Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొద్ది రోజులపాటు స్తబ్దుగా ఉన్న ఈ కేసులో అనూహ్య కదలిక చోటుచేసుకుంది. ఢిల్లీ వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం ఏదైనా జరగవచ్చని తెలుస్తోంది.. అయితే ఈ కేసులో అప్రూవర్ల వాంగ్మూలంతోనే ఈడీ ముందడుగు వేసిందని తెలుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అప్రూవర్లుగా మారిన శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ, దినేష్ ఆరోరా అనేక కీలక అంశాలను దర్యాప్తు సంస్థలకు వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ నుంచి నగదు తరలింపు పై శరత్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ దర్యాప్తు సంస్థలకు వివరాలు సమర్పించారు. లిక్కర్ వ్యాపారం గురించి కవితతో మాట్లాడాలని, కలిసి పనిచేయాలని కేజ్రీవాలే తమకు సూచించారని శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి వెల్లడించినట్టు తెలుస్తోంది. మరోవైపు మద్యం కుంభకోణంలో కవితతో సన్నిహిత సంబంధాలు ఉన్న అరుణ్ రామచంద్ర తాను కవిత బినామీనని కనీసం మూడుసార్లు దర్యాప్తు సంస్థల వద్ద చెప్పారు. మద్యం వ్యాపారం గురించి కవితతో కలిసి, ఆమె తరఫున పలు సమావేశాల్లో పాల్గొన్నానని వెల్లడించినట్టు తెలుస్తోంది. అరుణ్ రామచంద్ర జరిపిన నగదు లావాదేవీలు, భూముల కొనుగోళ్లలో కవిత పాత్ర పై నిఘా సంస్థలు లోతుగా దర్యాప్తు జరిపినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీల సమాచారం రాబట్టేందుకు కవిత ఆడిటర్ బుచ్చిబాబును ప్రశ్నించింది. కవితకు, శ్రీనివాసులు రెడ్డికి తాము బినామీలుగా వ్యవహరించామని అరుణ్ రామచంద్ర, ప్రేమ్ రాహుల్ ఈడి ఎదుట అంగీకరించారు. వీరే కాకుండా పి ఎం ఎల్ ఏ సెక్షన్ 50 కింద దాదాపు 16 మంది నిందితులు వాంగ్మూలాలు ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఢిల్లీ మద్యం హోల్ సేల్ వ్యాపారంలో కమీషన్ ను ఐదు శాతం నుంచి 12 శాతానికి పెంచడంతోపాటు ఇండో స్పిరిట్ లో కవిత భాగస్వామిగా ఉన్న సౌత్ గ్రూప్ 65% వాటా పొందినట్టు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. మద్యం వ్యాపారంలో లబ్ధికోసం 100 కోట్లు చెల్లించి, తిరిగి ఆ 100 కోట్లను రాబట్టుకోవడంతోపాటు లాభాలు పొందేలా కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శరత్ చంద్రారెడ్డి కుట్రకు పాల్పడినట్లు ఈడి ఆరోపిస్తోంది. రిటైల్ వ్యాపారంలో నష్టపోయినప్పటికీ హోల్ సేల్ వ్యాపారంలో శరత్ చంద్రారెడ్డి, మా గుంట శ్రీనివాసులు రెడ్డి 192 కోట్ల వరకు లాభాలు ఆర్జించినట్టు ఆరోపణలు ఉన్నాయి.. ఇందులో అరుణ్ రామచంద్ర 33 కోట్లు, శరత్ చంద్రారెడ్డికి 64.5 కోట్లు అందాయి. తనకు లభించిన మొత్తంలో శరత్ చంద్రారెడ్డి డమ్మీ సేల్స్ చూపించి 41 కోట్ల బ్లాక్ మనీని వైట్ మనీ గా మార్చారని సమాచారం. కవితకు ఆడిటర్ గా వ్యవహరించిన బుచ్చిబాబును మాజీ ఆడిటర్ గా ప్రచారం చేశారని, ఈ విషయంలో కవిత తమను తప్పుదోవ పట్టించినప్పటికీ ఆమె ఆడిటర్ గానే అతడిని కనీసం 50 సార్లు పిలిచి ప్రశ్నించి సమాచారం రాబట్టామని ఈడి వర్గాలు చెబుతున్నాయి. సౌత్ గ్రూపులో మెజారిటీ సభ్యులు అప్రూవర్లు గా మారినా.. బుచ్చిబాబు అప్రూవర్ గా మారలేదని ఈడి వర్గాలు అంటున్నాయి. మరోవైపు బుచ్చిబాబుని సీబీఐ కేసులో నిందితుడిగా, ఈడీ కేసులో సాక్షిగా కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రకటించడం విశేషం. ప్రస్తుతం సౌత్ గ్రూప్ లో కీలకంగా ఉన్నవారు పలు ఆధారాలు ఇవ్వడం వల్లనే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ కేసులో ముందడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది.