National Unity Day: సెప్టెంబర్ 17.. నిజాం ప్రభువు నుంచి తెలంగాణ సమాజం ఊపిరి పీల్చుకున్న రోజు. భారత ప్రభుత్వంలో విలీనమైన రోజు. అయితే భారత ప్రభుత్వంలో కలిసే ముందు ఎన్నో పరిణామాలు జరిగాయి. నిజాం ప్రభువు ఇక్కడి ప్రజలను ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేశాడు. నాటి హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభబాయ్ పటేల్ చాణక్యంతో నిజాం ప్రభువు మోకరిల్లాడు. ఫలితంగా తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైంది. ఇంతటి గొప్ప దినాన్ని తదుపరి పాలకులు విస్మరించారు. ఓటు బ్యాంకు రాజకీయాలు రాజ్యమేలడంతో.. ఓ వర్గం మెప్పు పొందేందుకు ఈ రోజును జరుపుకోవడమే మానేశారు. అయితే మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవం గా నిర్వహిస్తూనే ఉంది. తెలంగాణ ఉద్యమ సాగుతున్నప్పుడు నాటి ఉమ్మడి రాష్ట్ర పాలకులు సెప్టెంబర్ 17న నిర్వహించక పోవడం పట్ల అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు స్వాతంత్ర దినం వచ్చినా కూడా నిర్వహించరా అంటూ ధ్వజమెత్తేవారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం నిర్వహిస్తామని ప్రకటించారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత కెసిఆర్.. సెప్టెంబర్ 17ను నిర్వహించడం మానేశారు. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలని భారత రాష్ట్ర సమితిని డిమాండ్ చేస్తూ వస్తోంది. ఇదే పల్లవిని కమ్యూనిస్టు పార్టీలు కూడా అందుకున్నాయి. ఇక ఈ ఏడాది ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ 17ను రాజకీయంగా వాడుకునేందుకు పావులు కదుపుతున్నాయి. అయితే ఈ వ్యవహారం తమ పార్టీకి మంచిది కాదని కొంతమంది చెప్పడంతో కెసిఆర్ కూడా మనసు మార్చుకున్నారని తెలుస్తోంది. అందువల్లే సెప్టెంబర్ 17 పై మౌనం వీడారని సమాచారం. ఆ రోజున జాతీయ సమైక్యత దినోత్సవం పేరుతో కార్యక్రమాలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ.. ఎవరికి వారు వేరువేరు పేర్లతో హైదరాబాద్ వేదికగా సభలో నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. మొన్నటిదాకా ఈ విషయంలో భారత రాష్ట్ర సమితి మిన్న కుండిపోయింది. సెప్టెంబర్ 17 పై అధికార భారత రాష్ట్ర సమితి ఎందుకు స్పందించడం లేదు అనే చర్చ తెలంగాణలో మొదలైంది. ఇక దీనిపై ఒత్తిడి పెరగడంతో జాతీయ సమైక్యత దినోత్సవం గా జరపాలని నిర్ణయించింది.
సెప్టెంబర్ 17 వస్తోంది అంటేనే అధికార భారత రాష్ట్ర సమితి ఇరకాటం లో పడుతోంది. సెప్టెంబర్ 17న స్వతంత్ర దినోత్సవంగా జరపాలని అప్పటి ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్ డిమాండ్ చేశారు. 2014 లో తెలంగాణ సిద్ధించిన తర్వాత సెప్టెంబర్ 17న స్వతంత్ర దినోత్సవంగా నిర్వహిస్తారని అందరూ భావించారు. కానీ కెసిఆర్ స్వయంగా చేసిన డిమాండ్ నే పక్కన పెట్టారు. రేపు కమ్యూనిస్టులు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట దినోత్సవంగా జరపాలని డిమాండ్ తో ఉన్నారు. వీటిపై కూడా స్పందించిన కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొదట్లోనే జూన్ 2ను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. అంతగా జరపాలి అనుకుంటే ప్రతిపక్షాలు వారి పార్టీ కార్యాలయాల్లో జరుపుకోవాలని ఎద్దేవా చేశారు. ఫలితంగా ఈ వ్యాఖ్యల నేపథ్యంలో 17వ తేదీ ప్రతి ఏటా చర్చనీయాంశంగా మారింది. ఏడాది కూడా కార్యక్రమాల నిర్వహణపై తర్జనభర్జన పడిన భారత రాష్ట్ర సమితికి ప్రతిపక్షాలు పెట్టిన సభల సెగ తగిలింది. హైదరాబాదులో నిర్వహించే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. అయితే జాతీయ సమైక్యత దినోత్సవం పేరుతో గత ఏడాది మూడు రోజులపాటు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాష్ట్ర సమితి ఈ ఏడాది మాత్రం ఒక్క రోజుకే సరిపెట్టేసింది. ప్రభుత్వం తరఫున ఎలాంటి కార్యక్రమాలను ప్రకటించలేదు. కొద్ది నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. ప్రతిపక్ష పార్టీలు మొత్తం బహిరంగ సభలు, సమావేశాలు, క్షేత్ర స్థాయిలో సమావేశాలకు తెరలేపాయి. అందులో బాగానే బిజెపి హైదరాబాదులోని పరేడ్ గ్రౌండ్స్ లో సభ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా వస్తారని ప్రచారం జరుగుతుంది. ఇక ఈనెల 16 , 17 తేదీల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు హైదరాబాద్ కేంద్రంగా జరగనున్నాయి. ఈ క్రమంలో 17న సిడబ్ల్యుసి ముగింపు సమావేశాలను భారీ సభతో ముగించే అవకాశాలను కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తున్నది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాల వారోత్సవాల పేరుతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సభకు సన్నాహాలు చేస్తోంది.
ప్రతిపక్షాలన్నీ 17వ తేదీని కీలకంగా వినియోగించుకుంటుండడంతో భారత రాష్ట్ర సమితి ఆరోజు పై దృష్టి సారించింది. కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించింది. రాష్ట్రవ్యాప్త సభ లేకుండా ఎక్కడికక్కడే కార్యక్రమాలు నిర్వహించాలని మాత్రమే పార్టీ సూచించడంతో.. 17వ తేదీని ఈసారి అధికార పార్టీ సభ లేకుండానే సరిపెట్టనుంది. పార్టీ క్యాడర్లో కొంత అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఈ కార్యక్రమాలను కూడా ఎన్నికల కారణంగానే నిర్వహిస్తున్నారని చర్చ పార్టీలోనే వ్యక్తమవుతుండడం విశేషం. మరోవైపు సెప్టెంబర్ 17వ తేదీని సమైక్యత దినోత్సవం గా జరపాలని మజిలీస్ పార్టీ కూడా నిర్ణయించడం విశేషం. హైదరాబాదులో ఆరోజు బైక్ ర్యాలీతో పాటు బహిరంగ సభ నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది… యూసు ఫెయిన్ దర్గా నుంచి మాసాబ్ ట్యాంక్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించాలని మజిలీస్ పార్టీ నిర్ణయించింది. ఆ తర్వాత నిర్వహించే బహిరంగ సభలో మజిలీస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ తో పాటు అక్బరుద్దీన్.. ఇతర నేతలు పాల్గొంటారని ఆ పార్టీ పేర్కొంది.