Huzurabad By Poll: ఏపీలో కులం కోసం చస్తారు.. చంపుతారు.. అక్కడ కుల పట్టింపులు ఎక్కువ.. ‘అరేయ్ వీడు మనోడు రా’ అంటే వాడికోసం ఏమైనా చేస్తారు.. ఇప్పటికీ ఏపీ రాజకీయాలు ‘కమ్మ’, రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యం ప్రబలంగా ఉంది. కాపులు ఇప్పుడిప్పుడే రాజ్యాధికారం కోసం పాటుపడుతున్నా వారిని తొక్కేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణలో ఈ కుల పట్టింపులు చాలా చాలా తక్కువ. ఇక్కడి ప్రజలకు కులం పట్ల ఏపీ వారికున్నంతగా పిచ్చి లేదు. ఏపీలో బ్రిటీష్ రూల్ ఉండగా మొదలైన కుల కట్టుబాట్లు రాష్ట్రంగా విడిపోయాక ఇంకా ఎక్కువయ్యాయి. కానీ తెలంగాణలో నైజాం పాలన కొనసాగడంతో ఇక్కడి వారు కులాలకు అతీతంగా పోరాడారు. అందరూ కలిసిపోయారు. ఇప్పటికీ ఊళ్లలో అన్ని కులాల వారు వరుసలు పెట్టుకొని పిలుచుకుంటూ మాల, మాదిక, బీసీ, రెడ్డి అన్న భావం తెలంగాణ సమాజంలో చాలా తక్కువ. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కూడా అన్ని వర్గాలు ఒక్కతాటిపైకి వచ్చి రాష్ట్రాన్ని సాధించిన విషయం మనం మరిచిపోవద్దు..
అయితే ఇప్పుడు హుజూరాబాద్ లో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఏపీ మార్గంలోనే కొత్త తెలంగాణ కూడా నడుస్తోందన్న టాక్ వినిపిస్తోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో దాదాపు 2.3 లక్షల మంది ఓటర్లు ఉండగా.. అందులో 25శాతం మంది దళితులు. దాదాపు 21000 కుటుంబాలు దళితబంధు కోసం అర్హులు. ఈ పథకం హుజూరాబాద్ లో ఎందుకు అమలు చేయాల్సి వచ్చిందంటే ప్రధాన కారణం బలమైన కులాలే. దళితులను ఆకర్షించేందుకు ఈ పథకం తెచ్చారు.
ఇప్పుడు దళితులకు దళితబంధుతో మిగతా వర్గాలు నొచ్చుకున్నాయి. తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని బీసీ సంఘాలు నొచ్చుకున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వారి డిమాండ్లను నెరవేర్చాలని కుల సమావేశాలు నిర్వహించడం హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా నియోజకవర్గంలో మున్నూరు కాపు గర్జన, విశ్వకర్మ గర్జన, రజక గర్జన, గౌడ గర్జన, శాలివాహన కులాల సమ్మేళనం నిర్వహించడం రాజకీయ పార్టీలకు హెచ్చరికలు పంపినట్టైంది.
ఈ బీసీల ఆగ్రహాన్ని ముందే ఊహించిన సీఎం కేసీఆర్.. అందుకే వ్యూహాత్మకంగా ఈటల రాజేందర్ పై పోటీకి వెనుకబడిన కులానికి చెందిన (బీసీ) గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు టికెట్ ఇవ్వడం విశేషం.
అయితే ప్రస్తుతానికి హుజూరాబాద్ ట్రెండ్ చూస్తే బీసీలు కూడా బీసీనే అయిన ఈటల రాజేందర్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. బీసీ సంఘాల మద్దతు ఈటలకేనని అర్థమవుతోంది. అందుకే టీఆర్ఎస్ మంత్రులు ఈ వర్గాలను ఆకట్టుకునేందుకు నమ్మశక్యం కానీ వాగ్ధానాలు చేస్తున్నారు. కుల భవనాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు.
హుజూరాబాద్ లో బీసీలను ఆకట్టుకోవడానికి టీఆర్ఎస్ ఆపసోపాలు పడుతోంది. టీఆర్ఎస్ గెలిస్తే తమ భూమిలో పేద మున్నూరు కాపు కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని హరీష్ రావు హామీ ఇవ్వడం విశేషం. అంతేకాకుండా మద్యం షాపులు, బార్ల కేటాయింపులో గౌడ్ లకు కోటాలు ఇస్తామని ప్రకటించడం అందుకేనటంటున్నారు. క్రైస్తవులకు చర్చిలు, కమ్యూనిటీ హాళ్లు మొదలైన వాటికి వాగ్ధానం చేశారు.
ఏకపక్షంగా సాగుతున్న ఈ రాజకీయ క్రీడలో హుజూరాబాద్ పూర్తిగా కులాల వారీగా పోలరైజ్ అయిపోయింది. దళితులు వర్సెస్ బీసీలు, ఓసీలు వర్సెస్ బీసీలు, హిందువులు వర్సెస్ హిందూవేతరులు ఇలా హుజూరాబాద్ లో కులాల వారీగా విడిపోయిన పరిస్థితి కనిపిస్తోందంటున్నారు.
అయితే ఈ కులాల కుంపట్లలో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలిచినా.. చివరకు ఓడిపోయేది మాత్రం చివరికి ప్రజలేననడంలో ఎలాంటి సందేహం లేదు.