Muthireddy Yadagiri Reddy: చెరువు అంటే ఊర్లో పంట పొలాలకు జీవనాధారం. పశుపక్ష్యాదులకు అదెరువు. మత్స్యకారులకు ఒక భరోసా. అలాంటి ఓ చెరువును జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చెరపట్టారు. అడ్డగోలుగా ఆక్రమించారు. హద్దులు చెరిపివేసి రాత్రికి రాత్రి దాన్ని పూడ్చివేశారు.. అంతేకాదు ఆ స్థలాన్ని తన కూతురి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు.. ఇప్పుడు ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ స్థలాన్ని తనకు తెలియకుండానే తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారంటూ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూతురు తుల్జా భవాని రెడ్డి తన తండ్రి మీద బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఈ స్థలం పై ఈ సంవత్సరాలుగా వివాదం సాగుతోంది.
బఫర్ జోన్ పరిధిలోకి వచ్చే చెరువు స్థలం..
చేర్యాలలోని జనగామ_ సిద్దిపేట ప్రధాన రహదారి పక్కనే పెద్ద చెరువు మత్తడి ప్రాంగణంలోని సర్వే నెంబర్ 1402లో 2,500 గజాల భూమి ఉంది. పెద్ద చెరువు బఫర్ జోన్ పరిధిలోకి వచ్చే ఈ స్థలం సంవత్సరాలుగా ఖాళీగా ఉండడంతో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పశువుల సంత నిర్వహించేవారు. అదే ఖాళీ స్థలంలో లారీ యజమానులు తమ వాహనాలను నిలుపుకోవడం తోపాటు, నలుగురు చిరు దుకాణా లు ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుతున్నారు. చేర్యాల పట్టణంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో ఈ స్థలం పట్టాదారులైన అజీజ్ అహ్మద్ నూర్ కుటుంబం నుంచి 2013లో వసీంఖాన్ తదితరులు కొనుగోలు చేశారు. అప్పట్లోనే అక్కడ ప్రహరీ నిర్మాణానికి చర్యలు చేపడుతుండగా ప్రతిపక్షాల నాయకులు అడ్డుకున్నారు. 2020లో ఈ స్థలాన్ని కొనుగోలు చేసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తన కూతురు తుల్జా భవాని రెడ్డి పేరు మీద 1270 గజాలు, తన వ్యాపార భాగస్వాములైన మారుతి ప్రసాద్, జితేందర్ రెడ్డి పేరు మీద మిగతా స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే రెండు సంవత్సరాల క్రితం కురిసిన భారీ వర్షాలకు తపస్పల్లి రిజర్వాయర్ నుంచి గోదావరి నీరును విడుదల చేయడంతో చేర్యాలలోని పెద్ద చెరువు మత్తడి పోసింది. దీంతో ఆ వరద నీరు మొత్తం మత్తడి ఆవరణ స్థలం మీదుగా పక్కనే ఉన్న ప్రధాన రహదారిపై చేరింది.
సిమెంట్ ఫలకలతో ప్రహరీ
ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా గమనించిన ముత్తిరెడ్డి ఆస్థానం చుట్టూ సిమెంట్ పలకలతో ప్రహరీ నిర్మించారు. అంతేకాకుండా మరోసారి చెరువు మత్తడి దునికితే ఇబ్బందులు తలెత్తకుండా ఆ స్థలం నుంచి కుడి చెరువు వరకు కాలువ నిర్మించాలని నీటిపారుదల శాఖ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే వ్యవహారంతో స్థానికులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే కొనుగోలు చేసిన స్థలం కోసం చెరువు కట్టను ఆనుకునే నిబంధనలకు విరుద్ధంగా కాలువ నిర్మాణం చేపడుతున్నారు అంటూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఆయన కూతురు భవాని రెడ్డి పై, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులపై చేర్యాలవాసులు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. 2020 డిసెంబర్ 11న చేర్యాల బంద్కు పిలుపునిచ్చిన స్థానిక ప్రతిపక్ష పార్టీల నాయకులు.. ఎమ్మెల్యే స్థలం చుట్టూ ఉన్న ప్రహరిని కూల్చివేశారు. దీనిపై అప్పట్లో 30 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇంత తతంగం జరుగుతున్నప్పటికీ కాలువ నిర్మాణం కోసం ఎమ్మెల్యే మూడు కోట్లు మంజూరు చేయించుకోవడం విశేషం.. స్థానికుల ఆందోళనల మధ్య ఎమ్మెల్యే కాలువ పనులు ప్రారంభించారు. ఈ కాల్వ పనులు పూర్తయితే చేర్యాల పెద్ద చెరువు కట్ట తో పాటు కింది ప్రాంతంలో ఉన్న గృహాలకు కూడా ప్రమాదమని స్థానికులు మండిపడుతున్నారు. అంతేకాదు 40 మందికి చెందిన పొలాలు, స్థలాలు ముంపునకు గురవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వివాదాస్పద భూములు కూతురు పేరుతో రిజిస్ట్రేషన్
ఇది జరుగుతుండగానే వివాదాస్పద భూములు, స్థలాలు తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడంతో తాను లోకాయుక్త చుట్టూ తిరుగుతున్నానని భవాని రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారానికి కారణమైన తన తండ్రి మీద ఆగ్రహంగా ఉంటున్నారు. సికింద్రాబాద్లోని హబ్సిగూడ లోని హోటల్ భవనంతో పాటు చేర్యాలలోని మత్తడి ఆవరణ స్థలాన్ని తనకు తెలియకుండానే తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారని ఆమె ఆరోపిస్తున్నారు.. ఈ క్రమంలోనే ఒకసారి చేర్యాలలోని మత్తడి ఆవరణ స్థల కంచెను తొలగించి పురపాలకానికి రాసి ఇస్తానని పేర్కొంటూ స్థానిక నాయకులకు ఒక సందేశాన్ని కూడా పంపించారు. ఆమె రాక కోసం నాయకులు ఎదురుచూసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది..ఇక హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని భవాని రెడ్డి మరొకసారి నిలదీయడం సంచలనంగా మారింది. మరోవైపు జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ దళ కమాండర్లు రాము, రమాదేవికి చెందిన భూమిని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆక్రమించినట్టు ప్రచారం జరుగుతున్నది. వారికి వారసత్వంగా వచ్చిన మూడు ఎకరాల 28 గంటల భూమిని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తన అనుచరుడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. ఇదేందని ప్రశ్నిస్తే వారిపై బెదిరింపులకు దిగుతున్నారు. ముత్తిరెడ్డి అనుచరుల ఆగడాలు తట్టుకోలేక వారు వరంగల్ పారిపోయారు. ఇక్కడే నివాసం ఉంటున్నారు. కోట్ల విలువైన భూమిని 14 లక్షల కే వదులుకోవాలని ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారు.