Bandi Sanjay Padayatra: బండి సంజయ్ పాదయాత్ర బీజేపీకి ఊపు తెచ్చిందా? లేదా?

Bandi Sanjay Padayatra: రాజకీయాల్లో అన్నింటికంటే పవర్ ఫుల్ యాత్ర ‘పాదయాత్ర’. దీన్ని మించిన అస్త్రం మరొకటి లేదు. దీన్ని గురిచూసి ‘బ్రహ్మాస్త్రం’లా వాడాలే కానీ రాజ్యాధికారం సాధ్యమే. నాడు వైఎస్ఆర్.. తర్వాత చంద్రబాబు.. మొన్నటికి మొన్న జగన్ రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ముఖ్యమంత్రులు అయ్యారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఈ పాదయాత్రల వేడి మొదలైంది. మొదట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభించిన పాదయాత్ర ఈరోజు హుస్నాబాద్ లో ముగుస్తోంది. ఆ […]

Written By: NARESH, Updated On : October 2, 2021 12:55 pm
Follow us on

Bandi Sanjay Padayatra: రాజకీయాల్లో అన్నింటికంటే పవర్ ఫుల్ యాత్ర ‘పాదయాత్ర’. దీన్ని మించిన అస్త్రం మరొకటి లేదు. దీన్ని గురిచూసి ‘బ్రహ్మాస్త్రం’లా వాడాలే కానీ రాజ్యాధికారం సాధ్యమే. నాడు వైఎస్ఆర్.. తర్వాత చంద్రబాబు.. మొన్నటికి మొన్న జగన్ రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ముఖ్యమంత్రులు అయ్యారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఈ పాదయాత్రల వేడి మొదలైంది. మొదట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభించిన పాదయాత్ర ఈరోజు హుస్నాబాద్ లో ముగుస్తోంది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి, వైఎస్ షర్మిలలు ఈ పాదయాత్రలకు ‘క్యూ’లో ఉన్నారు. మరి బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర తెలంగాణలో ఊపు తెచ్చిందా? ఆ పార్టీకి మైలేజ్ వచ్చిందా? ఈ యాత్రతో బీజేపీ అధికారంలోకి వస్తుందా? లేదా? అన్న దానిపై స్పెషల్ ఫోకస్..

-కిషన్ రెడ్డి వర్గం సహకరించిందా?
తెలంగాణ రాజకీయాల్లో దూసుకొచ్చిన యువ కెరటం ‘బండి సంజయ్’. ఒక కరీంనగర్ కార్పొరేషన్ లో కార్పొరేటర్ గా ఉన్న బండి సంజయ్ అనూహ్యంగా వరుసగా రెండు సార్లు ఓడిన సానుభూతితో ఏకంగా కరీంనగర్ ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత దూకుడు రాజకీయాలతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అయ్యాడు. కానీ ఈయన కంటే బీజేపీ తెలంగాణ రాజకీయాల్లో కిషన్ రెడ్డి సీనియర్. పైగా కేంద్రమంత్రి. ఈ క్రమంలోనే బండి పాదయాత్ర.. కిషన్ రెడ్డి ఆశీర్వాద యాత్ర కారణంగా ఓసారి వాయిదా పడింది. పైకి ఇద్దరూ కలిసి యాత్రలు చేసినా ఆ రెండు వర్గాలు కలవలేదని.. సహకరించుకోలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక బండి సంజయ్ పాదయాత్రలోనూ బీజేపీ సీనియర్లు చురుకుగా పాల్గొనలేదని.. ఏదో మోహమాటానికి కేంద్రమంత్రులు, జాతీయ నేతలు వచ్చినప్పుడు సందడి చేశారన్న టాక్ వినిపిస్తోంది.

-మీడియా ‘బండి’ని తొక్కేసిందా?
తెలంగాణ మీడియా సైతం బండి సంజయ్ పాదయాత్రకు అంతగా కవరేజ్ ఇవ్వలేదన్నది వాస్తవం. బీజేపీకి తెలుగు రాష్ట్రాల్లో బలమైన పత్రికలు, మీడియా చానెల్లు లేవు. ఉన్నా ఒకటి రెండు, సోషల్ మీడియాతో ప్రచారం చేసుకున్నారు. తెలుగు మీడియా ఎంతసేపు ఆంధ్రా రాజకీయాలు, పవన్, వైసీపీ, జగన్ చుట్టూనే తిరిగాయి. ఇక వైఎస్ షర్మిల ఆంధ్రా రాజకీయాలు, సంచలనాల వెంటపడ్డాయి. ఈ క్రమంలోనే బండికి కావాల్సినంత హైప్ రాలేదన్న టాక్ వినిపిస్తోంది. అందుకే సొంతంగా బలమైన మీడియాను బీజేపీ సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఎన్ని యాత్రలు చేసినా ప్రజల్లో మైలేజ్ రాక అదంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని అంటున్నారు

-కోవిడ్ ఎఫెక్ట్ తో ప్రజల నుంచి బండికి మద్దతు రాలేదా?
కోవిడ్ ఎఫెక్ట్ కూడా జనాలను రాజకీయాలపై ఆసక్తి చూపకుండా దూరం చేసింది. లక్షల మంది ఉద్యోగ, ఉపాధిపై కరోనా ప్రభావం చూపింది. ఇక పైగా ఇది వ్యవసాయ సీజన్. రైతులు, ప్రజలంతా కూడా వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నారు. దీంతో బండి సంజయ్ పాదయాత్రకు జనసాంద్రత ఉన్న చోట మాత్రమే బాగా ఆదరణ లభించింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బండి అభిమానులంతా కదిలి రావడంతో కాసింత మొదట్లో సందడి నెలకొంది.

– రేవంత్ రెడ్డి దూకుడు మైనస్ అయ్యిందా?
రేవంత్ రెడ్డి కూడా బండి సంజయ్ పాదయాత్రను డామినేట్ చేశాడని అంటున్నారు. కేసీఆర్ కు, బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కు హైప్ తెచ్చేలా సభలు, సమావేశాలు పెట్టడం.. మీడియాలో నానడం.. కేటీఆర్ పై ఆరోపణలు.. కాంగ్రెస్ ను సమాయత్తం చేసేలా రేవంత్ రెడ్డి తీసుకున్న చర్యలు కూడా బండి సంజయ్ పాదయాత్రకు మైనస్ గా మారాయి.

-బండి సంజయ్ పాదయాత్ర టైమింగ్ మిస్ అయ్యిందా?
ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా? అన్నదే ముఖ్యం.. ఇప్పుడు ఈ పాలసీ రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుంది. కేసీఆర్ సర్కార్ ఏర్పడి రెండున్నరేళ్లే అవుతోంది. అందులో సంవత్సరన్నరగా కరోనా కల్లోలంతోనే ముగిసిపోయింది. అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రానికి చేయడానికి ఏం లేకుండా పోయింది. లాక్ డౌన్ తో ఆర్థిక సంక్షోభం వచ్చేసింది. కేంద్రంలోని మోడీ సర్కార్, రాష్ట్రప్రభుత్వం ప్రజలకు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయాయి. చేతిలో చిల్లీ గవ్వ లేక ప్రభుత్వాలు, ప్రజలు అగచాట్లు పడుతున్న టైం. ఈ క్రమంలోనే బండి సంజయ్ పాదయాత్ర చేపట్టారు. క్షేత్రస్థాయిలో సెకండ్ వేవ్ పోయి ఇప్పుడిప్పుడే అన్నీ తెరిచేసిన ఈ టైంలో ప్రజలంతా ఉద్యోగ, ఉపాధి వేటలో ఉన్నారు. సో ఈ టైంలో బండి సంజయ్ పాదయాత్రకు కేవలం బీజేపీ కార్యకర్తలు, శ్రేణులు.. స్థానిక ప్రజలు మాత్రమే తోడ్పాటు నందించారు. మిగతా సబ్బండ వర్గాల వారు ఎవరి బిజీలో వారు ఉండిపోవడంతో అంతగా ఆదరణ దక్కడం లేదన్నది రాజకీయ విశ్లేషకుల మాట..

బండి సంజయ్ పాదయాత్ర టైమింగ్ బాగాలేదని విశ్లేషకులు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ లేదంటే ఎన్నికలకు ఏడాది ముందు చూస్తే ఆ వాతావరణం ఉంటుందని.. ప్రజల్లోనూ ఆదరణ ఉంటుందని.. ఇక ఎండాకాలం టైంలోనూ ప్రజలు ఖాళీగా ఉండి ఈ యాత్రకు మద్దతు ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేని వేళ చేసిన పాదయాత్ర బీజేపీకి హైప్ తెచ్చినా అది రెండున్నరేళ్ల వరకూ ప్రభావం ఉండదని అంటున్నారు. అందుకే మీడియాలోనూ అంత ఆదరణ దక్కలేదని చెబుతున్నారు. ఎన్నికలకు ముందు చేస్తేనే ప్రయోజనం అని సూచిస్తున్నారు.