
Crypto vs America’s banks : ఆర్థికమాంద్యంతో సతమతమవుతున్న అమెరికాకు క్రిప్టో కరెన్సీ చుక్కలు చూపిస్తోంది.. అక్కడి బ్యాంకులను ఆర్థిక సంక్షేభంలో కూరుకు పోయేలా చేస్తుంది. మొన్న సిలికాన్ వ్యాలీ బ్యాంకు మూతపడ్డ రెండు రోజులకే అమెరికాలోని మరో బ్యాంకు సంక్షోభంలో కూరుకుపోయింది. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న సిగ్నేచర్ బ్యాంక్ ను మూసివేస్తున్నట్టు అమెరికా సర్కార్ ప్రకటించింది. ఆ బ్యాంకు ను ద ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తన నియంత్రణలోకి తీసుకుంది. సిగ్నేచర్ బ్యాంకు మూసివేత నిర్ణయంతో అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ ప్రకంపనలు ప్రారంభమయ్యాయి.
అమెరికాలోని న్యూయార్క్ కేంద్రంగా ఇజ్రాయిల్ బ్యాంక్ హపోలిమ్ 2000 సంవత్సరంలో సిగ్నేచర్ బ్యాంక్ స్థాపించింది. ఈ బ్యాంకు అమెరికా వ్యాప్తంగా శాఖలను తెరిచింది. 2004లో పబ్లిక్ ఇష్యూ ప్రారంభించింది. 2005లో తన వాటాలను షేర్ మార్కెట్లో అందుబాటులో పెట్టింది. స్థిరాస్తి, డిజిటల్ అసెట్స్ సహా దశలవారీగా తొమ్మిది విభాగాల్లో ఈ బ్యాంకు తన సేవలను విస్తరించింది. ఈ బ్యాంకు కార్యకలాపాలు సజావుగా సాగుతున్న క్రమంలో ఓ దశలో రోజురోజుకు పై పైకి ఎగబాకిన క్రిప్టో కరెన్సీ డిపాజిట్లను కూడా ప్రారంభించింది. 2019లో సిగ్నేచర్ బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయం తన పతనానికి కారణమైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ బ్యాంకుకు 110.36 బిలియన్ డాలర్ల ఆస్తులు, 88.59 బిలియన్ డాలర్ల మేర డిపాజిట్లు ఉన్నాయి. అయితే గత ఏడాది సెప్టెంబర్ చివరికి ఈ బ్యాంకు డిపాజిట్లలో మూడో వంతు క్రిప్టో కరెన్సీ ద్వారా వచ్చిన డిపాజిట్లు ఉండటం గమనార్హం. క్రిప్టో కరెన్సీ నేల చూపులు చూడడం మొదలుపెట్టగానే జరగబోయే నష్టాన్ని సిగ్నేచర్ బ్యాంకు ముందుగానే ఊహించింది. ఇందులో భాగంగా గత ఏడాది డిసెంబర్లో దీనిపై ఒక ప్రకటన చేసింది. తమ క్రిప్టో కరెన్సీ డిపాజిట్లను ఎనిమిది బిలియన్ డాలర్లకు కుదిస్తామని స్పష్టం చేసింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మొత్తానికి బ్యాంకు మూతపడింది.
డోనాల్డ్ ట్రంప్, అతని కుటుంబానికి సిగ్నేచర్ బ్యాంకు 2021లో మద్దతు ప్రకటించిందని ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో ఈ బ్యాంకు నుంచి తమ ఖాతాలను ఉపసంహరించుకుంటామని వినియోగదారులు హెచ్చరికలు జారీ చేశారు. కోవిడ్ సమయంలో పే చెక్క ప్రొటెక్షన్ ప్రోగ్రాం విషయంలోనూ ఈ బ్యాంకులో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. చిన్న రుణ గ్రహీతలను వేధించడం, పెద్ద రుణ గ్రహీతలకు పెద్దపీట వేయడం పైనా విమర్శలు ఎదుర్కొంది. బ్యాంకు మొత్తంలో శ్వేత జాతీయ అనే విమర్శలు ఉన్నాయి. 2020లో దీనిపై పలు ఆరోపణలు వచ్చాయి. బ్యాంకు కార్యనిర్వాహక బృందం, డైరెక్టర్లలో అందరూ శ్వేత జాతీయులే కావడం విశేషం. వివక్ష, రుణాల ముగింపు విషయంలో తప్పుడు లెక్కల ఆరోపణలపై కోర్టుల్లో దావాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఈ బ్యాంకు ను అమెరికా స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో.. ఖాతాదారులకు సంబంధించిన వ్యవహారాలు మొత్తం కోర్టు ద్వారా పరిష్కరించనుంది.