
దిగ్బంధన కారణంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం, మరోవంక ఆర్ధిక కార్యకలాపాలు స్తంభించి పోవడంతో బ్యాంకుల నుండి నగదు ఉపసంహరించుకునే వారీ గాని, జమచేసి వారు పెద్దగా లేకపోవడంతో బ్యాంకింగ్ కార్యకలాపాలు సహితం ఆందోళన కరంగా మారుతున్నాయి. గత పక్షం రోజులలోనే రూ 53 వేల కోట్ల నగదును దేశంలో ఉపసంహరించుకున్నట్లు తెలుస్తున్నది.
దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితులు నెలకొనడంతో బ్యాంక్ ఖాతాదారుల్లో ఆందోళన తీవ్రస్థాయికి చేరడం అందుకు ఒక కారణంగా భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ వచ్చే నెల చివరినాటికి పొడిగించడంతో డబ్బులకు కొరత ఉంటుందన్న భయాలు వారిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
దీంతో ఈ నెల 13తో ముగిసిన తొలి పక్షం రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన నిధుల్లో రూ.53 వేల కోట్ల నిధులను ఉపసంహరించుకున్నారని రిజర్వు బ్యాంక్ తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడంలేదు.
భారతీయులు కరెన్సీ రూపంలోనే అత్యధికంగా లావాదేవీలు జరుపుతున్నారని ఆర్బీఐ నివేదిక స్పష్టంచేసింది. ఈ నెల 13 నాటికి ప్రజల వద్ద రూ.23 లక్షల కోట్ల నగదు నిల్వలు ఉన్నాయని పేర్కొంది. ముందస్తు చర్యల్లో భాగంగా బ్యాంకుల శాఖలు, ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ కష్టమవుతున్నదన్న అంచనాతో అత్యధిక మంది నగదును ఉపసంహరించుకున్నారని యాక్సిస్ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త సుగాటా భట్టచార్య తెలిపారు.