Dharmana Krishna Das: ‘నో డౌట్ చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడే. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మెరుగైన పాలనే అందించారు’..ఇలా వ్యాఖ్యానించింది తెలుగుదేశం పార్టీ నాయకులో, ఆ పార్టీ మిత్రపక్ష నేతలో అంటే పొరబడినట్టే సాక్షాత్ వైసీపీ కీలక నాయకుడు, రాష్ట్ర డిప్యూటీ సీఎం ధర్మాన క్రిష్టదాస్ చేసిన వ్యాఖ్యలివి. శ్రీకాకుళంలో విలేఖర్ల సమావేశంలో యధాలాపంగా చేసిన వ్యాఖ్యలనుకుంటే పొరబడినట్టే.
మంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో ధర్మాన క్రిష్టదాస్ ను తొలగించి ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావుకు పదవి ఇస్తారన్న ప్రచారం అధికార పార్టీలో జోరుగా సాగుతోంది. దీంతో గత కొద్దిరోజులుగా క్రిష్టదాస్ తీవ్ర మనస్తాపంతో ఉన్నట్టు సమాచారం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తరువాత జగన్ వెంట నడిచిన నాయకుల్టో క్రిష్ణదాస్ ముందు వరుసలో ఉంటారు. అప్పటికే సోదరుడు ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఆయనను విభేదించి క్రిష్టదాస్ వైసీపీలోకి వెళ్లిపోయారు. జగన్ కు మద్దతుగా ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశారు. అయితే తనను కాదని వైసీపీలోకి వెళ్లిన సోదరుడు క్రిష్టదాస్ నరసన్నపేట నియోజకవర్గం నుంచి ఎలా గెలుస్తాడో చూస్తానని సవాల్ చేశారు. ఉప ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీచేసిన క్రిష్ణదాస్ పై మరో సోదరుడు రామదాసును ధర్మాన ప్రసాదరావు పోటీలోకి దించారు.
Also Read: KTR Tweet: బెంగుళూరు వదిలి రావాలన్న కేటీఆర్.. చురకలంటించిన కర్ణాటక బీజేపీ
అప్పట్టో ఉన్న సెంటిమెంట్, ప్రజాబలంతో ధర్మాన క్రిష్ణదాస్ విజయం సాధించారు. గమ్మత్తు ఏమిటంటే ఉప ఎన్నికల్లో తలపడిన ఇద్దరు సోదరులు నరసన్నపేట నియోజకవర్గం పరిధిలోని పోలాకి మండలం మబుగాంలో ఉన్న ఒకే ఇంటి నుంచే బయలుదేరేవారు. రెండు పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలకు ఒకే ఇల్లు వేదికగా నిలిచింది. ముక్కున వేలేసుకోవడం ప్రజల వంతైంది. సీన్ కట్ చేస్తే 2014 సాధారణ ఎన్నికల్లో ధర్మాన సోదరులంతా వైసీపీ గొడుగు కిందకు వచ్చారు. ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం అసెంబ్లీ స్థానానికి, క్రిష్ణదాస్ నరసన్నపేట నుంచి పోటీచేశారు. అయితే తామొకటి తలచితే ప్రజలు ఒకటి తలచారు. ఇద్దర్నీ ఓడించారు. 2019 ఎన్నికల్లో మాత్రం ఇద్దరూ గెలిచారు. కానీ జగన్ మాత్రం ధర్మాన క్రిష్ణదాస్ నే మంత్రిగా ఎంపిక చేశారు. అప్పటి నుంచి ధర్మాన ప్రసాదరావు కుతకుత ఉడికిపోతున్నారు. అధినేత తీరుపై అందివచ్చిన వేదికల వద్ద అసంత్రుప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇన్నాళ్లకు ఆయనకు మంత్రి అయ్యే చాన్స్ వస్తుందన్న ప్రచారం సాగుతోంది. డిప్యూటీ సీఎం క్రిష్ణదాస్ అసంత్రుప్తికి ఇదే కారణమవుతోంది.
నరసన్పపేట నియోజకవర్గం నుంచి అతి పిన్న వయసులో ధర్మాన ప్రసాదరావు ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి పదవి చేపట్టారు. జిల్లాపై కూడా పట్టు సాధించారు. కానీ 2004లో తన నియోజకవర్గం నరసన్నపేటను అన్న క్రిష్ణదాస్ కు విడిచిపెట్టారు. తాను మాత్రం రిస్క్ చేసి శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. అక్కడ క్రిష్ణదాస్, ఇక్కడ ధర్మాన ప్రసాదరావు గెలుపొందారు. 2009లో సేమ్ సీన్ రిపీట్. అయితే తన సోదరుడు చేసిన త్యాగానికి క్రిష్ణదాస్ విలువ ఇవ్వలేదు. పైగా ధర్మాన ప్రసాదరావుపై పైచేయి సాధించాలని చూశారు.
వయసుకు చిన్నవాడైనా రాజకీయాల్లో సీనియర్ అయిన ధర్మాన ప్రసాదరావు 2014 ఎన్నికల్లో పరోక్షంగా క్రిష్ణదాస్ కు వ్యతిరేకంగా పనిచేశారన్న ఆరోపణలున్నాయి. తానూ ఓడిపోతానని తెలుసు కనుకే.. తనను విభేదించిన క్రిష్ణదాస్ ను సైతం ఓడించడానికి కంకణం కట్టుకున్నారన్న ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. క్రిష్ణదాస్ కు తత్వం బోధపడింది. 2019 ఎన్నికల్లో మాత్రం అంతా ఐక్యతగా ముందుకు సాగారు. రెండు నియోజకవర్గాల్లో గెలుపు సాధించారు. కానీ మంత్రి వర్గంలోకి క్రిష్ణదాస్ ను మాత్రమే తీసుకోవడంతో ప్రసాదరావు కీనుక వహించారు. పైగా తన పూర్వ నియోజకవర్గం నరసన్నపేట నియోజకవర్గంలో ప్రసాదరావు ఉనికే లేకుండా చేయాలని క్రిష్ణదాస్ కుమారుడు క్రిష్ణ చైతన్య ప్రయత్నించారు. ఇది కుటుంబంలో బహిరంగ చీలికకు కారణమైంది.
దీంతో ప్రసాదరావు నరసన్నపేటపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో నరసన్నపేట నుంచి తాను, శ్రీకాకుళం నుంచి తన కుమారుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు బరిలో దిగేందుకు భారీ స్కెచ్ వేసుకున్నారు. ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణలో కానీ ఒక వేళ అవకాశమొస్తే ఈ ప్రయత్నాలను తాత్కాలికంగా పక్కన పెడతారు. ఒక వేళ ఇవ్వకుండా తన సోదరుడ్ని కొనసాగించినా.. తనకు కాదని..అదే జిల్లాకు చెందిన స్పీకర్ తమ్మినేని సీతారామ్ కు ఇస్తే జిల్లాలో పార్టీని నిర్వీర్యం చేసేందుకు ధర్మాన ప్రసాదరావు ప్రయత్నం చేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Also Read:Congress Protest: కాంగ్రెస్ దండు కదిలింది.. ధరలపై యుద్ధం మొదలైంది
Web Title: Dharmana krishnadas sensational comments
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com