Delhi Ordinance Bill: ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్ర సర్కారు మే 19న ఇచ్చిన ఆర్డినెన్స్‌పై దేశవ్యాప్తంగా వాడీవేడి చర్చ జరుగుతోంది. అది నిరంకుశ ఆర్డినెన్స్ అని బీజేపీ వ్యతిరేక కూటమిలోని పార్టీలు గొంతు చించుకుంటున్నాయి. ఈ విషయంలో రాజకీయ వైరుధ్యాలను పక్కకు పెట్టి ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్‌కు మద్దతును ప్రకటిస్తున్నాయి. ఆ ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లు.. లోక్ సభ , రాజ్యసభ రెండూ ఆమోదిస్తేనే చట్టంగా మారుతుంది. అయితే దాన్ని రాజ్యసభలో ఓడిస్తామని విపక్ష ఇండియా కూటమి ప్రకటించింది. ఇందుకోసం బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి వచ్చాయి. రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 110 మంది ఎంపీలే ఉన్నారు. కాంగ్రెస్‌సహా అన్ని విపక్ష పార్టీలు కలుపుకుని 128 మంది ఎంపీలు ఉన్నారు. దేశంలోని విపక్షాలన్నీ ఏకమై ఆ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఓటువేసి ఓడిస్తే.. 2024 ఎన్నికలకు ముందు ఇదే సెమీ ఫైనల్ అవుతుందని ఇండియా కూటమి భావిస్తోంది.
ఆర్డినెన్స్‌లో ఏముంది ?
ఢిల్లీలో పాలనాధికారం అసెంబ్లీకే ఉంటుందని.. అధికారుల బదిలీలు, నియామకాల్లోనూ దానిదే తుది నిర్ణయమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మే 11న తీర్పు ఇచ్చింది. దీన్ని పక్కన పెడుతూ మే 19న కేంద్రం కొత్త ఆర్డినెన్స్ తెచ్చింది. నగర పాలనపై అసాధారణ అధికారాలను లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లో పెడుతూ ఆర్డినెన్స్ జారీచేసింది. ఢిల్లీలో గ్రూప్–ఏ అధికారుల పోస్టింగ్, బదిలీలపై ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను తొలగిస్తూ.. దాని స్థానంలో కొత్తగా నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఫలితంగా ఢిల్లీలోని అధికారుల పోస్టింగ్, బదిలీలతోపాటు విజిలెన్స్ అధికారాలు ఎల్జీ చేతిలోకి వెళ్లాయి. నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీకి చైర్మన్‌గా ఢిల్లీ సీఎం ఉంటారు. మెంబర్లుగా సీఎస్, హోంశాఖ కార్యదర్శి ఉంటారు. ఢిల్లీలో ఏ అధికారిని బదిలీ చేయాలన్నా, పోస్టింగ్ ఇవ్వాలన్నా ఈ ముగ్గురు సమావేశమై, ఓటింగ్ నిర్వహించి ఎల్జీకి నివేదించాలి. మెజారిటీ ప్రతిపాదికన నిర్ణయం తీసుకుంటారు. ఎప్పుడైనా ఓటింగ్ లో ఫలితం తేలకుంటే.. లెఫ్టినెంట్ గవర్నర్‌దే తుది నిర్ణయంగా ఉంటుంది. నగరంలోని పోలీస్ వ్యవస్థ మొత్తం ఇప్పటికే ఎల్జీ చేతిలో ఉంది. దేశ రాజధానిలో శాంతిభద్రతల బాధ్యత మొత్తం ఎల్జీదే. సివిల్ అధికారులపై ఢిల్లీ ప్రభుత్వానికి అజమాయిషీ ఉండేది. తాజా ఆర్డినెన్స్‌తో ఆ అధికారాలు కూడా లేకుండా పోయాయి.
2015 నుంచే పవర్ వార్..
ఢిల్లీలో ఎవరి అధికారాలు ఏంటన్న దానిపై 2015 నుంచే వివాదం నడుస్తోంది. కేంద్రంలో మోదీ సర్కార్ రాగానే.. ఢిల్లీ పాలనాధికారాలను మొత్తం ఎల్జీ చేతిలో పెట్టింది. అప్పుడే కొత్తగా ఏర్పడిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వాన్ని డమ్మీని చేసేందుకే కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలు వినిపించాయి. కేంద్రం నిర్ణయంపై కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు వెళ్లటంతో.. కేంద్రం నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. దీంతో కేజ్రీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఈ వివాదాన్ని విచారించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం.. ఎల్జీ, ఎన్నికైన ప్రభుత్వం మధ్య స్పష్టమైన అధికారాల విభజనను సూచిస్తూ ఈ నెల 11న తీర్పు ఇచ్చింది. ఢిల్లీ నగరంలో శాంతిభద్రతల బాధ్యత మాత్రమే ఎల్జీదని, ఇతర శాసన, కార్యనిర్వాహక బాధ్యతలు అసెంబ్లీకే చెందుతాయని తీర్పు ఇచ్చింది.
సుప్రీం తీర్పును కాదని..
అయితే సుప్రీం తీర్పు వచ్చి వారం గడవక ముందే ఆ తీర్పును కాదని కేంద్రం కొత్త ఆర్డినెన్స్ తెచ్చింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా నగరంలో అధికారాల సమతుల్యత కోసమే ఈ ఆర్డినెన్స్ తెచ్చామని కేంద్రం వాదిస్తోంది. కానీ ఆప్ ప్రభుత్వం మాత్రం ఇది రాజ్యాంగ విరుద్ధ నిర్ణయం అంటోంది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని పేర్కొంటోంది.
ప్రజాస్వామ్య ప్రభుత్వంలో జోక్యమే అంటున్న విపక్షాలు..
రాజ్యాంగం ప్రకారం.. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలే పాలన సాగించాలి. కానీ ఢిల్లీ విషయంలో మాత్రం కేంద్రం ఆ అవకాశం లేకుండా చేస్తోందని విపక్ష ఇండియా కూటమి నేతలు అంటున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల పాలనలో కేంద్రం జోక్యం చేసుకుంటోందని, అవసరమైతే కూలుస్తోందని ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు అధికారాలు కూడా కోత పెడితే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదని విపక్షాల వాదనం. ఈ నేపథ్యంలో బిల్లును ఎలాగైనా అడ్డుకోవాలని పట్టుదలతో ఇండియా కూటమి ఉంది.
బిల్లు పెట్టిన అమిత్‌షా..
ఈ వివాదం కొనసాగుతుండగానే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆర్డినెన్స్ బిల్లును మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. విపక్షాల వ్యతిరేక నినాదాల మధ్యనే బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం సభ వాయిదా పడింది. అయితే లోక్‌సభలో సంఖ్యాబలం ఉన్నందున బిల్లు పాస్ అవుతుందని, రాజ్యసభలో ఎన్డీఏ కంటే.. ఇండియా కూటమి సభ్యులే ఎక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పెద్దల సభలో బిల్లు పాస్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. దీంతో దీనిని కేంద్రం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు అనిపిస్తోంది. ఎలాగైనా పాస్ చేయించాలని కేంద్రం, అడ్డుకోవాలని ఇండియా కూటమి పట్టుమీద ఉన్నాయి.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Delhi ordinance bill why opposition opposes it
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com