Chandrababu- Lokesh: చంద్రబాబు, లోకేష్ ల మధ్య తీవ్ర విభేదాలు నిజమేనా?

లోకేష్ పాదయాత్రకు గుంటూరు, విజయవాడ ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. పార్టీ ఎంపీలు అయ్యి ఉండి కూడా పాదయాత్రకు దూరంగా ఉన్నారు.

Written By: Dharma, Updated On : August 29, 2023 12:24 pm

Chandrababu- Lokesh

Follow us on

Chandrababu- Lokesh: తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు, లోకేష్ మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా? ఒకరి విధానాలు మరొకరికి నచ్చడం లేదా? పార్టీలో ఇద్దరికి వేర్వేరు వర్గాలు ఉన్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ప్రస్తుతం టిడిపిలో చంద్రబాబు వర్గం, లోకేష్ వర్గం ఉన్నట్టు కామెంట్స్ వినిపిస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీలో కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువ. చంద్రబాబు కమ్మ నాయకులను ప్రోత్సహిస్తూ వచ్చారు. పొలిట్ బ్యూరో, పార్టీ కార్యవర్గాల్లో అన్ని సామాజిక వర్గాలకు పెద్దపీట వేసినా.. అంతర్గతంగా మాత్రం చంద్రబాబు చుట్టూ కమ్మ కోటరి ఉంటుంది. ఇప్పుడు ఆ కోటరిలో ఉన్న నాయకులే చంద్రబాబు, లోకేష్ వర్గాలుగా మారి విభేదించుకుంటున్నారు. కొందరు నాయకులు తండ్రి చుట్టూ వెళుతుండగా.. మరికొందరు నాయకులు కుమారుడికి రక్షణ వలయంగా మారిపోయారు. చంద్రబాబుతో సౌకర్యం ఉండే నాయకులు ఆయనతోనే గడుపుతున్నారు.. లోకేష్ తో అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు. దీంతో తండ్రీ కొడుకుల మధ్య విభేదాలకు కారణమవుతున్నారు.

లోకేష్ పాదయాత్రకు గుంటూరు, విజయవాడ ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. పార్టీ ఎంపీలు అయ్యి ఉండి కూడా పాదయాత్రకు దూరంగా ఉన్నారు. అదే ఎంపీలు నిన్న చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో మాత్రం హుషారుగా కనిపించారు. విమానాశ్రయంలో చంద్రబాబును ఆహ్వానించడం మొదలు.. రోజంతా ఆయన వెంటే ఉన్నారు. దీంతో చంద్రబాబు, లోకేష్ ల మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా? అని ఎక్కువమంది ఆరా తీశారు.అయితే ఈ విషయంలో లోకేష్ అనుచరులు తెగ బాధపడి పోతున్నారట.తమ నాయకుడు పాదయాత్ర చేస్తుంటే కనీసం ముఖం చూడని నేతలు… చంద్రబాబు ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారని లోకేష్ కోటరీ నాయకులు విమర్శలకు దిగుతున్నారు.

ప్రస్తుతం లోకేష్ అనుచరులుగా రాష్ట్రవ్యాప్తంగా యువ నాయకులు చలామణి అవుతున్నారు. చంద్రబాబుతో సీనియర్ నాయకులు కొనసాగుతున్నారు. ఈ క్రమంలో చాలా చోట్ల సీనియర్లు,జూనియర్లకు మధ్య గ్యాప్ ఉంది. కృష్ణ,గుంటూరు కు చెందిన చాలామంది నాయకులు లోకేష్ ను అనుసరిస్తున్నారు. అటు లోకేష్ సైతం వారికి ప్రాధాన్యమిస్తున్నారు. ఇది ఇద్దరు ఎంపీలకు మింగుడు పడడం లేదు. అందుకే వారు పాదయాత్రకు గైర్హాజరైనట్లు ప్రచారం జరుగుతోంది. తాము పార్టీకే కట్టుబడి ఉన్నామని.. చంద్రబాబు ని అనుసరిస్తున్నామని సంకేతం ఇచ్చేందుకే ఢిల్లీలో చంద్రబాబు వెంట వాళ్లు అలా వ్యవహరించారని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికైతే కొందరు నాయకుల పుణ్యమా అని తండ్రీ కొడుకుల మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.