https://oktelugu.com/

కరోనా టీకా ధరలు న్యాయమేనా?

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత ఊరికే పుట్టలేదు. ఇంతటి కరోనా కల్లోలం లోనే నాలుగు రాళ్లు సంపాదించుకోవాలని కరోనా టీకా తయారీ కంపెనీలు భావిస్తున్నాయి. ఇన్నాళ్లు కేంద్రప్రభుత్వానికి రూ.150కే టీకాను అమ్మాయి. ఆ రూ. 150 కూడా తమకు లాభమేనని స్వయంగా సీరమ్ సంస్థ సీఈవో అధర్ పూనావాలా తెలుపడం విశేషం. మరి ఇప్పుడు అంతే ధరకు కేంద్రప్రభుత్వానికి అమ్మొచ్చు కదా. అంటే కుదరదు అంటున్నాయి. కొత్తలో దేశ ప్రజల కోసం తక్కువకు పంపిణీ చేసిన […]

Written By:
  • NARESH
  • , Updated On : April 25, 2021 / 12:01 PM IST
    Follow us on

    దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత ఊరికే పుట్టలేదు. ఇంతటి కరోనా కల్లోలం లోనే నాలుగు రాళ్లు సంపాదించుకోవాలని కరోనా టీకా తయారీ కంపెనీలు భావిస్తున్నాయి. ఇన్నాళ్లు కేంద్రప్రభుత్వానికి రూ.150కే టీకాను అమ్మాయి. ఆ రూ. 150 కూడా తమకు లాభమేనని స్వయంగా సీరమ్ సంస్థ సీఈవో అధర్ పూనావాలా తెలుపడం విశేషం. మరి ఇప్పుడు అంతే ధరకు కేంద్రప్రభుత్వానికి అమ్మొచ్చు కదా. అంటే కుదరదు అంటున్నాయి.

    కొత్తలో దేశ ప్రజల కోసం తక్కువకు పంపిణీ చేసిన సంస్థలు ఇప్పుడు కేవలం 50శాతం మాత్రం కేంద్రానికి ఇచ్చి బయట మార్కెట్లో, పలు రాష్ట్రాలకు అంతకు మూడు రెట్లు ఎక్కువకు అమ్ముతున్నాయి. ఇది న్యాయమేనా? అన్న విమర్శలు దేశ ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.

    తాజాగా దీనిపై కేంద్రం ఆర్థికశాఖ మాజీ మంత్రి చిదం బరం కూడా ట్వీట్‌ చేసి కడిగేశాడు. “కోవిషెల్డ్ టీకా ధరలు ప్రభుత్వాలకు రూ. 400 మరియు ప్రైవేటుకు రూ. 600 ధరలను సమర్థించిన వారు ఈ రోజు ప్రకటించిన రూ.600 -రూ.1200 కోవాక్సిన్ ధరలను కూడా సమర్థిస్తారా?” అంటూ ప్రశ్నలు సంధించాడు. “ప్రభుత్వం ఈ విషయంలో నిస్సహాయంగా చేష్టలుడిగి చూస్తోంది. వారి మౌనం ఇద్దరు తయారీదారుల లాభదాయకత దోపిడీని ఆమోదించినట్టు అవుతోంది. ప్రభుత్వం ఈ విపత్తు వేళ కరోనా టీకాల ధరల తగ్గింపు విషయంలో ‘తప్పనిసరి లైసెన్సింగ్’ నిబంధనను ఎందుకు అమలు చేయడం లేదు?” మరో ట్వీట్‌లో చిదంబరం చాలా విలువైన ప్రశ్నను కేంద్రానికి సంధించారు.

    ఇటీవల భారత్ బయోటెక్ తన కోవాక్సిన్ వ్యాక్సిన్ ను రాష్ట్ర ప్రభుత్వాలకు 600 రూపాయలకు.. ప్రైవేట్ ఆసుపత్రులకు 1,200 రూపాయలకు అమ్మనున్నట్లు ప్రకటన జారీ చేసింది. దేశంలో మరో ఇతర టీకా తయారీ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) అభివృద్ధి చేసిన కోవిషీల్డ్‌ టీకాను రాష్ట్రాలకు 400 రూపాయలకు విక్రయిస్తామని తెలిపింది. ప్రైవేట్ ఆసుపత్రులకు రూ .600కు ఇస్తామని తెలిపింది. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ మాత్రం ఇంతకు మించిన ధరలను ప్రకటించడం దుమారం రేపింది.

    టీకాల వేర్వేరు ధరలపై పలువురు ముఖ్యమంత్రులు ఇప్పటికే కేంద్రంపై, టీకా తయారీదారులపై మండిపడుతున్నారు. ఒకే దేశం ఒకే జీఎస్టీ అన్న మోడీ సర్కార్ కరోనా టీకా విషయంలో ఆ రూల్ ఎందుకు విధించడం లేదని.. ఒకే ధరను ఎందుకు నిర్ణయించడం లేదని ప్రశ్నిస్తున్నారు.

    దేశం కరోనా సెకండ్ వేవ్ తో అల్లకల్లోలంగా ఉంది. ప్రజలు కరోనా బారిన పడి మరణిస్తున్నారు. ఆక్సిజన్ అందక హాహాకారాలు చేస్తున్నారు. ఇలాంటి విపత్తు సమయంలో ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని టీకాలను తక్కువ ధరకు అందుబాటులో ఉంచితే ప్రజలందరూ వేసుకుంటారు. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్రాలు కూడా టీకా తయారీదారులపై ఒత్తిడి తెచ్చి ధరలను తగ్గించి.. మొత్తం డోసులను కొని  ప్రజలకు పంచాల్సిన అవసరం ఉందని మేధావులు డిమాండ్ చేస్తున్నారు. టీకాల విషయంలో లాభాపేక్ష కంటే ప్రజా ప్రయోజనాలు చూడాలని.. కేంద్రం ఈ విషయంలో చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.