
ప్రతిపక్ష పార్టీ నేత చంద్రబాబుకు పార్టీని కాపాడుకోవాడమే ఇప్పుడు పెద్ద పరీక్షగా మారింది. కరోనా కారణంగా క్రియాశీలక రాజకీయాల్లో వీడియో కాన్ఫరెన్స్ లకే పరిమితమయిన ఆయన తన పార్టీ నేతలు అధికార పార్టీలో చేరుతున్న సమయంలో అడ్డుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా అవి పెద్దగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. మరోవైపు టీడీపీ నుంచి బయటకు వెళ్లి వైసీపీలో చేరిన నాయకులు మాత్రం చంద్రబాబునే టార్గెట్ చేయడం ఆయనకు మరో సమస్యగా పరిణమించింది. నేరుగా బాబును లక్ష్యంగా చేసుకుని అటు అసెంబ్లీలో, బయట తీవ్ర స్థాయిలో విమర్శలకు ఈ నేతలు దిగుతున్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్, వల్లభనేని వంశీ, కరణం బలరాం తదితరులు ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.
వలసలను టార్గెట్ చేసి రెండు రోజులుగా చంద్రబాబు చాలా హడావిడి చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హాయంలో వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలను పార్టీ కండువా కప్పి తన పార్టీ లో చేర్చుకున్నారు. ఒక్కరు ఇద్దరు కాదు ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను గాలం వేసి టీడీపీలోకి తీసుకున్నారు. అంతటితో ఆగకుండా వారిలో నలుగిరికి మంత్రి పదవులు ఇచ్చి శాసన సభ వేదికగా ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడిచారు. అప్పట్లో ఈ అంశంపై శాసనసభలో వైసీపీ ప్రస్తావించేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో ఆ పార్టీ అసెంబ్లీ సమావేశాలను సైతం బహిష్కరించింది.
టీడీపీ నేతలు పార్టీని వీడుతున్న విషయంలో చంద్రబాబు మేకపోతు గాంభీర్యం ప్రదార్శిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒక్కరు పార్టీని వీడితే 100 మంది నాయకులను తయారు చేస్తానని చెబుతున్న ఇదే విషయంపై పదే పదే మాట్లాడటం, ప్రజలకు లేఖలు రాయడం వంటి చర్యలు ఆయన ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా పార్టీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉన్న నేతగా శిద్దా టీడీపీని వీడటం ఆ పార్టీకి గట్టి ఎదురు దెబ్బగా చెప్పొచ్చు.
మరోవైపు రాష్ట్రంలో వైసీపీని లేకుండా చేయాలని, టీడీపీనే శాశ్వతంగా అధికారంలో ఉండేలా చేయాలని బాబు నిర్వహించిన ఆపరేషన్ ఆకర్ష్ వల్ల రాష్ట్రంలో వైసీపీ కంటే టీడీపీనే ఎక్కువగా నష్టపోయిందనే విషయం గత ఎన్నికల్లో స్పష్టమయింది. ఫిరాయింపుల నేతలు ఎవ్వరూ గత ఎన్నికల్లో విజయం సాదించలేదు. చివరికి మంత్రులుగా పని చేసిన వారు సైతం ఓటమి చవిచూశారు. ఫిరాయింపుల నేతలకు రాజకీయంగా రాణించలేదంటున్న చంద్రబాబు ఒక్క విషయాన్ని గ్రహించలేకపోతున్నారు… అదేంటంటే ‘ఫిరాయింపులకు ప్రోత్సహించిన పార్టీకి ప్రజలు మద్దతు ఇవ్వరనే అంశం’.