
టీడీపీ నేతలు జారిపోతున్నారు. తమకు పార్టీ కంటే వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమని పార్టీ మారుతున్నారు. చంద్రబాబు వాడుకునే రాజకీయం నేతలకు కూడా వంటబట్టడంతో అధికార వైసీపీ వైపు ఆకర్షితులవుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. త్వరలోనే తన వ్యాపార ప్రయోజనాలను కాపాడుకునేందుకు అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సీనియర్ తెలుగు దేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి సిద్ధ రాఘవ రావు చేరబోతున్నారు. ఈయనతో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేల పలువురు కూడా వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది.
బుధవారం సిద్ధ రాఘవ రావు టిడిపి ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో సిద్దాతో పాటు ఆయన కుటుంబ సభ్యులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో త్వరలోనే చేరనున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మంగళవారం సాయంత్రం సిద్ధా రాఘవరావు టీడీపీకి రాజీనామా చేశారు. అధికార వైసీపీ పార్టీలోకి చేరాలని నిర్ణయించుకున్న తరువాత ప్రభుత్వం ఆయన మైనింగ్ లీజులను పునరుద్ధరించడం విశేషం.
ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో బాగా విస్తరించిన గ్రానైట్ పరిశ్రమ టీడీపీ ఎమ్మెల్యేల చేతుల్లో ఉంది. వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం గ్రానైట్ తవ్వకాలలో పాల్గొన్న టిడిపి నాయకుల చుట్టూ ఉచ్చు బిగించి, వారి చాలా పరిశ్రమలను మూసివేసింది. దీంతో సిద్ధ తన వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవటానికి వైయస్ఆర్సికి లొంగడం తప్ప ఈ టీడీపీ నేతలకు మరో మార్గం కనిపించడం లేదు.
ఇప్పటివరకు చంద్రబాబుకు విశ్వసనీయ లెఫ్ట్ హ్యాండ్ గా భావించిన సిద్ధ రాజీనామా చేయడం టీడీపీని షాక్ కు గురిచేసింది. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి, టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడుకు సిద్ధా వైదొలగడం.. వైసీపీలో చేరడం వ్యక్తిగతంగా చంద్రబాబుకు పెద్ద దెబ్బ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
*సిద్ధా రాఘవరావు చరిత్ర ఏంటి?
గతంలో దర్శి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన సిద్ధా రాఘవరావు 2019లో చంద్రబాబు అభ్యర్థన మేరకు ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఎంపీ ఎన్నికల బరిలోకి దిగారు. టిడిపి టికెట్‌ను తిరస్కరించి ఎన్నికలకు ముందు వైఎస్‌ఆర్‌సిపీలోకి దూకిన మగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీ టికెట్ పై ఒంగోలు ఎంపీగా పోటీచేశారు. మాగుంట ఫ్లేటు ఫిరాయించడంతో సిద్దా ఒంగోలు ఎంపీగా టీడీపీ తరుఫున పోటీచేయాల్సి వచ్చింది.
మాగుంటపై పోటీ చేసిన సిద్ధ గట్టి పోటీనిచ్చాడు. కాని చివరికి ఎన్నికలలో ఓడిపోయాడు. ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత కూడా టిడిపిలో చురుకైన పాత్ర పోషిస్తూనే ఉన్నారు.అయితే తాజాగా తన ఆర్థిక మూలాలైన గ్రానైట్ పరిశ్రమపై వైసీపీ ప్రభుత్వం కొట్టడంతో ఇక టీడీపీలో ఉంటే కష్టమని ఆయన వైసీపీలో చేరడానికి రెడీ అయిపోయారు. ఇలా నేతలంతా వైసీపీలోకి కేవలం తమ ఆస్తులు, ఆదాయాన్ని నిలుపుకోవడానికే చేరుతున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
-నరేశ్ ఎన్నం