https://oktelugu.com/

దళితులపై కాంగ్రెస్ కపట ప్రేమ

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ లో ఓ ఫోటో షో నిర్వహించారు. రాహుల్ గాంధీ తనంతట తానే ఓ పొద చూసుకొని కిందకు జారటం, తర్వాత తనని పోలీసులు బలవంతంగా తోసినట్లు సీను సృష్టించటం, దాన్ని ఆధారం చేసుకొని మీడియా లో విపరీతమైన ప్రచారం చేయటం చూస్తే సీను బాగానే రక్తి కట్టినట్లు అనిపించింది. దానికి మన తెలుగు మీడియా లో కూడా బాగానే ప్రచారం జరిగింది. అంటే అనుకున్న రాజకీయ ఫలితం దక్కింది. కాకపోతే […]

Written By:
  • Ram
  • , Updated On : October 2, 2020 / 08:20 AM IST
    Follow us on

    రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ లో ఓ ఫోటో షో నిర్వహించారు. రాహుల్ గాంధీ తనంతట తానే ఓ పొద చూసుకొని కిందకు జారటం, తర్వాత తనని పోలీసులు బలవంతంగా తోసినట్లు సీను సృష్టించటం, దాన్ని ఆధారం చేసుకొని మీడియా లో విపరీతమైన ప్రచారం చేయటం చూస్తే సీను బాగానే రక్తి కట్టినట్లు అనిపించింది. దానికి మన తెలుగు మీడియా లో కూడా బాగానే ప్రచారం జరిగింది. అంటే అనుకున్న రాజకీయ ఫలితం దక్కింది. కాకపోతే అర్ధం కావాల్సింది ఇవన్నీ పాత టెక్నిక్కులు. రోజులు మారాయి. ప్రజలు అంత అమాయకులు కాదు. జిమ్మిక్కుల కాలం చెల్లింది.

    కాంగ్రెస్ కి అసలు వీటిపై మాట్లాడే హక్కుందా?

    స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 73 సంవత్సరాలయ్యింది. ఎక్కువ కాలం ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్, అదీ ఒకే కుటుంబం. పేరుకు ప్రజాస్వామ్యమైనా అధిక కాలం కుటుంబ వారసత్వ పరిపాలన కిందనే ఈ దేశం మగ్గింది. నెహ్రూ, ఆ తర్వాత కొంతమేర ఇందిరా గాంధీని కూడా ప్రజలు స్వతహాగానే కోరుకున్నారనుకుందాం. ఆ తర్వాత జరిగిందంతా నాటకం,బూటకమే. తప్పయినా, ఒప్పయినా ఆ కుటుంబం బాధ్యత వహించాల్సిందే. మొత్తం భారత సామాజిక, ఆర్ధిక స్థితిగతులు ఈ వ్యాసం లో ప్రస్తావించ లేము కాబట్టిసామాజిక న్యాయం అంశం వరకే పరిమితమవుదాం. అసలు 73 సంవత్సరాల తర్వాత ఇంకా ఈ సమస్య ఎక్కడివేసిన గొంగళి అక్కడే వుందంటే దీనికి ప్రధాన ముద్దాయి కాంగ్రెస్, ఆ కుటుంబం కాదా? అంబేద్కర్ మహనీయుడు కలలు కన్న కులరహిత సమాజం వైపు మనం పయనిస్తున్నామా? మనం ఇన్ని సంవత్సరాల్లో సాధించింది ఏమైనా వుందంటే రాజకీయాలన్నీ కులాల చుట్టూ తిరగటమే. ఈ రోజుకీ దళితులు, ముస్లింలు అందరికన్నా వెనకబడి వుండటానికి కారణమెవరు? దళితులపై, ముస్లింలపై మొసలి కన్నీరు కార్చటం, ఓట్లు దండుకోవటం తప్పిస్తే వాళ్ళ పరిస్థితుల్ని ఎందుకు మార్చలేకపోయారు?

    మార్చటానికి పునాదులు మొదట్లోనే పడుంటే బాగుండేది. అసలు కుల వ్యవస్థ మారటానికి సామాజిక లక్ష్యాలేమైనా నిర్దేశించుకున్నారా? దీనికి కావాల్సిన భౌతిక పునాదిని ఏర్పరిచారా? కులాంతర వివాహాలని ప్రోత్సహించారా? ఇప్పటికీ ఏ కులానికా కులానికి ప్రత్యేకంగా ఇల్లు, స్కూళ్ళు , హాస్టళ్ళు కడుతూ సమాజాన్ని విడదీస్తున్నారా, సమైక్యం చేస్తున్నారా? ఆర్ధికంగా వాళ్ళు నిలదొక్కుకోవటానికి చేయాల్సినంత చేయూత ఎందుకు చేయలేకపోయారు? అసలు కాంగ్రెస్ ఈ పంధాలో పయనించి వుంటే ప్రజలు వాళ్ళ కుల ప్రాధాన్యత వున్న రాజకీయ పార్టీల వైపు ఎందుకు సమీకరించబడే వాళ్ళు? కాంగ్రెస్ సరైన పంధాలో లేదు కాబట్టే కర్పూరీ ఠాకూర్ లాంటి నేతలు వచ్చారు. కాంగ్రెస్ సరైన పంధాలో లేదు కాబట్టే కాన్షీరాం బహుజనులకు రాజకీయ అధికారం కోసం పార్టీ పెట్టాడు. ఇన్ని కబుర్లు చెప్పే కాంగ్రెస్ దళితుల్ని ఏ స్థాయిలో తన పార్టీలో పైకి తీసుకొచ్చింది. ఎన్నిసార్లు దళితుల్ని కాంగ్రెస్ అధ్యక్షుల్ని చేసింది. ఇంకొకరికి అధ్యక్షుడ్ని చేయటానికి ఖాళీ ఎక్కడిది? ఎక్కువభాగం వాళ్ళ కుటుంబమే అధ్యక్షుడి పాత్ర పోషిస్తుంటే వేరొకరికి స్థానం ఎక్కడిది?

    దళితులపై ఎందుకు అత్యాచారాలు జరుగుతున్నాయి?

    ఇది అందరం ఒకటికి రెండుసార్లు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం. నిచ్చెనలాంటి కుల వ్యవస్థ చారిత్రక వారసత్వంగా మనల్ని వెంటాడుతూ వచ్చింది. అందరూ ఈ వ్యవస్థ పోవాలని ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళే కానీ ఆచరణలో అందుకు ఎంతమేర కృషి చేసామో గుండెమీద చేయివేసుకొని చెప్పండి. ఈ రోజుకీ పరువు హత్యలు చేసుకుంటూ సిగ్గుతో తలవంచుకొనే సమాజంలో బతుకుతున్నాం. కులాలు, మతాల కతీతంగా మనమేమన్నా చేసామా? ఏ కులంవాళ్ళు ఆ కులంలోనే అందులోనూ  మళ్ళీ ఉప కులాలను వెతుక్కొని పెళ్ళిళ్ళు చేసే మనం కుల వ్యవస్థతో సమాజం కుళ్ళి పోయిందని లెక్చర్లు దంచేస్తుంటాం. ఈ రోజుకీ ఊళ్లలో ఇల్లు కులాలవారీగానే విభజించబడి వున్నాయి. అంటే నేను అందరినీ బలవంతంగా కులాంతర వివాహాలు చేయాలని చెప్పటంలేదు, కానీ కులాంతర వివాహాల్ని ప్రోత్సహించే వాతావరణాన్ని సృష్టించుకోవాల్సిన బాధ్యత అటు ప్రభుత్వంపై, ఇటు మనందరిపై వుంది. ప్రభుత్వం రిజర్వేషన్ విధానంలో మార్పులు తీసుకు రావాలి. ఇప్పటికే వున్నత పదవుల్లోవుండి, రెండుతరాలుగా రిజర్వేషన్లు అనుభవిస్తున్నవారి స్థానంలో కులాంతర వివాహాలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలి. దీనిపై ఇంకో వ్యాసంలో మరింత  వివరంగా చర్చించుకుందాం. ఇప్పటికే చట్టాలు దళితులపై అత్యాచారం విషయంలో పకడ్బందీగా వున్నాయి. అయినా జరుగుతున్నాయంటే ఇది సామాజిక రుగ్మత. దీనిపై సామాజిక చైతన్యం తీసుకురాకుండా కేవలం చట్టాలు చేస్తే ప్రయోజనం శూన్యం.

    రెండోది, ఇటువంటి విషయాల్లో రాజకీయాలకు తావివ్వకుండా అందరూ కలిసి కట్టుగా వ్యవహరించాలి. ఉదాహరణకు, ఉత్తర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన సంఘటన వినటానికే భయానకంగా వుంది. దాంట్లో రాజకీయాలకు తావులేకుండా నిందితులకు వేగంగా శిక్షలు పడేటట్లు చేయాలి. రాహుల్ గాంధీ ఇదేదో అవకాశం దొరికిందని హడావిడి చేసేబదులు మొన్న విడుదలచేసిన గణాంకాల్లో రాజస్తాన్ ప్రధమంగా  వున్నప్పుడు అక్కడ మౌనం దాల్చి, ఇక్కడ మాట్లాడటం ఎంతవరకు సబబు? అదే తీవ్ర స్వరంతో ఆళ్వార్ ఘటనపై కూడా మాట్లాడివుంటే తనకు ఈ సమస్యపై నిబద్దత వుందని అనుకునేవాళ్ళం. అక్కడొక తీరు, ఇక్కడొక తీరు వుండకూడదు కదా. మీడియా కూడా ప్రజల్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయకూడదు. మొన్న విడుదలచేసిన క్రైం బ్యూరో నివేదిక లో వాళ్లకు కావాల్సిన పద్దత్తుల్లో గణాంకాల్ని ట్విస్ట్ చేసి చెప్పటం ఎంతవరకు సబబు? సహజంగా ఉత్తర ప్రదేశ్ లో కేసులు అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ వుంటాయి. కారణం జనాభా చాలా ఎక్కువ కాబట్టి. చూడాల్సింది శాతాన్ని నంబర్ని కాదు. ఇది తెలియనంత అమాయకులేం కాదు మేధావులు, మీడియా వాళ్ళు. యోగి ఆదిత్యనాత్ మీదున్న కసిని ఈ విధంగా తీర్చుకోవాలనుకున్నట్లుంది? ముందుగానే రాజీనామాని అడిగేబదులు కాల పరిమితిలో  చర్యలు తీసుకోపోతేనో, నిందితులు, కుమ్మక్కయిన పోలీసులపై చర్యలు తీసుకోపోతే అప్పుడు అడిగితే సబబుగా వుంటుంది. అంతకన్నా ముందుగా పార్టీలతో సంబంధం లేకుండా ఏ రాష్ట్రాల్లో నయితే పరిస్థితులు తీవ్రంగా వున్నాయో ఆ రాష్ట్రాల్లో అందరూ కలిసి కార్యాచరణ ప్రణాళిక చేపడితే బాగుంటుంది. అంతేగాని దీన్ని రాజకీయంగా వాడుకోవటం వలన దళితులకు న్యాయం జరగదు.

    మేధావులారా ఆలోచించండి 

    భారత్ లో అనాదిగా వుండి , ఇప్పటికీ మనల్ని వెంటాడుతున్న సామాజిక రుగ్మతల పై ఇప్పటికైనా ఓ పెద్ద ఉద్యమం నడపాల్సివుంది. నా పార్టీ అధికారంలో వుంటే ఒక తీరు, వేరే పార్టీ అధికారంలో వుంటే వేరే తీరుగా ఆలోచించినంత కాలం సమస్యలు పరిష్కారం కావు. ఉదాహరణకు, పశ్చిమ బెంగాల్ లో బిజెపి లో చేరిన ఎంతోమంది దళితులు హత్యకు కాబడ్డారు. అప్పుడు, మీడియాగానీ, మేధావులు గాని నోరు మెదపలేదు. ఎందుకంటే బిజెపి లో వున్న దళితులపై మాట్లాడితే బిజెపి కి లాభం చేకూరుతుందేమోనని భయం. అదే మమతా బెనర్జీ ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ సంఘటన పై తీవ్రంగా స్పందించింది. ఇప్పుడు స్పందించటం తప్పుకాదు. కాకపోతే ఎప్పుడూ, అన్ని సందర్భాల్లో  స్పందించినప్పుడే ఆ మాటకు విలువ వస్తుంది. అదే సమయంలో బిజెపి కూడా ప్రతిపక్ష పార్టీలు అధికారం లో వున్న ప్రభుత్వాల్లో జరిగినప్పుడు స్పందించినట్లే తన ప్రభుత్వంలోనూ స్పందించాలి. ఏ పార్టీ ఈ సమస్యల్ని రాజకీయానికి వాడుకోకూడదు. ముఖ్యంగా కాంగ్రెస్. మీరు అనొచ్చు ఎందుకు మీరు కాంగ్రెస్ పై ప్రత్యేకంగా విరుచుకు పడుతున్నారని? సమాధానం ఒక్కటే ఈ దేశాన్ని ఎక్కువకాలం పాలించిన పార్టీగా సామాజిక వైఫల్యాలకు ప్రధాన బాధ్యత, నైతిక బాధ్యత కాంగ్రెస్ వహించాల్సిందే. వాస్తవానికి ఇటీవల రాసిన వ్యాసంలో కూడా ప్రజాస్వామ్యం బలపడాలంటే బలమైన ప్రత్యామ్నాయ పార్టీ కావాలి అని ఆ అవకాశాలు కాంగ్రెస్ కే వున్నాయని కూడా రాసాను. అయితే కొన్నాళ్ళు సోనియా గాంధీ కుటుంబం తప్పుకొని అంతర్గత ప్రజాస్వామ్యంతో ఎన్నికలు నిర్వహించి అధ్యక్షుడ్ని, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ఎన్నుకుంటే ప్రజలకు తిరిగి విశ్వాసం కలుగుతుంది. మోడీ పాలన రెండు దఫాలు పూర్తయిన తర్వాత తనూ జవాబు చెప్పుకోవాల్సి వుంది. దళితులూ, అంతకన్నా ఎక్కువగా ముస్లింలు సమాజంలో అట్టడుగున ఉండటానికి ఎక్కువకాలం పాలన చేసిన కాంగ్రెస్ నిర్వాకమేనని బలంగా నమ్ముతూ …..