Delhi Liquor Scam- MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అద్భుతం జరిగితే తప్ప కవిత బయటపడేది అసాధ్యం. నిన్న మొన్నటి దాకా చార్జిషీట్లో ఆమె పేరు లేకపోవడంతో టిఆర్ఎస్ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ అరోరా ను అరెస్టు చేసిన తర్వాత ఈ డి మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. చార్జిషీట్లో ఆమె పేరు ప్రస్తావించింది. దీంతో రేపో మాపో ఆమెకు నోటీసులు వచ్చే అవకాశం ఉంది. ఒకసారి ఈడి నోటీసులు పంపిందంటే… వేధిస్తూనే ఉంటుంది.. బహుశా కవితను కూడా అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే కవిత ఈ స్థాయిలో కేసులో కూరుకుపోవడం వెనుక అభిషేక రావు హస్తం ఉన్నట్టు తెలుస్తోంది.

ఎవరు ఈ అభిషేక్ రావు
అభిషేక్ రావు వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈయన తెలుగునాట బాగా ప్రాచుర్యం పొందిన అనూస్ బ్యూటీ పార్లర్ వ్యవస్థాపకుడు. అప్పట్లో ఈ బ్యూటీ పార్లర్ కు కవిత వచ్చేది. అలా పరిచయం పెంచుకున్న అభిషేక్ తర్వాత ఆమెకు వ్యక్తిగత సహాయకుడు అయ్యాడు.. సొంత సామాజిక వర్గం కావడంతో కవిత కూడా అతడిని చేరదీసింది.. కవిత భర్త అనిల్ కి కూడా సన్నిహితుడిగా మారిపోవడంతో అభిషేక్ రావు కవిత కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా మారిపోయాడు. దీంతో అప్పటిదాకా కవితనే అంటి పెట్టుకున్న వారు దూరమయ్యారు. ఈ క్రమంలోనే కవిత నిజామాబాద్ ఎంపీగా ఓడిపోవడంతో తీవ్రమైన నైరాశ్యంలో కూరుకుపోయారు. అయితే కవితకు ఉన్న పలుకుబడిని చూసి అభిషేక్ రావు కొత్త ఎత్తులు రచించారు.
సౌత్ గ్రూప్ కు ఇలా మళ్ళించారు
ఎమ్మెల్సీ అయిన తర్వాత కవిత కు ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం గురించి అభిషేక్ రావు చెప్పారు. మొదట్లో ఈ విషయాన్ని ఆమె అంతగా పట్టించుకోలేదు.. శరత్ చంద్ర రెడ్డి, శ్రవణ్ రెడ్డి లను పరిచయం చేసిన తర్వాత కవిత మనసు మార్చుకున్నారు. ఈలోగా సౌత్ గ్రూపునకు చెందిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి గురించి కవితకు చెప్పారు.. దీంతో ఆమె లిక్కర్ లావాదేవీల్లో పాలుపంచుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం..ఇదే సమయంలో ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఇందులో ఇన్వాల్వ్ కావటం, మనీష్ సిసోడియాకు నేరుగా సంబంధాలు ఉండడంతో… కవిత అండ్ కో పని సులభం అయిపోయింది.

లెఫ్టినెంట్ గవర్నర్ ఫిర్యాదుతో..
ఇక్కడిదాకా కథ బాగానే నడిచింది. ఈ వ్యవహారం నడిపేందుకు ప్రముఖులంతా తమ ఫోన్లు మార్చి మార్చి వాడారు. ఆధారాలు దొరకకుండా ఉండేందుకు వాటిని ధ్వంసం చేశారు.. కవిత కూడా సుమారు పది ఫోన్ల దాకా మార్చారు. కానీ ఎప్పుడైతే ఈ మద్యం వ్యవహారంపై అనుమానం కలిగిందో అప్పుడే లెఫ్టినెంట్ గవర్నర్ దీనిపై విచారణకు ఆదేశించారు. పనిలో పనిగా కేంద్ర హోంశాఖ కు కూడా సమాచారం ఇచ్చారు. ఎప్పుడైతే దీనిపై హోంశాఖ తీగలాగడం మొదలుపెట్టిందో.. అప్పుడే డొంకంతా కదలడం మొదలైంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియా, అరోరా, అభిషేక్ రావు, శరత్ చంద్ర రెడ్డి, శ్రవణ్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి… ఇంకా చాలామంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే కవిత అభిషేక్ రావును గుడ్డిగా నమ్మే లిక్కర్ స్కాంలో ఇరుక్కున్నారని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి.. ప్రస్తుతం కవిత పేరు చార్జ్ షీట్ లో నమోదు చేసిన నేపథ్యంలో.. రేపో, మాపో నోటీసులు ఇచ్చి.. త్వరలో అరెస్ట్ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.