అవినీతి ఆరోపణల కేసులో బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఈడి విచారణ ఎదుర్కొంటున్నారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆల్రెడీ జైల్లో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జైల్లో ఉన్నారు. కానీ ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత మాత్రం అసలు విచారణకు హాజరు కావడం లేదు. ఈ మాట అంటున్నది ఎవరో కాదు సాక్షాత్తు కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. గతంలో ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఆమెను ఈడి అధికారులు విచారించారు. ఆమె ఈ సందర్భంగా కొన్ని సెల్ ఫోన్లు వారికి అందించారు. అప్పట్లో ఆమె అరెస్టు కూడా జరుగుతుందని వార్తలు వినిపించాయి. తర్వాత ఒక్కసారిగా ఈ కేసులో ఈ డి సైలెంట్ అయిపోయింది. అంతేకాదు తనను విచారించే సమయంలో సి ర్ పి సి నిబంధనలు పాటించడం లేదని కవిత ఆరోపించారు.. నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులను ప్రస్తావిస్తూ ఆమె సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు కవితను నవంబర్ వరకు విచారించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈలోగా ఎన్నికలు రావడంతో ఈడి పెద్దగా ఈ కేసు పై దృష్టి సారించలేదు.. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేయడంతో.. ఈ కేసును ఈడి మరోసారి తవ్వడం మొదలు పెట్టింది.
ఢిల్లీ మద్యం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను సోమవారం సుప్రీంకోర్టు విచారించింది. తదుపరి విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. మహిళలను విచారించే సమయంలో సి ఆర్ పి సి నిబంధనలను పాటించడం లేదని కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సమయంలో తనను ఇబ్బంది పెట్టకుండా ఈడికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే కేసుకు సంబంధించి విచారణ గత కొద్ది నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. ఇక కవిత దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిఠల్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈడీ అధికారులు విచారణ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. కవిత సరిగా స్పందించడం లేదని ఈడి అధికారుల తరపు న్యాయవాది ఏఎస్జీ ఎస్వీ రాజు పేర్కొన్నారు. అయితే కేవలం ఈడి దాఖలు చేసిన సమన్లనే కవిత సవాల్ చేసిన నేపథ్యంలో దీనిపై విచారణ జరగాల్సిన అవసరం లేదని ఆమె తరపు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టు ఎదుట పేర్కొన్నారు. అంతేకాదు ఆ సమయంలో తదుపరి విచారణ వరకు కవితను పిలవబోమని ఈడి చెప్పిందని కపిల్ సిబల్ కోర్టుకు గుర్తు చేశారు. ఈ సమయంలో ఏఎస్జీ ఎస్వీ రాజు కల్పించుకొని తదుపరి విచారణ తేదీ అంటే మొత్తానికి పిలవబోమని కాదని చురకలాంటించారు. మొత్తానికి ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును ఫిబ్రవరి 16 కు వాయిదా వేసింది.
గత ఏడాది మార్చిలో ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవితను ఈడి అధికారులు విచారించారు.. ఈ సందర్భంగా ఆమె కొన్ని సెల్ ఫోన్లను వారికి ఇచ్చారు. తాను ఒక మహిళనని.. ఈడి కార్యాలయంలో కాకుండా ఇంట్లో విచారించాలని కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ విచారణకు రాకముందే ఈడి అధికారులు సెప్టెంబర్ లో ఆమెకు ఒక నోటీస్ జారీ చేశారు. దీంతో ఆమె మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కేసును విచారించిన ధర్మాసనం కవితను నవంబర్ వరకు విచారించకూడదని ఈడి అధికారులకు స్పష్టం చేసింది. ఈలోగానే ఎన్నికలు రావడంతో ఈ కేసు ఒకసారిగా సైలెంట్ అయిపోయింది. ఎన్నికల హడావిడి ముగిసిన అనంతరం ఈ కేసులో కదలిక వచ్చింది. ఫిబ్రవరి 16న సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందోననే ఆసక్తి సర్వత్రా ఉంది. మరోవైపు ఈ కేసులో దోషులను నిర్ధారించేందుకు ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందనే విమర్శలూ లేకపోలేదు.