TRS CPI CPM : ‘ఎర్ర గులాబీ’ పయనమెటో?.. కలిసి వచ్చే శక్తులెవో?

TRS CPI CPM : మునుగోడు ఉప ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కొత్త పొత్తు పొడిచింది. గత ఉప ఎన్నికల్లో మద్దతు వరకే ఉన్న వామపక్ష పార్టీలు ఆ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆ ఎన్నికల తర్వాత వామపక్షాలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ, మునుగోడు ఉప ఎన్నికల వేళ.. మద్దతు కాస్త పొత్తుగా మారింది. అధికార టీఆర్‌ఎస్‌ను విజయ తీరానికి చేర్చింది. వామపక్షాలు టీఆర్‌ఎస్‌ వెనకాల చేరడంపై రాష్ట్రంలో చర్చ […]

Written By: NARESH, Updated On : November 13, 2022 3:21 pm
Follow us on

TRS CPI CPM : మునుగోడు ఉప ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కొత్త పొత్తు పొడిచింది. గత ఉప ఎన్నికల్లో మద్దతు వరకే ఉన్న వామపక్ష పార్టీలు ఆ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆ ఎన్నికల తర్వాత వామపక్షాలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ, మునుగోడు ఉప ఎన్నికల వేళ.. మద్దతు కాస్త పొత్తుగా మారింది. అధికార టీఆర్‌ఎస్‌ను విజయ తీరానికి చేర్చింది. వామపక్షాలు టీఆర్‌ఎస్‌ వెనకాల చేరడంపై రాష్ట్రంలో చర్చ జరుగుతున్నది. వారి ఓటు బ్యాంకు కారు గుర్తుకు మళ్లడంతోనే పదివేల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రాజగోపాలరెడ్డిని ఓడించడం సాధ్యమైందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. కమలనాథులను ఎదుర్కోడానికి కమ్యూనిస్టుల మద్దతును కూడగట్టిన కేసీఆర్‌ వ్యూహ చతురతను అందరూ మెచ్చుకున్నారు.

-వామపక్షాలకు పట్టున్న జిల్లా కావడంతో..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వామపక్షాలకు మొదటి నుంచీ పట్టు ఉంది. మునుగోడులో అయితే సీపీఐ అభ్యర్థి ఐదుసార్లు విజయం సాధించాడు. దీనిని గ్రహించే గులాబీ బాస్‌ ఆ పార్టీలను చేరదీశారని వ్యాఖ్యానిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమని తెలిసిన తర్వాతే కేసీఆర్‌ ఈ రెండు పార్టీల నేతలతో చర్చలు మొదలు పెట్టారు. మద్దతు కాస్త పొత్తుగా మారి.. చివరకు గులాబీ అభ్యర్థిని గట్టెక్కించింది.

-అప్పటి నుంచే దాడి మొదలు
వామపక్షాలతో కేసీఆర్‌ దోస్తీ ఒక్క మునుగోడు కోసమే కాదని, దాని వెనకాల దీర్ఘకాలిక వ్యూహం దాగివుందని తెలుస్తోంది. హుజూరాబాద్‌ ఉపఎన్నిక తర్వాత కమలనాథులపై సమరశంఖాన్ని పూరించిన టీఆర్‌ఎస్‌ అధినేత క్రమంగా తన దాడిని తీవ్రం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశం సర్వ నాశనమైందని, అభివృద్ధి సూచికలు అట్టడుగు స్థాయికి చేరాయని విమర్శించారు. మోదీ అసమర్థ పాలకుడని, అన్ని వ్యవస్థలనూ దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎదురు నిలవాల్సిన కాంగ్రెస్‌ నిర్వీర్యమైపోయిందని అన్నారు.

-తామే ప్రత్యామ్నాయమంటూ.. బీఆర్‌ఎస్‌ ప్రకటన..
ప్రస్తుత పరిస్థితులలో మరో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి రావాల్సిన అవసరముందని చెప్పారు. ఆ దిశలో అక్టోబర్‌ 5, విజయదశమి రోజున భారత్‌ రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌)ని ప్రకటించారు. కొత్త పార్టీ బీజేపీ, కాంగ్రెస్‌కు సమదూరంలో ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీల అధినేతలను, రైతుసంఘాల ప్రతినిధులను, ఇతర ప్రముఖులను కలిశారు. రిటైర్డ్‌ అధికారులతోనూ చర్చలు జరిపారు. టీఆర్‌ఎస్‌ పార్టీలోనూ అంతర్గతంగా సుదీర్ఘ మంతనాలు సాగిస్తున్నారు.

-కలిసి వచ్చేదెందరో?
బీఆర్‌ఎస్‌కు ముందు ప్రత్యామ్నాయ శక్తిగా తృతీయ కూటమి ఏర్పాటుకు కేసీఆర్‌ చేసిన ప్రయత్నాలకు చెప్పుకోదగిన ఫలితాలు రాలేదు. తమిళనాడు సీఎం స్టాలిన్, బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ థాకరే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ వంటి నేతలు బీజేపీ వ్యతిరేక పోరాటానికి సంఘీభావం ప్రకటించారు తప్ప టీఆర్‌ఎస్‌తో కలిసి నడుస్తామని చెప్పలేదు. కాంగ్రెస్‌ లేకుండా ఏర్పడే ఐక్య సంఘటన ఎంత మాత్రం ప్రత్యామ్నాయం కాబోదని వారిలో కొందరు స్పష్టం చేశారు.

-బీఆర్‌ఎస్‌లోకి ఆ నేతలు..
తృతీయ కూటమి విఫలం కావడంలో కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ ప్రకటించారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌లో చేరేందుకు గుజరాత్‌ మాజీ సీఎం శంకర్‌ సింగ్‌ వఘేలా, అస్సాంకు చెందిన ఆల్‌ అస్సాం స్టూడెంట్స్‌ యూనియన్‌(ఆసు) చీలిక వర్గం, జమ్మూ–కశ్మీర్‌లోని భీమ్‌సింగ్‌ పాంథర్స్‌ పార్టీ మాత్రమే బీఆర్‌ఎస్‌లో చేరడానికి సమ్మతించినట్లు విశ్వసనీయ సమాచారం. వ్యక్తులుగా కలిసిన నటుడు ప్రకాశ్‌రాజ్, తమిళ హీరో విజయ్‌ తదితరులు రేపటి రోజున కలుస్తారేమో చెప్పలేం.

-అందుకే వామపక్షాలతో దోస్తీ..
ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనిస్తే బీఆర్‌ఎస్‌ను జాతీయపార్టీగా తీర్చిదిద్దడం కష్టతరమని కేసీఆర్‌కు అర్థమైంది. ఈ పరిస్థితిలో దేశవ్యాప్తంగా విస్తరించివున్న వామపక్షాలు, విప్లవశక్తులు గులాబీ బాస్‌ దృష్టిలో పడ్డాయి. వాళ్లయితేనే బీజేపీ మతతత్వవాదానికి వ్యతిరేకంగా ఎలాంటి షరతులు లేకుండా ముందుకు వస్తారని అర్థమైంది. అందుకే, సీపీఐ, సీపీఎంను ముందుగా తన గొడుగు కిందకు తెచ్చుకున్నారు. ఆ పార్టీల అగ్రనేతలు సీతారాం ఏచూరి, కేరళ సీఎం విజయన్, డి.రాజాను కలిశారు. బీఆర్‌ఎస్‌లో చేరకపోయినా దేశంలోని అన్ని రాష్ట్రాలలో కొత్త పార్టీని విస్తరించడానికి అవసరమైన సాయం వాళ్ల నుంచి తీసుకోవాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. మూలమూలనా ఉన్న వాళ్ల రైతు సంఘాలకు, ట్రేడ్‌ యూనియన్లకు, ఇతర ప్రజాసంఘాలకు ఉన్న సంబంధాలను వాడుకోవచ్చనుకుంటున్నారు. ఆయా రాష్ట్రాలు, జిల్లాలో బీఆర్‌ఎస్‌ శాఖలను ఏర్పాటు చేయవచ్చు. ఈ సంఘాల్లోని కొందరు నేతలను పార్టీలో చేర్చుకోవచ్చు కూడా గులాబీ బాస్‌ ఆలోచిస్తున్నారు.

-పలువురితో చర్చలు
ఈ కీలక కర్తవ్యాన్ని టీఆర్‌ఎస్‌లో లెఫ్టిస్ట్‌ ఫేస్‌గా ఉన్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కు కేసీఆర్‌ అప్పగించారు. వినోద్‌ ఇప్పటికే తెలంగాణకు, ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు మేధావులను, ప్రజాసంఘాల నేతలను కలిశారు. వారి నుంచి సానుకూల సంకేతాలే వెలువడుతున్నట్లు ప్రగతిభవన్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రధాని మోదీ రామగుండం పర్యటన సందర్భంగా అడ్డుకుంటామన్న పలు వామపక్ష సంఘాల ప్రకటనలను, మేధావుల పేరుతో విడుదలైన బహిరంగ లేఖను మనం ఈ కోణంలోనే చూడవచ్చు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరింత ఎక్కువగా జరుగుతాయని, బీజేపీని రాజకీయంగా ఏకాకి చేసేందుకు ప్రయత్నిస్తారని అంటున్నారు.

-ఢిల్లీ పీఠంపైనే గురి..
కాషాయ వ్యతిరేక యుద్ధంలో కలిసివచ్చే ఏ శక్తులనూ వదులుకోవద్దని కేసీఆర్‌ భావిస్తున్నారు. స్వతంత్రంగా ఉన్న లౌకిక శక్తులను, మార్క్సిస్టు–లెనినిస్టు–మావోయిస్టు సిద్ధాంతాన్ని అనుసరించే విప్లవ శక్తులనూ కలుపుకుని వెళ్లడానికి పావులు కదుపుతున్నారు. గౌరీ లంకేశ్‌ హత్య, బీమా–కోరేగాం అరెస్టులు, అర్బన్‌ నక్సలైట్ల పేరుతో వేధింపుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా మేధావులు, విద్యావంతులు మోదీ సర్కారుపై ఆగ్రహంతో ఉన్నట్లు కేసీఆర్‌ గుర్తించారు. ఇలాంటి శక్తులను చేరదీయడం ద్వారా తన పోరాటానికి నైతిక మద్దతు పెరగడమే కాకుండా సైద్ధాంతిక ప్రాతిపదిక కూడా ఏర్పడుతుందని భావిస్తున్నారు. తద్వారా దళితులు, బహుజనులు, మైనారిటీలకు దగ్గర కావచ్చని ఎత్తులు వేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంటుతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన విధంగానే బీజేపీ వ్యతిరేక ఎజెండాతో భారతదేశమంతా విస్తరించి కాలం కలిసి వస్తే ఢిల్లీ పీఠం ఎక్కాలని కలలు కంటున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.