Homeజాతీయ వార్తలుTelangana Opinion Polls: తెలంగాణ విజేతను తేల్చేది ఆ 22 సీట్లే అట.. ఎన్నికలపై మరో...

Telangana Opinion Polls: తెలంగాణ విజేతను తేల్చేది ఆ 22 సీట్లే అట.. ఎన్నికలపై మరో సర్వే.. !

Telangana Opinion Polls: తెలంగాణలో ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు హోరాహోరీగా సిద్ధమవుతున్నాయి. ప్రత్యర్ధుల కంటే అన్ని విషయాల్లోనూ ముందుండేందుకు ఆయా పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్నికల బరిలో చాలా పార్టీలే ఉన్నా ప్రధాన పోరు మాత్రం అధికార బీఆర్‌ఎస్, విపక్ష కాంగ్రెస్‌ మధ్యే నెలకొంది. అందులోనూ ఈ రెండు పార్టీల్లో విజేత ఎవరన్నది అంత సులువుగా తేలిపోయే పరిస్ధితి కూడా కనిపించడం లేదు. సర్వే సంస్థలకు కూడా ప్రజల నాడి చిక్కడం లేదు. అంచనాలు నిజమవుతాయన్న ధీమా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా మరో సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి.

డెమోక్రసీ టైమ్స్‌ నెట్‌ వర్క్‌ సర్వే..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలపై డెమోక్రసీ టైమ్స్‌ నెట్‌ వర్క్‌ అనే సంస్ధ నిర్వహించిన తాజా సర్వేలో రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత హోరాహోరీ పోరు నెలకొందో స్పష్టమైంది. ముఖ్యంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్య సాధించే సీట్ల తేడా కూడా అత్యంత స్వల్పంగా ఉండటంతోపాటు హోరాహోరీ పోరు నెలకొన్న స్ధానాల విషయంలోనూ ఈ సర్వే చాలా మేరకు క్లారిటీ ఇచ్చేసింది. దీంతో ఇప్పటివరకూ వెలువడిన సర్వేలన్నీ ఓ ఎత్తు ఈ సర్వే ఓ ఎత్తు అన్నట్లుగా కనిపిస్తోంది.

ఎవరికెన్ని సీట్లంటే..
డెమోక్రసీ టైమ్స్‌ నెట్‌ వర్క్‌ సర్వేలో ఈసారి తెలంగాణలోని 119 అసెంబ్లీ సీట్లలో అధికార బీఆర్‌ఎస్‌ అత్యధికంగా 45 సీట్లలో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తుండగా.. విపక్ష కాంగ్రెస్‌ కూడా 42 సీట్లలో ఆధిక్యం ప్రదర్శించబోతున్నట్లు తేలిపోయింది. ఇక బీజేపీ కేవలం 4 సీట్లలోనూ, ఎంఐఎం ఆరు సీట్లలోనూ ఆధిక్యంలో ఉన్నట్లు తాజా సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

ఆ 22 సీట్లు కీలకం..
ఇవన్నీ ఓ ఎత్తయితే మిగిలిన 22 సీట్లలో అత్యంత తీవ్రమైన పోటీ నెలకొన్నట్లు ఈ సర్వే తెలిపింది. ఈ సీట్లలో మెజారిటీ ఎవరు సాధిస్తే వారిదే అధికారమని డెమోక్రసీ టైమ్స్‌ నెట్‌ వర్క్‌ సర్వే స్పష్టం చేసింది. ఈ సర్వే ప్రకారం ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా చూస్తే.. ఆదిలాబాద్‌ లో 10 సీట్లుండగా.. బీఆర్‌ఎస్‌ 4, కాంగ్రెస్‌ 2 సీట్లు గెల్చుకుంటాయి. మరో 2 సీట్లలో గట్టి పోటీ ఉంది. నిజామాబాద్‌లో 6 సీట్లు ఉండగా.. ఇందులో బీఆర్‌ఎస్‌ 6, కాంగ్రెస్‌ 1 సీటు గెల్చుకుంటాయి. మరో 2 సీట్లలో గట్టి పోటీ ఉంది. మెదక్‌లో 10 సీట్లుంటే అందులో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ చెరో నాలుగు సీట్లు గెల్చుకుంటాయి. మరో రెండు సీట్లలో తీవ్ర పోటీ ఉంది. కరీంనగర్‌ జిల్లాలో 13 సీట్లుంటే అందులో బీఆర్‌ఎస్‌ 4, కాంగ్రెస్‌ 5, బీజేపీ ఓ సీటు గెల్చుకుంటాయి. మరో 3 సీట్లలో గట్టి పోటీ నెలకొంది. అలాగే రంగారెడ్డి జిల్లాలో 14 సీట్లుంటే బీఆర్‌ఎస్‌ 7, కాంగ్రెస్‌ 4 సీట్లు గెల్చుకుంటాయి. మరో 3 సీట్లలో గట్టి పోటీ నెలకొంది. హైదరాబాద్‌ జిల్లాలో 15 సీట్లుంటే బీఆర్‌ఎస్‌ 6, బీజేపీ 1, ఎంఐఎం ఆరు సీట్లు గెల్చుకుంటున్నాయి. మరో 2 సీట్లలో గట్టి పోటీ ఉంది. మహబూబ్‌ నగర్‌ జిల్లాలో 14 సీట్లుంటే బీఆర్‌ఎస్‌ 8, కాంగ్రెస్‌ 5, మరో సీటులో గట్టి పోటీ ఉంది. నల్గొండలో 12 సీట్లుంటే కాంగ్రెస్‌ 9 సీట్లు గెలవబోతోంది. మరో 3 సీట్లలో పోటీ నెలకొంది. వరంగల్‌ లో 12 సీట్లు ఉండగా బీఆర్‌ఎస్‌ 6, కాంగ్రెస్‌ 4 సీట్లు గెల్చుకునే అవకాశం ఉంది. మరో 2 సీట్లో గట్టి పోటీ ఉంది. ఇక ఖమ్మం జిల్లాలో 10 సీట్లుంటే కాంగ్రెస్‌ 8 సీట్లు గెలవబోతోంది. 2 సీట్లలో గట్టి పోటీ ఉందని తేలింది.

మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 22 సీట్ల మధ్యనే గట్టి పోటీ ఉంది. ఈ సీట్లు బీఆర్‌ఎస్‌కు ఎక్కువ వస్తే మళ్లీ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్‌కు అధికంగా వస్తే కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని సర్వే సంస్థ తేల్చింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version