విశాఖ ఎల్.జి భాదితుల్లో ఏ ఒక్క కుటుంబానికి అన్యాయం జరగనివ్వనని, ప్రతి ఒక్కరిని అన్ని విధాలుగా ఆదుకుంటానని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రకటించారు. గ్యాస్ లీక్ దుర్ఘటనకు బాధ్యులెవరైనా వదిలిపెట్టబోమని, ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే ఎల్జీ పాలిమర్స్ కంపెనీని తరలిస్తామన్న ముఖ్యమంత్రి, ఇప్పటికే కంపెనీ నుంచి 13 వేల టన్నుల స్టెరైన్ కొరియా పంపించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ప్రభావానికి గురైన వెంకటాపురం, వెంకటాద్రినగర్, పద్మనాభపురం, ఎస్సీ బీసీ కాలనీ, నందమూరినగర్, ఆర్ ఆర్ వెంకటాపురంలో ప్రతి ఒక్కరికీ రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని సోమవారం వారి ఖాతాలకు జమ చేశారు. ఆయా గ్రామాల్లో అధికారుల పక్కా ఎన్యూమరేషన్ ప్రకారం బాధితుల సంఖ్య 19,893 మందిని తేల్చగా, వారందరికీ రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ఇంకా కేవలం 12 ఇళ్లలోని వారి బ్యాంక్ ఖాతాల వివరాలు అందాల్సి ఉందని ఈ సందర్భంగా విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ తెలిపారు. ఆయా గ్రామాల్లో ఆంధ్ర వైద్య కళాశాలకు చెందిన 10 మంది వైద్య నిపుణులతో వైయస్సార్ హెల్త్ క్లినిక్స్ నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ ఘటన చాలా బాధాకరం అన్న ముఖ్యమంత్రి, ఇలాంటిది ఎక్కడా జరగకూడదని ఆకాంక్షించారు. ఇలాంటివి జరిగినప్పుడు ప్రభుత్వం ఎలా స్పందించాలన్నది తాను విపక్షంలో ఉన్నప్పుడు చూశానంటూ, తాను విపక్షనేతగా ఉన్నప్పుడు ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అయి 22 మంది చనిపోతే ఆ గ్రామానికి వెళ్లి పరిస్థితి చూశానని చెప్పారు. అప్పుడు వారికి ఓఎన్జీసీ రూ.20 లక్షలు, కేంద్రం రూ.3 లక్షలు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.2 లక్షలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇలాంటివి జరిగినప్పుడు పెనాల్టీ చాలా ఉంటుందని ఆ కంపెనీ భావిస్తే, అవి చాలా జాగ్రత్త తీసుకుంటాయన్న ముఖ్యమంత్రి, ఇలాంటి ఘటనలు విదేశాల్లో జరిగితే, ఎలా పరిహారం ఇస్తారో ఇక్కడా అలాగే ఇవ్వాలని కోరానని తెలిపారు. అందుకే ఆరోజు బాధితులకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశానని వివరించారు.
విశాఖలో ఈ ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం, అధికార యంత్రాంగం చాలా వేగంగా స్పందించిందని చెప్పారు. తెల్లవారుజామున 4.30 గంటలకల్లా అధికారులంతా రోడ్ల మీదకు వచ్చారు. రెండు గంటల్లో ప్రజలను ఆస్పత్రులు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అందు కోసం కలెక్టర్, కమిషనర్‌తో సహా, అధికారులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటివి జరిగితే ప్రభుత్వం ఎలా స్పందించాలన్నది చూపమని అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గతంలో ఎక్కడా ఇలా ప్రమాదాల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఇవ్వని విధంగా ఇప్పుడు రూ. కోటి ఇవ్వడమే కాకుండా, దర్యాప్తునకు కమిటీ కూడా ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి చెప్పారు.10 మంది వైద్యులతో యుద్ద ప్రాతిపదికన కమిటీ ఏర్పాటు చేయడమే కాకుండా, అవసరమైన ఉపకరణాలు సమకూర్చామని వెల్లడించారు.
ఇలాంటివి జరిగినప్పుడు అందుకు కారణాలు, బాధ్యులను గుర్తించేందుకు పలు కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు, కంపెనీ నుంచి 13 వేల టన్నుల స్టెరైన్‌ను కొరియాకు పంపించామని గుర్తు చేశారు. అనుమతులన్నీ టీడీపీ హయాంలోనే ఇచ్చారన్నారు. ఈ కంపెనీకి ఒక్క క్లియరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదన్నారు.