AP Mlc Elections : నిండు సభలో ఏడిపించిన జగన్ పై ప్రతీకారంతో అసెంబ్లీకి రానన్నాడు చంద్రబాబు. కానీ ఎక్కడైతే తనను ఏడిపించాడో అక్కడికే వచ్చాడు. లాబీయింగ్ చేసి మరీ జగన్ చేత్తో ఆయన కంటినే పొడిచాడు. వైసీపీ ఎమ్మెల్యేలతోనే క్రాస్ ఓటింగ్ చేయించి మరీ జగన్ ను ఓడించాడు. ఈ దెబ్బతో ఏపీలో అధికార సమీకరణాలు పూర్తిగా మారాయి. 151మంది ఎమ్మెల్యేలున్న జగన్ టీడీపీ చేతిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతికంగా ఓడినట్టే. ఈ విజయం టీడీపీకి నైతికంగా విజయం.. వచ్చేసారి అధికారంపై భరోసా కల్పించింది. అంతులేని ధైర్యాన్ని ఇచ్చింది.
ఒకటి కాదు..రెండు కాదు.. నాలుగేళ్ల జగన్ పాలనపై ఇప్పుడు రియాక్షన్ మొదలైంది. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత పాదుకుంది. జగన్ సొంత ఇలాఖ కడప జిల్లా ఉన్న పశ్చిమ రాయలసీమ నుంచి తూర్పు రాయలసీమ, ఉత్తరాంధ్ర ఇలా ఎక్కడ చూసినా పట్టభద్రులు, ఉద్యోగుల్లో వ్యతిరేకతతో జగన్ పార్టీ ఓడిపోయింది. ఇది జగన్ కు డేంజర్ బెల్స్ మోగిస్తోందన్న సంకేతాన్ని ఇచ్చింది. ఇన్నాళ్లు చచ్చుబడిపోయిన టీడీపీకి ఓ కొత్త శక్తిని ఇచ్చింది.
చంద్రబాబు పని అయిపోయిందన్నారు. 70 ఏళ్ల వయసులో ఆయనతో పని కాదన్నారు. ఇక భవిష్యత్ లేదన్నారు. జగన్ మరో 30 ఏళ్లు అధికారం అన్నారు. 175కి 175 సీట్లు మావే అన్నారు. కానీ కట్ చేస్తే ప్రజల నాడి వేరేలా ఉంది. అధికార అంతమున అది జగన్ కు బాగా తగులుతోంది.
సహజంగా ప్రజానాడి పాలిస్తున్న ఐదేళ్ల సమయంలో అస్సలు బయటపడదు. అందుకే ఉప ఎన్నికలను చంద్రబాబు వదిలేశాడు. చాలా చోట్ల వైసీపీపై పోటీచేయలేదు. చేసినా వృథా అని ప్రజలు ఎలాగూ అభివృద్ధి వారినే గెలిపిస్తారని సైలెంట్ అయ్యాడు. బద్వేలు సహా పలుచోట్ల పోటీనే పెట్టలేదు.
ఈ విజయాలు చూసి జగన్ మురిసిపోయాడు. మేడిపండులా నిగనిగలాడాడు. 175 సీట్లకు టెండర్ పెట్టాడు. కానీ పాలన లోపాలను సరిదిద్దుకోలేదు. జనాకర్షణ చేయలేదు. ఫలితం ఇప్పుడు ఎన్నికలకు ఏడాది ముందర జగన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమియే దానికి హెచ్చరికగా మారింది. మొన్న పట్టభద్రులు, ఉపాధ్యాయులు షాకిస్తే.. నేడు సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఝలక్ ఇచ్చారు. ఈ పరిణామం ఖచ్చితంగా జగన్ కు మేలుకొలుపు. మేల్కోకుంటే జగన్ అధికారానికి అంతానికి పిలుపు. చంద్రబాబుకు ఒక కొత్త ఊపిరి. ఇంకా ఏడాది మాత్రమే ఉన్న ఎన్నికల సమయానికి ఏపీ ప్రజల నాడి మారుతోందని దీన్ని బట్టి అర్థమవుతోంది.