https://oktelugu.com/

ఎమర్జెన్సీ చేదు జ్ఞాపకాలకు 45 సంవత్సరాలు

ఇప్పటికి 45 సంవత్సరాల క్రితం అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ రాత్రికి రాత్రి దేశంలో ఎమర్జెన్సీ విధించింది. విశేషమేమంటే ఇందిరా గాంధీ ముందుగా ఎమర్జెన్సీ విధించిన తర్వాతనే రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అహ్మద్ ఆమోద ముద్ర వేయటం జరిగింది. అంటే ఎటువంటి అధికారం లేకుండానే ఇందిరా గాంధీ ఆత్యయిక స్థితిని విధించటమే కాకుండా అర్ధరాత్రి అందరి రాజకీయ నాయకుల్ని ఇళ్లనుంచి తీసుకొచ్చి జైళ్లలో కుక్కటం జరిగింది. మరుసటి రోజు పత్రికలన్నీ సంపాదకీయం ఖాళీగా అట్టిపెట్టి ప్రచురించాయి. ఎందుకంటే అప్పటికే […]

Written By:
  • Ram
  • , Updated On : June 25, 2020 / 08:48 PM IST
    Follow us on

    ఇప్పటికి 45 సంవత్సరాల క్రితం అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ రాత్రికి రాత్రి దేశంలో ఎమర్జెన్సీ విధించింది. విశేషమేమంటే ఇందిరా గాంధీ ముందుగా ఎమర్జెన్సీ విధించిన తర్వాతనే రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అహ్మద్ ఆమోద ముద్ర వేయటం జరిగింది. అంటే ఎటువంటి అధికారం లేకుండానే ఇందిరా గాంధీ ఆత్యయిక స్థితిని విధించటమే కాకుండా అర్ధరాత్రి అందరి రాజకీయ నాయకుల్ని ఇళ్లనుంచి తీసుకొచ్చి జైళ్లలో కుక్కటం జరిగింది. మరుసటి రోజు పత్రికలన్నీ సంపాదకీయం ఖాళీగా అట్టిపెట్టి ప్రచురించాయి. ఎందుకంటే అప్పటికే పత్రికా సెన్సార్ ని అమలులోకి తెచ్చింది ప్రభుత్వం. అంటే ప్రభుత్వ వ్యతిరేక వార్తలను ప్రచురించటానికి వీల్లేదు. ప్రతివార్త ప్రభుత్వ అనుమతి తోనే జరగాలి. ప్రస్తుతం చైనా లో ఇదే జరుగుతుంటుంది. ఎందుకంటే అక్కడ ప్రైవేటు ప్రచురణలు నిషిద్దం కాబట్టి. మనం కూడా ఆ పోలీసు రాజ్యాన్ని కొన్నాళ్ళు అనుభవించాం. ఆ తర్వాత పుట్టిన తరాల వారికి ఈ విషయం పుస్తకాల్లో చదువుకోవటం ద్వారానే తెలిసింది.

    ఇందిరా గాంధీ అంటే అప్పట్లో అత్యధిక ప్రజాదరణ కలిగిన నాయకురాలు. స్వతహాగా పెద్ద వక్త కాదు. కానీ వాళ్ళ నాన్న దగ్గర నుంచి రాజకీయాలు ప్రత్యక్షంగా చూసేది. తను అధికారం లో కొచ్చిన కొత్తలో కాంగ్రెస్ పార్టీలోని అతిరధ మహారదులనుంచి సవాళ్లు ఎదురయ్యాయి. వాటిని చాక చక్యంగా ఎదుర్కోవటమే కాకుండా తన అధికారానికి పార్టీలో తిరుగులేకుండా పావులు కదిపింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళు బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే పార్టీ చీలిపోయింది. కానీ అధికారం తన చేతులో ఉండటంతో పార్టీ ని హస్తగతం చేసుకోగలిగింది. తన అధికారాన్ని పదిలపరుచుకునే క్రమంలో ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించటం కోసం బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు చర్యలను చేపట్టింది. అవి తన ఓటు బ్యాంకుని పదిలపరచటమే కాకుండా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పార్టీగా ముద్రపడింది. అప్పటిదాకా హిందీ ప్రాంతాల్లో సోషలిస్టులు, హిందీయేతర ప్రాంతాల్లో కమ్యూనిస్టులు పేద ప్రజల పార్టీలుగా ముద్రపడ్డాయి. వాటి ఓటు బ్యాంకు దీనితో ఇందిరా కాంగ్రెస్ కి మారింది. 1971 లో ఇందిరాగాంధీ అఖండ విజయాన్ని సాధించింది.

    ఆ తర్వాత ఓ పెద్ద చారిత్రాత్మక సంఘటన జరిగింది. 1971 చివరలో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ స్వతంత్రం పొందింది. ఆ పోరాటం లో భారత సైన్యం లేకుంటే అది జరిగేది కాదు. ఈ ఘటనతో ఇందిరా గాంధీ ప్రజాదరణ పతాకస్థాయి నంటింది. పార్లమెంటులో ప్రతిపక్షనాయకుడు అటల్ బిహారీ వాజపాయీ ఆమెను అపర దుర్గగా వర్ణించాడు. అసలు ఇందిరా కాంగ్రెస్ పుట్టుకే వ్యక్తి పూజతో మొదలయితే అది ఈ సంఘటనతో ఎక్కడిదాకా వెళ్లిందంటే అస్సాం కాంగ్రెస్ నాయకుడు దేవకాంత్ బరువా ‘ ఇండియా ఇందిరా, ఇందిరా ఇండియా’ అనేదాకా వెళ్ళింది. తన అధికారానికి హద్దులు లేని సమయం లో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ( ఈయన సోషలిస్టు పార్టీ స్థాపకుల్లో ఒకరు) ‘సంపూర్ణ క్రాంతి’ ఉద్యమాన్ని ప్రారంబించాడు. ప్రజలు పెద్దఎత్తున తన సభలకు రావటం జరిగింది. విద్యార్ధుల్లో ఇది ఓ విప్లవంలాగా మారింది. ఈ నేపధ్యంలో ఒక సంఘటన చరిత్రగతిని మార్చింది. ఇందిరా గాంధీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని కోర్టు కెళ్ళిన సోషలిస్టు నాయకుడు రాజ్ నారాయణ్ కి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇందిరా గాంధీ పదవికోల్పోవల్సిన పరిస్థితులు వచ్చాయి. ఈ నేపధ్యమే చివరకు ఎమర్జెన్సీ ని విధించటానికి దారి తీసింది. నిజమే మరి, ఇండియా ఇందిరా, ఇందిరా ఇండియా అయినప్పుడు ఆవిడలేకపోతే దేశమే లేదుకదా!

    ఇదంతా ఎందుకు చెప్పాల్సింది వచ్చిందంటే కొత్త తరాలకు ఈ భారత దేశ చరిత్ర తెలియదు. తెలిసినా చూచాయగానే తప్ప.  ప్రజల త్యాగాలు చేయబట్టే ఈరోజు స్వేచ్చగా జీవించ గలుగుతున్నామని గుర్తుంచుకోవాల్సి వుంది. ఎమర్జెన్సీ చీకటి రోజులు మన పెద్ద వాళ్ళు అనుభవించారు కాబట్టే అవి పునరావృతం కాకుండా రాజ్యాంగం లో మార్పులు తీసుకొచ్చారు. వేరే ఏ దేశంలో నయితే ప్రజల ప్రాధమిక హక్కుల్ని హరించి నందుకు కఠిన శిక్షలు పడేవి. వారికి తిరిగి పోటీ చేసే అర్హత వుండేది కాదు. కానీ అలా జరగలేదు. తిరిగి అదే కుటుంబం దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ దీర్ఘకాలం పరిపాలన చేసింది. ఎమర్జెన్సీ లో 20 సూత్రాల పేరుతో ఆర్ధిక కార్యక్రమాలు ప్రకటిస్తే వాటిని భుజాన వేసుకొని దేశమంతా తిరిగి సిపిఐ ప్రచారం చేసింది. ఆ మకిలి లో భాగం వాళ్లకు కూడా వుంది. యువ రాకుమారుడు సంజయ్ గాంధీ ప్రత్యామ్నాయ అధికార కేంద్రంగా తయారయ్యి 5 సూత్రాల పేరుతో ఇంకో కార్యక్రమాన్ని ప్రారంభించాడు. దాంట్లో భాగంగా పేద ప్రజల్ని బలవంతంగా తీసుకెళ్ళి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేపించటంతో కధ అడ్డం తిరిగింది.  సోషలిస్టు నాయకుడు జార్జ్ ఫెర్నాండేజ్ ప్రజల్లో సంచలనం సృష్టించటం కోసం కొన్ని హింసాత్మక చర్యలకు కూడా పాల్పడ్డాడు. అందుకనే ఎమర్జెన్సీ ఎత్తేసినా తను జైలు లోనే ఉండిపోవాల్సి వచ్చింది. జైలు లోనుంచే పోటీ చేసి బీహార్ నుంచి లోక్ సభ సభ్యుడుగా గెలుపొందాడు. ఆ వారసత్వపు పార్టీనే నేటి జనతాదళ్ యునైటెడ్ బీహార్ లో అధికారం లో వుంది.

    ఎమర్జెన్సీ రోజులు గుర్తుకురాగానే ఏదో చెప్పలేని ఆవేదన, ఆక్రోశం కట్టలు తెంచుకుంటుంది. అప్పట్లో విద్యార్ధిగా వుండి  ప్రత్యక్షంగా చూసిన మాకు కాంగ్రెస్ ని , నెహ్రు కుటుంబాన్ని చూడగానే అవే చేదు జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో వున్న వారిలో చాలామంది ఆరోజు జైలు జీవితం అనుభవించిన వారే.  ఇది రెండో స్వతంత్ర పోరాటం. ఎంతోమంది ఎమర్జెన్సీ లో బాధలు అనుభవించినవారే. బాధాకర విషయమేమంటే ఇంతగా ప్రజాస్వామ్యం ఖూని జరిగినా, ప్రాధమిక హక్కులకు భంగం కలిగినా మన వుమ్మడి ఆంధ్రప్రదేశ్ మాత్రం తిరిగి కాంగ్రెస్ కే ఓటు వేసింది. అత్యధిక కాంగ్రెస్ సభ్యులని ఎన్నుకున్న రాష్ట్రంగా 1977 ఎన్నికల్లో మన తెలుగు రాష్ట్రానికి పేరు వచ్చింది. ఒకవిధంగా అపఖ్యాతి మూటకట్టుకుంది. హిందీ ప్రాంతాలు, పశ్చిమ ప్రాంతాలు పెద్దఎత్తున తిరుగుబాటు చేస్తే దక్షిణాదిలో స్పందన అంతంత మాత్రంగా వుండటం ఆశ్చర్యమేసింది. అంటే మనకి ప్రజాస్వామ్యం, ప్రాధమిక హక్కులు ప్రధానం కాదా ? ఏది ఏమైనా కాంగ్రెస్ పై ముఖ్యంగా నెహ్రు కుటుంబంపై మన తెలుగు రాష్ట్రాలకు అమితమైన ప్రేమాభిమానాలు ఉండేవి.

    2014 లో దీనికి చరమగీతం పలికారు మన  తెలుగు ప్రజలు. ప్రత్యేక తెలంగాణ, సమైక్య ఆంధ్రా ఉద్యమాల పుణ్యమా అని కాంగ్రెస్ పునాదులు పూర్తిగా కదిలిపోయాయి. తెలంగాణా లో ఇంత మంది మరణానికి కారణమని తెలంగాణా వాసులు, ఆంధ్రాకు పూర్తిగా అన్యాయం చేసిందని ఆంధ్రా వాసులు కాంగ్రెస్ ని  సోదిలో లేకుండా చేసారు. ఆంధ్రలో అయితే దాని ఉనికి పూర్తిగా కోల్పోయింది. తెలంగాణా లో ఉనికి కోల్పోకపోయినా కెసిఆర్ పర్సనాలిటీ ముందు సోనియా గాంధీ పర్సనాలిటీ వెలవెల పోయింది. అయినా దింపుడు కళ్ళెం ఆశతో తెలంగాణా ఇచ్చిన ” దేవత ” గా సోనియా గాంధీని ఎప్పటికైనా ఆదరిస్తారనే నమ్మకంతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వున్నారు. కానీ వాళ్ళ ఆశలు నెరవేరే పరిస్థితులు లేకపోగా అసలు ఉనికికే ప్రమాదం వచ్చేటట్లు వుంది. తెరాసకి ప్రత్యామ్నాయంగా బిజెపి తెరమీదకు వచ్చింది. ఉత్తర తెలంగాణా లో ఇప్పటికే ఆ పని జరిగిపోయింది. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ కి ఇప్పటికీ ఆశలు సజీవంగా వున్నాయి. వచ్చే నాలుగు సంవత్సరాల్లో బిజెపి ఇక్కడ కూడా కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశాలే మెండుగా వున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరపాలిక ఎన్నికలు ఈ సమస్యని పరిష్కరిస్తాయి. తెరాస కి ఇక్కడ ప్రత్యామ్నాయంగా బిజెపి వుండే అవకాశాలే ఎక్కువగా వున్నాయి. అదేజరిగితే కాంగ్రెస్ తెలంగాణా లో కూడా బిషానా సర్దుకోవలసి వుంటుంది. వుమ్మడి నల్గొండ జిల్లా హైదరాబాద్ నగర పాలిక ఎన్నిక తర్వాత కాంగ్రెస్ పట్టునుంచి బయటపడే అవకాశముంది. కాబట్టి ఎమర్జెన్సీలో కాంగ్రెస్ కి ఓటు వేసిన తెలుగు ప్రజలు ఆ బాకీ ఇప్పుడు తీర్చుకున్నట్లయ్యింది.

    ఎమర్జెన్సీ చేదు జ్ఞాపకాలతో ఈ 45 సంవత్సరాల్లో ప్రజాస్వామ్యం బలపడింది. పార్టీలు ఏవి అధికారం లో వున్నా ప్రాధమిక హక్కుల్ని, భావ స్వేచ్చని అరికట్టే సాహసం చేయలేరు. ముఖ్యంగా కొత్త తరాలు భావ స్వేచ్చ లేకుండా బతక లేరు. అది సానుకూల పరిణామం. మధ్యతరగతి క్రమేపీ పెరగటం కూడా ప్రజాస్వామ్యం బలపడటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి భారత్ ఇక ఎప్పటికీ ఎమర్జెన్సీ కి వెళ్ళే అవకాశాలు లేవు. ఎమర్జెన్సీ అనేది కేవలం చరిత్ర గానే మిగిలిపోతుంది. దానితోపాటు చిరకాలపు ముద్దాయిగా బోనులో కాంగ్రెస్ కూడా కొనసాగుతుంది. ఇవీ ఎమర్జెన్సీ కి సంబంధించి కొన్ని చేదు గుర్తులు. దురదృష్టవశాత్తూ మీడియా లో ఈరోజు దీనిపై ఫోకస్ లేదు. కారణాలు మీకే వదిలేస్తూ …