Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం: ఆప్ నేతలకు ఇచ్చిన 100 కోట్ల ముడుపుల్లో నా పాత్ర ఉంది

మనీష్ సిసోడియా (ఢిల్లీ ఉపముఖ్యమంత్రి), ఇతర ఆప్ నేతలకు ఇచ్చిన 100 కోట్ల ముడుపులో తన పాత్ర కూడా ఉందని 2023 ఏప్రిల్ 25న శరత్ చంద్రా రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు.

Written By: Dharma, Updated On : September 25, 2023 11:54 am
Follow us on

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. నిన్న ఆదివారం సాయంత్రం నుంచి బ్రేకింగ్ న్యూస్ గా మారింది. తెలుగులో ఒక్క ఆంధ్రజ్యోతి మినహా మిగతా పింక్ మీడియా అసలు పట్టించుకోవడం లేదు. ఈనాడు అసలు ఈ లిక్కర్ స్కాం గురించి ఒక్క వార్త కూడా రాయడం లేదు. అయితే ఢిల్లీ వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవితతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ చుట్టూ గట్టిగా ఉచ్చు బిగిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించి తదుపరి అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

శరత్ చంద్రా రెడ్డి ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే..

మనీష్ సిసోడియా (ఢిల్లీ ఉపముఖ్యమంత్రి), ఇతర ఆప్ నేతలకు ఇచ్చిన 100 కోట్ల ముడుపులో తన పాత్ర కూడా ఉందని 2023 ఏప్రిల్ 25న శరత్ చంద్రా రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ” 2021 మార్చిలో అరుణ్ రామచంద్ర నాతో మాట్లాడారు. విజయ్ నాయక్ ద్వారా అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా.. కవితను సంప్రదించారు..కవిత ఆప్ కు కొంత డబ్బు ఇస్తే రానున్న కొత్త ఎక్సైజ్ విధానంలో ఆమెకు అనుకూలంగా నిర్ణయం తీసుకోగలమని చెప్పారు. ఈ చర్చల గురించి అరుణ్ చెప్పిన తర్వాత నేను కవితను కలిశాను. తన టీం ఇప్పటికే ఢిల్లీలో విజయ్ నాయక్ ను సంప్రదిస్తోందని, ఈ వ్యాపారం లాభసాటి అవునో, కాదో నిర్ణయిస్తోందని ఆమె చెప్పారు. ఆమె టీం లో అరుణ్ రామచంద్ర, అభిషేక్ బోయినపల్లి, బాబు ఉన్నారు. కేజ్రీవాల్, సిసోడియా తరఫున అన్న విషయాలు విజయ్ నాయర్ చూస్తున్నారని చెప్పారు. దీంతో నా వ్యాపారాన్ని విస్తరించి కవితతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయం మాగుంట శ్రీనివాసులు రెడ్డితో కూడా మాట్లాడానని, ఆయన కూడా తమతో కలిసి పనిచేస్తారని కవిత చెప్పారు. కేజ్రీవాల్ టీం తో మాట్లాడిన తర్వాత 100 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అందులో నా భాగం కూడా ఇస్తానని, అయితే ప్రస్తుతం డబ్బులు లేనందువల్ల మద్యం వ్యాపారం ప్రారంభం కాగానే ఇస్తానని చెప్పాను” అని శరత్ చంద్రా రెడ్డి వెల్లడించారు.

శ్రీనివాసులు రెడ్డి ఏమన్నారంటే..

2023 జూలై 17న మాగుంట శ్రీనివాసులు రెడ్డి సి ఆర్ పి సి 164 కింద ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం 100 కోట్ల ముడుపులో తమ వాటా కింద 25 కోట్లను తన కుమారుడు రాఘవ.. బుచ్చిబాబు.. అభిషేక్ బోయినపల్లి చెల్లించారు. ఈ విషయం రాఘవ కూడా తన వాంగ్మూలంలో అంగీకరించారు. “కల్వకుంట్ల కవితతో నన్ను మాట్లాడమని అరవింద్ చెప్పారు. లేదా ఆమే నాతో మాట్లాడతారని చెప్పారు. మీరిద్దరూ కలిసి పని చేయవచ్చన్నారు. అన్ని వివరాలూ కవిత చూసుకుంటారు. ఆమె తన టీంతో కలిసి మద్యం విధానం గురించి పనిచేస్తున్నారు. కవిత టీం తో విజయ్ నాయర్ కలిసి పనిచేస్తున్నారు.” అని మాగుంట ఇదే వాంగ్మూలంలో వివరించారు. కాగా వీరిచ్చిన ఆధారాల ప్రకారం ఈడీ కీలకమైన సమాచారం సేకరించింది. దాని ఆధారంగానే తదుపరి చర్యలకు సమాయత్తం అవుతున్నది.