కోల్పోయింది. ఇప్పుడైతే డిజిటల్ మీడియా దాని హవా కొనసాగిస్తోంది.. వచ్చే రోజుల్లో కచ్చితంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాను అది దాటేస్తుంది. ఎందుకంటే విశ్వసనీయత ఉంటేనే ప్రజల్లో విలువ ఉంటుంది. ఆ విలువను మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎప్పుడో కోల్పోయింది.